బరువు తగ్గేందుకు అమెరికా వెళ్లనున్న అనుష్క

బాహుబలి, రుద్రమదేవి సినిమాల తర్వాత `సైజ్ జీరో’ కోసం బొద్దుగా తయారైన అనుష్క ఇప్పుడు బాహుబలి -2 కోసం మళ్ళీ మామూలుగా మారడానికి కసరత్తు మొదలుపెట్టింది. ఒక పక్క రాజమౌళి `బాహుబలి’ చివరి పార్ట్ కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభించినట్లు చెబుతున్నారు. దీంతో త్వరత్వరగా తన బరువును 20కిలోల మేరకు తగ్గించుకోవడం కోసం అనుష్క చురుగ్గా ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. ఇందులో భాగంగానే ఆమె అతిత్వరలోనే అమెరికా వెళ్లబోతున్నట్లు తెలిసింది. వెయిట్ లాస్ థెరపీ ద్వారా బరువు తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నదని చెబుతున్నారు.

ప్రకాష్ దర్శకత్వంలో తయారైన `సైజ్ జీరో’ చిత్రం కోసం అనుష్క చాలా బొద్దుగా తయారైంది. అయితే ఇలాగే బాహుబలి-2 సెట్స్ కి వెళితే చాలా ఇబ్బంది ఎదుర్కోవలసి వస్తుంది. బాహుబలి మొదటి పార్ట్ లో దేవసేన పాత్రపోషించిన అనుష్క హీరో శివ (ప్రభాస్)కు తల్లిగా ఉంది. నడివయస్సు పాత్ర అది. అందునా, ఖైదీగా బంధించబడిన పాత్రలో నటించాల్సి వచ్చింది. శుష్కించిన శరీరం, ఏమాత్రం తైలసంస్కారంలేని కురులు, ముఖంమీద మడతలు…ఇదీ అనుష్క మేకప్. అలాంటి కురూపి పాత్రలో సైతం అనుష్క మంచిమార్కులే కొట్టేసింది. అయితే, ఇప్పుడు బాహుబలి -2లో కథ మరోసారి ప్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. బాహుబలి (ప్రభాస్) దేవసేన (అనుష్క)ల యవ్వన ప్రాయపు ప్రేమ, శృంగార సన్నివేశాలు అందులో ఉంటాయి. అంటే అనుష్క రెండవ పార్ట్ లో చాలా అందంగా కనిపించాల్సి ఉంటుంది.

బాహుబలి సినిమా తర్వాత అనుష్క `సైజ్ జీరో’ సినిమాలో నటించింది. ఇందులో ఆమె చాలా బొద్దుగా కనిపించడంకోసం లావెక్కింది. ఇప్పుడు ఆ అవసరం తీరిపోయింది కనుక మళ్ళీ అందాలభామగా బాహుబలిలో ప్రేక్షకులను కనువిందుచేయాల్సిఉంది.

వచ్చే నెలలోనే రాజమౌళి బాహుబలి-2 సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నారు. అందుకు లొకేషన్స్ ఎంపిక శరవేగంగా జరిగిపోతున్నది. నిజానికి బాహుబలి మొదటి భాగం తీస్తున్నప్పుడే రెండవ పార్ట్ సినిమాకు సంబంధించిన 40శాతం వర్క్ అయిపోయింది. మిగతా పని వచ్చే నెలలో మొదలుపెట్టి చకచకా పూర్తిచేయాలనుకుంటున్నారు. బాహుబలి -2లో అదనంగా కొన్ని పాత్రలు కనిపించబోతున్నాయి. నటీనటుల ఎంపిక కూడా దాదాపు పూర్తయిందనే చెబుతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా బాహుబలి-2 వచ్చే ఏడాది డిసెంబర్ లోగా విడుదలచేయాలనుకుంటున్నారు.

షూటింగ్ కి సమయం దగ్గరపడటంతో అనుష్క తన అందచందాలపై శ్రద్ధపెడుతోంది. ఇప్పటికే బరువుతగ్గించేందుకు చక్కటి ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఈ దిశగానే ఆమె అమెరికావెళ్ళబోతున్నట్లు తెలిసింది. వెనక్కి వచ్చీరాగానే నేరుగా బాహుబలి -2 సెట్స్ కు వెళ్ళాల్సి ఉంటుంది.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com