వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు కోసం దావోస్లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా ప్రపంచ వేదికపై ఆవిష్కరిస్తున్నారు. CII ఆధ్వర్యంలో జరిగిన జియోగ్రఫీ ఆఫ్ గ్రోత్ – ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అనే సెషన్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయిన ఆయన, ఆంధ్రప్రదేశ్ కేవలం పెట్టుబడులకు గమ్యస్థానం మాత్రమే కాదని, అది ఒక వ్యూహాత్మక ప్రయోజనమని గట్టిగా వినిపించారు.
భారతదేశానికి వచ్చే మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో దాదాపు పావు వంతు ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తోందని, వ్యాపార నిర్వహణలో తమ వేగం రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిందని చంద్రబాబు వివరించారు. ఈ సెషన్లో మారిలిన్ బ్లాట్నర్-హోయల్, రిచర్డ్ వర్మ, రాజీవ్ మెమాని వంటి ప్రముఖులతో కలిసి ఆయన ఏపీ బలాబలాలను చర్చించారు. దీర్ఘకాలిక వృద్ధిలో భాగస్వాములు కావాలని అంతర్జాతీయ పారిశ్రామిక సమాజానికి ఆయన ఈ వేదిక ద్వారా పిలుపునిచ్చారు.
యూఏఈ ఆర్థిక . పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో చంద్రబాబు జరిపిన భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆహార శుద్ధి పరిశ్రమలు, మల్టీమోడల్ లాజిస్టిక్స్, ఇంధన రంగం, రేవుల అభివృద్ధి, రిటైల్ రంగాలలో పరస్పర సహకారంపై వీరు సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ , యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కొత్త ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలను ఈ సందర్భంగా పరిశీలించారు.
ఏపీలో ఉన్న మౌలిక సదుపాయాలు, నిపుణులైన మానవ వనరులు , ప్రభుత్వ అనుకూల విధానాలను గమనించిన పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ దావోస్ పర్యటన ద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ,ఉపాధి అవకాశాలు వస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
