త్వరలో ఏపి మంత్రివర్గ ప్రక్షాళన?

తునిలో కాపు గర్జన సభ నిర్వహించబోతున్న విషయం తెలిసినపటికీ రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీకి చెందిన నేతలు ఎవరూ మేల్కొనలేదు. కనీసం పార్టీలో, ప్రభుత్వంలో ఉన్న కాపు నేతలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు కూడా ఈ సమస్య తీవ్రతని సకాలంలో గుర్తించి తగు విధంగా స్పందించలేదు. చివరికి నిఘా వర్గాలు, పోలీసులు, హోం మంత్రి చిన రాజప్ప అందరూ కూడా ఈ సమస్యని ముందుగా గుర్తించి తగు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు. తత్ఫలితంగా తునిలో బారీ విద్వంసం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని పవన్ కళ్యాణ్ తో సహా అందరూ విమర్శిస్తున్నారు. ఈ ఘటనలు జరిగిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసరంగా మంత్రులతో సమావేశమయ్యి వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. వారి నిర్లిప్త, నిర్లక్ష్య ధోరణి కారణంగానే సమస్య ఇంత తీవ్ర రూపం దాల్చిందని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఆయన అందరికీ గట్టిగా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

బహుశః ఆ కారణంగానే ఎన్నడూ మీడియా ముందుకు రాని హోం మంత్రి చిన రాజప్ప, మండలి బుద్ధ ప్రసాద్, మాణిక్యాల రావు తదితరులు అందరూ మీడియా ముందుకు వచ్చి ముద్రగడ పద్మనాభంపై, వైకాపాపై తీవ్ర విమర్శలు చేస్తూ మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యల గురించి వివరించారు. కానీ జరుగకూడని నష్టం జరిగిపోయిన తరువాత అందరూ మేల్కొన్నారు.

ఉద్యమకారులు రైలును, పోలీస్ స్టేషన్ని, పోలీస్ వాహనాలను తగులబెట్టి రైల్ రోకో, రాస్తా రోకో చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోనందుకు కేంద్రప్రభుత్వం చాలా ఆగ్రహంగా ఉంది. అటువంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ముందుగా పసిగట్టి తగిన భద్రతాఏర్పాట్లు చేయకపోయిందని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించిన తరువాత మేల్కొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడుతున్నారు. తునిలో మళ్ళీ ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా బారీగా పోలీసులను మొహరించబడ్డారు. ఇదే పని వారు మొదటే చేసి ఉండి ఉంటే పరిస్థితులు ఇంత వరకు వచ్చేవే కావు.

కాల్ మనీ, కల్తీ మద్యం, ఇసుక మాఫియా వంటి వ్యహారాలలో ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం తీవ్ర అప్రదిష్టపాలయింది. ఇప్పుడు తుని ఘటనలతో ఇంకా అప్రదిష్ట మూటగట్టుకొన్నట్లయింది. పనిచేయని మంత్రులను తప్పిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కాలంగా హెచ్చరిస్తున్నప్పటికీ మంత్రులు ఎవరూ ఆయన హెచ్చరికలను సీరియస్ గా తీసుకొన్నట్లు లేరు. వారి నిర్లిప్త, నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తోంది కనుక త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళన చేసి పనిచేయని మంత్రులందరికీ ఉద్వాసన పలకవచ్చని తాజా సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com