ఇండస్ట్రీలో 20 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసిన హీరోయిన్స్ చాలా అరుదు. ఆ అరుదైన జాబితాలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది అనుష్క శెట్టి. సూపర్ నుంచి మొదలైన ఆమె సినీ ప్రయాణం, ఇప్పుడు విడుదలకు సిద్ధమైన ఘాటి వరకు విజయవంతంగా కొనసాగుతోంది.
అరుంధతి, సరోజ, దేవసేన, భాగమతి, రుద్రమదేవి… లాంటి ఐకానిక్ క్యారెక్టర్స్ అనుష్క ఖాతాలో ఉన్నాయి. ఇండస్ట్రీలో సోలోగానే బాక్స్ ఆఫీస్ వద్ద రాణించే స్టామినా ఉన్న హీరోయిన్స్‌లో ఇప్పుడు అనుష్క ఒక్కరే కనిపిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న ఘాటిపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
అయితే, ఈ సినిమా ప్రమోషన్లలో అనుష్క కనిపించకపోవడం అభిమానులకు, సినీ వర్గాలకు ఒక చిన్న కొరతలా అనిపిస్తోంది. కానీ దీనికి గల కారణం పూర్తిగా వ్యక్తిగతమే. నిర్మాతలకు ముందుగానే తాను ప్రమోషన్స్‌లో పాల్గొనలేనని అనుష్క చెప్పింది.
ఇదే అంశంపై డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ.. అనుష్క గారు ప్రమోషన్స్‌లో కనిపించాల్సిన అవసరం లేదు. ఆమె పెర్ఫార్మెన్స్ చాలు” అని ఓ సందర్భంలో వాఖ్యనించారు.
అయితే, అనుష్క మాత్రం ఆ మాటలతో ఏకీభవించలేదు. “క్రిష్ గారు అభిమానంతో ఆ మాట అనుంటారు. కానీ సినిమాకి ప్రమోషన్స్ చాలా అవసరం. సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే దూకుడుగా ప్రమోషన్స్ చేయాలి. ఈసారి నేను కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పాల్గొనలేకపోయాను. అది నా దురదృష్టం. క్రిష్ గారు, నిర్మాత రాజీవ్ గారు చాలా స్వీట్ పర్సన్స్. మంచి మనసుతో అర్ధం చేసుకున్నారు’ అని చెప్పింది స్వీటీ.
అనుష్క మాటల్లో వందశాతం వాస్తవం వుంది. మంచి సినిమా తీయడమే కాదు.. ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడం ఇంకా ముఖ్యం. ఇప్పుడు క్రిష్ తన శక్తివంచన లేకుండా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. దీనికి అనుష్క కూడా తోడైతే ఆ జోష్ మరో స్థాయిలో వుండేది. కాకపోతే అనుష్క ఆడియోతోనైన ఘాటీ ప్రచారంలో భాగం కావడం కొంత ఉపసమనం.