రైతుల్ని ఎర్రిపప్ప అని తిట్టి.. ఎర్రిపప్ప అంటే బుజ్జికన్నా అని అర్థం చెప్పిన కారుమూరి నాగేశ్వరరావును .. జగన్ బుజ్జికన్నా చేశారు. మద్యం స్కాంలో అడ్డంగా ఇరికించేశారు. జగన్ రెడ్డి అవినీతి మోడల్ ఎవరూ ఊహించలేనిది. తాను స్కాం చేస్తారు. ఆ స్కాంలో 90 శాతం తానే తింటారు. పది శాతాన్ని మాత్రం కీలక వ్యక్తలందరికీ వివిధ రూపాల్లో పంచుతారు. వారికి స్కామ్ జరుగుతోందని తెలుసు.కానీ నోరెత్తలేరు. ఎందుకంటే జగన్ రెడ్డి తమకూ మేలు చేస్తున్నారని వారనుకుంటారు. కానీ ఎప్పుడైనా బయటపడితే తాను సేఫ్గా ఉండి అందర్నీ బలి చేయడానికి ఇలా పంచుతున్నారని వారికి తెలియదు. అంతా బయటపడి ఇరుక్కున్నాక తెలుస్తుంది. మద్యం స్కాంలో.. రవాణా పేరుతో చేసిన దోపిడీ బయటపడటంతో ఆ నేతలందరికీ ఇప్పుడు షాక్ కొడుతోంది.
మద్యం దందాపై ఎవరూ నోరెత్తకుండా రవాణా కాంట్రాక్టులు
మద్యం పాలసీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండేది. వైసీపీ నేతలు ఆ విధానాన్ని వ్యతిరేకించకుండా ఉండేందుకు జగన్ వారికి పాపంలో భాగం కల్పించారు. వివిధ విభాగాల్లో వారిని ఇన్వాల్వ్ చేశారు. రవాణా విషయంలో చాలా మందికి ఇలాంటి కాంట్రాక్టులు ఇచ్చారు. మద్యం స్కాంలో వారి ప్రేమేయం మద్యం రవాణా కాంట్రాక్టుల రూపంలో ఇచ్చారు. రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి దుకాణాలకు సరుకును చేరవేసే కాంట్రాక్టులను వైసీపీకి చెందిన చెందిన నియోజకవర్గ స్థాయి నేతలకు, వారి అనుచరులకు కట్టబెట్టారు. ఈ రవాణా ప్రక్రియలో కిలోమీటరుకు అయ్యే ఖర్చు కంటే ఐదు నుండి పది రెట్లు అదనపు ఛార్జీలను ప్రభుత్వం చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నారు. ప్రతి కేసుకు చెల్లించాల్సిన రూ. 13 ను రూ. 34 చేశారు. ఇలా అదనంగా చెల్లించిన ప్రజాధనం అంతా పరోక్షంగా పార్టీ నేతలకు చేరిన లంచంగా చేరిందన్నమాట.
నిండా ఇరుక్కున్న మాజీ మంత్రి కారుమూరి కుటుంబం
ఈ రవాణా దోపిడీ ద్వారా వందల కోట్లు పార్టీ శ్రేణుల జేబుల్లోకి వెళ్లాయి. సాధారణంగా టెండర్ల ప్రక్రియ ద్వారా రవాణా కాంట్రాక్టులు ఇవ్వాల్సి ఉండగా, గత ప్రభుత్వంలో నిబంధనలను తుంగలో తొక్కి నామినేటెడ్ పద్ధతిలో తమ వారికి దోచిపెట్టారు. ఈ దందాలో ప్రధానంగా మాజీ మంత్రి కారుమూరి కుటుంబం నిండా ఇరుక్కున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన కుటుంబసభ్యుల పేరుతో ట్రాన్స్ పోర్టు కంపెనీలు పెట్టి లిక్కర్ స్కాంలో భాగమయ్యారు. అయితే ఓ ప్రాంతానికి కారుమూరి దందా నడిపితే ఇతర ప్రాంతాలకు .. చిత్తూరు నుంచి పోటీ చేసిన ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డి, ప్రస్తుతం జనసేనలో ఉన్న ఉదయబాను అల్లుడు నరసింహారెడ్డి వంటి వారు కూడా ఈ దందాలో భాగమయ్యారు. ఇప్పుడు వీరంతా నిండా మునిగారు.
సిట్ విచారణతో రవాణా స్కాం చేసిన నేతలకు వణుకు
ఈ మద్యం రవాణా స్కామ్ బయటపడటంతో సీఐడీ మరో కేసు నమోదు చేసింది. విజిలెన్స్ అధికారుల విచారణ అనంతరం ఈనెల 10న కేసు నమోదు చేసింది సీఐడీ. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా వ్యవహరించారని ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన విచారణ బాధ్యతలను సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్ బాబుకు అప్పగించింది. సుమారు రూ.200 నుంచి రూ.400 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్దారించడంతో ….సిట్ విచారణ ప్రారంభించింది. త్వరలో ఈ కేసులో సంచలన అరెస్టులు ఉండే అవకాశం ఉంది.
