ఆంధ్రప్రదేశ్లో మరో 13 శాతం మద్యం షాపులు తగ్గించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. ఇక ఏపీలో 2934 దుకాణాలు మాత్రమే ఉండనున్నాయి. గతంలో తగ్గించిన 20శాతంతో కలిపి మొత్తం 33శాతం తగ్గిన షాపులు తగ్గించినట్లవుతుంది. నెలాఖరు నాటికి ప్రస్తుతం ఉత్తర్వులు ఇచ్చిన 13 శాతం దుకాణాలు తగ్గిస్తారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని.. ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏప్రిల్ నెలాఖరు వరకు చూస్తే… అంతకు ముందు ఏడాది అన్ని రకాల మద్యం వినియోగం దాదాపుగా 30 శాతం తగ్గినట్లుగా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
అయితే.. ఇందులో నెలన్నర రోజుల పాటు అసలు మద్యం దుకాణాలు ప్రారంభించలేదు. మద్యం వినియోగం తగ్గడం సంగతేమో కానీ..ప్రభుత్వానికి ఆదాయం మాత్రం పిసరంత కూడా తగ్గలేదని.. ఇంకా పెరిగిందని మాత్రం స్పష్టమవుతోంది. లాక్డౌన్ తర్వాత మద్యం అమ్మకాలు ప్రారంభించిన తొలి రోజు మందుబాబుల నుంచి ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.68కోట్లు. ఆ తర్వాత కూడా.. జోరు తగ్గలేదు. ఆ తర్వాత రోజే మరో యాభై శాతం రేట్లు పెంచి.. మధ్యాహ్నం తర్వాత ప్రారంభించడంతో కాస్త ఆదాయం తగ్గింది.
రెండో రోజు రూ.28కోట్ల అమ్మకాలు జరిగాయి. మూడోరోజు రూ.47కోట్లు, నాలుగోరోజు రూ.39కోట్లు, ఐదోరోజు రూ.38కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ధరలు భారీగా పెంచడం వల్లే.. వినియోగం తగ్గిందని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ముందుగా చెప్పినట్లుగా ఏడాదికి ఇరవై శాతం దుకాణాలు తగ్గిస్తూ.. పోతామని… చివరికి స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం అమ్మకాలు జరిగేలా చూస్తామని ప్రభుత్వం చెబుతోంది.