ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అతిపెద్ద అడ్డంకిని తొలగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని మంత్రివర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఏపీఐఐసీ గతంలో కేటాయించిన సుమారు 75,000 ఎకరాల భూములను రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-A నుండి తొలగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దశాబ్దాలుగా ఈ భూములు నిషేధిత జాబితాలో ఉండటం వల్ల పారిశ్రామికవేత్తలు ఆస్తులపై సర్వహక్కులు లేక, బ్యాంకు రుణాలకు దరఖాస్తు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. తాజా నిర్ణయంతో ఈ భూములకు క్లియర్ టైటిల్ లభించడమే కాకుండా, వీటిని తాకట్టు పెట్టి పెట్టుబడులకు అవసరమైన నిధులను సమీకరించుకునే వెసులుబాటు పారిశ్రామికవేత్తలకు కలిగింది.
ఈ భూముల విముక్తి ప్రక్రియను ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా చేపట్టింది. మొత్తం కేటాయింపుల్లో ఎలాంటి అభ్యంతరాలు లేని 66,157 ఎకరాలను తక్షణమే జాబితా నుండి తొలగిస్తుండగా, మిగిలిన భూములను పరిశ్రమల నిర్మాణం పూర్తయిన తర్వాత షరతులతో కూడి విడుదల చేయనున్నారు. అంతేకాకుండా, రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ ప్రభుత్వం పేరు మీద ఉన్న సుమారు 51,000 ఎకరాలను నేరుగా ఏపీఐఐసీ పేరు మీదకు మ్యుటేషన్ చేసేందుకు వన్ టైమ్ మెజ కింద అనుమతినిచ్చింది. ఈ చర్య వల్ల పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనలో వేగం పెరగడమే కాకుండా, కొత్తగా వచ్చే పెట్టుబడిదారులకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం పెరుగుతుంది.
ఏపీ ముఖ్యమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ నే సరికొత్త పథకానికి మంత్రివర్గం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 300 కోట్ల భారీ నిధిని కేటాయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 ఎంఎస్ఎంఈ పార్కుల్లో సొంతంగా తయారీ యూనిట్లు పెట్టాలనుకునే సుమారు 3,500 మంది సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక వెన్నుదన్ను లభించనుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, వికలాంగులకు ప్రాజెక్టు వ్యయంలో 25 నుండి 35 శాతం వరకు మార్జిన్ మనీ సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది.
ఈ రెండు నిర్ణయాల కలయికతో రాష్ట్రంలో భారీ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కేవలం AP-CMEGP పథకం ద్వారానే సుమారు 17,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అటు నిషేధిత జాబితా నుండి విడుదలైన భూముల్లో ఆగిపోయిన పారిశ్రామిక ప్రాజెక్టులు పట్టాలెక్కడం వల్ల వేల సంఖ్యలో అనుబంధ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.


