ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు , కాంట్రాక్టర్లకు భారీ ఊరటనిస్తూ సంక్రాంతి కానుక ప్రకటించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మొత్తం రూ. 2,653 కోట్ల నిధులను విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాం నుండి పెండింగ్లో ఉన్న బకాయిలను క్లియర్ చేయడం ద్వారా దాదాపు 5.70 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పండుగ వేళ ఆర్థిక వెసులుబాటు కలిగింది.
ఉద్యోగుల డీఏ , డీఆర్ ఎరియర్స్ కోసం రూ. 1,100 కోట్లు కేటాయించారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.25 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు, 2.70 లక్షల మంది పెన్షనర్లకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. అలాగే, క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమించే 55 వేల మంది పోలీసు సిబ్బందికి సంబంధించి సరెండర్ లీవుల బకాయిల నిమిత్తం రూ. 110 కోట్లు మంజూరు చేశారు.
కాంట్రాక్టర్ల విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాబార్డు, ఈఏపీ, సాస్కీ వంటి పథకాల కింద చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి రూ. 1,243 కోట్లు విడుదల చేసింది. ఇందులో భాగంగానే గత ఐదేళ్లుగా వివాదాస్పదంగా మారిన ‘నీరు-చెట్టు’ పనుల బిల్లుల కోసం సుమారు రూ. 40 కోట్లు కేటాయించారు. ఈ నిర్ణయంతో 19 వేల మందికి పైగా కాంట్రాక్టర్లకు ఊరట లభించింది. ముఖ్యంగా 2014-19 మధ్య కాలంలో పనులు చేసి, గత ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురైన టీడీపీ కేడర్ , చిన్న తరహా కాంట్రాక్టర్ల బకాయిలను కూడా ఈ విడతలో క్లియర్ చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది.
సంక్రాంతి వేళ లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు రాజకీయంగానూ, పరిపాలనాపరంగానూ కూటమి ప్రభుత్వానికి సానుకూల అంశంగా మారాయి. బకాయిల చెల్లింపు విషయంలో పారదర్శకత పాటిస్తామని, ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ప్రభుత్వం చెప్పినట్లయింది.
