ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026 బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభ ముందుకు రానుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు.
ఈ బిల్లుపై చర్చను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభిస్తారు. తెలుగుదేశం పార్టీ తరపున పెమ్మసానితో పాటు మరో ఇద్దరు ఎంపీలు ఈ చర్చలో పాలుపంచుకోనున్నారు. అటు బీజేపీ నుంచి ఎంపీ పురందేశ్వరి, జనసేన పార్టీ నుంచి ఒక ఎంపీ అమరావతి ఆవశ్యకతను, ఈ బిల్లు వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను సభకు వివరించనున్నారు. తర్వాత సభ ఆమోదం పొందుతుంది. గురువారం ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. తాము మాట్లాడతామని వైసీపీ సభ్యులెవరూ ఇప్పటి వరకూ అధికారికంగా స్పీకర్ కార్యాలయాన్ని సంప్రదించలేదు.
ఈ బిల్లు ప్రక్రియలో కేంద్రం అత్యంత ప్రాధాన్యత కలిగిన విధానాన్ని అనుసరిస్తోంది. సాధారణంగా బిల్లులు కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటుకు వస్తాయి. అయితే, బిజినెస్ రూల్స్ 12బి నిబంధనను ఉపయోగించి, కేబినెట్ ఆమోదంతో సంబంధం లేకుండానే నేరుగా పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. గతంలో ఆర్టికల్ 370 రద్దు, జమ్ము-కశ్మీర్ పునర్విభజన వంటి అత్యంత కీలకమైన అంశాల్లో మాత్రమే కేంద్రం ఈ తరహా వ్యూహాన్ని అమలు చేసింది. ఇప్పుడు అమరావతి విషయంలోనూ అదే దూకుడును ప్రదర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లు కేంద్ర మంత్రిమండలి ముందుకు వెళ్తుంది. అక్కడ లాంఛనప్రాయ ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది.
