ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ప్రభుత్వం అందించిన అతిపెద్ద ఊరట ఇంద్రధనుస్సు పథకం. బుధవారం నుంచి అధికారికంగా అమలులోకి రానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే మహిళలకు అమలవుతున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం తరహాలోనే, ఇప్పుడు దివ్యాంగులకు కూడా వంద శాతం రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.
సహాయకులకూ టిక్కెట్లో రాయితీ
40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు , ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఈ ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుంది. తీవ్ర వైకల్యం ఉండి తోడుగా ఎవరైనా రావాల్సి వస్తే, ఆ సహాయకుడికి టికెట్ ధరలో 50 శాతం రాయితీ కల్పిస్తారు. ప్రస్తుతం ఉన్న రాయితీ పాస్‌లు ఉన్నవారు వాటితోనే ప్రయాణించవచ్చు. కొత్త వారు సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డుతో పాస్‌లకు దరఖాస్తు చేసుకోవాలి.
బస్సుల్లో విపరీత రద్దీ
దివ్యాంగుల ఆర్థిక భారాన్ని తగ్గించి, వారిని సామాజికంగా మరింత చైతన్యవంతులను చేయడంలో ఈ నిర్ణయం గొప్ప ముందడుగు. వైద్యం, విద్య , ఉద్యోగ అవసరాల కోసం ప్రయాణించే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే, ఇప్పటికే మహిళల ఉచిత ప్రయాణం వల్ల బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కనీసం నిలబడటానికి కూడా చోటు దొరకని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో దివ్యాంగులకు ప్రత్యేక సీట్లు కేటాయించడం, వారు క్షేమంగా బస్సు ఎక్కేలా చూడటం కండక్టర్లకు సవాలుగా మారనుంది.
బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల సంఖ్య ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా లేదనే విమర్శలు ఉన్నాయి. అనేక పాత బస్సులు మూలనపడటం, కొత్త బస్సుల చేరిక ఆలస్యం కావడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఉచిత ప్రయాణ పథకాల అమలుతో డిమాండ్ పెరుగుతున్నందున తక్షణమే బస్సుల సంఖ్యను పెంచకపోతే దివ్యాంగులకు ఈ సౌకర్యం ఉన్నప్పటికీ రద్దీ కారణంగా వారు బస్సు ఎక్కడం కష్టతరంగా మారే ప్రమాదం ఉంది. బస్సుల సంఖ్య పెంచి, మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తేనే ఈ పథకం లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరుతుంది.
