ప్రపంచ క్రికెట్లో ఎదురులేని శక్తిగా వెలుగొందిన ఆస్ట్రేలియా, ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో చతికిలపడటం క్రికెట్ ప్రేమికుల్ని విస్మయానికి గురిచేస్తోంది. జింబాబ్వే వంటి తక్కువ ర్యాంక్ జట్టు చేతిలో ఓడిపోవడం, ఆపై శ్రీలంక చేతిలో చిత్తుగా పరాజయం పాలవ్వడం నమ్మలేకపోతున్నారు. ఈ జట్టు హఠాత్తుగా ఇలా ఓడిపోవడం ప్రారంభం కాలేదు. గత కొన్నాళ్లుగా అనేక సమస్యలతో ఆటతీరు నాసికరంగా మారుతూ వస్తోంది. కొంతకాలంగా ఆ జట్టు ఎంచుకుంటున్న వ్యూహాలు, ఆటగాళ్ల ఫిట్నెస్ సమస్యలు వీరి ఓటములకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
ఎంపికలో లోపాలు – స్మిత్ వివాదం
ఆస్ట్రేలియా ఓటములకు ప్రధాన కారణంగా జట్టు ఎంపిక కనిపిస్తోంది. అనుభవజ్ఞుడైన స్టీవ్ స్మిత్‌ను మొదట జట్టులోకి తీసుకోకపోవడం, ఆ తర్వాత చివరి నిమిషంలో చేర్చుకున్నా తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. స్టీమ్ స్మిత గాయాల కారణంగా ఆడలేకపోతున్నట్లుగా ఏసీసీ టీమ్ చెబుతోంది. ఒత్తిడిలో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ఆటగాడు లేకపోవడం వల్లే జింబాబ్వేతో మ్యాచ్‌లో 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కోలుకోలేకపోయారని మాజీ దిగ్గజం మార్క్ వా వంటి వారు విమర్శిస్తున్నారు.
సూపర్ ప్లేయర్స్ కు కొదవా లేదని ఆసీస్
నిజానికి ఆసీస్ .. స్టీమ్ స్మిత్ కు గాయం అయిందనో.. మరో ప్లేయర్ అందుబాటులో లేదనో పనితీరు మందగించే జట్టు కాదు. అత్యంత ప్రతిభావంతమైన ప్లేయర్లు అందుబాటులో ఉంటారు. కానీ ఆసీస్ బౌలింగ్ విభాగం ఈ టోర్నీలో అత్యంత బలహీనంగా తయారైంది. స్టార్ పేసర్లు ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ గాయాల కారణంగా దూరమవ్వడం జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది. అనుభవజ్ఞుడైన మిచెల్ స్టార్క్ కూడా లేకపోవడంతో మిగతా ఆటగాళ్లు ఒత్తిడికి గురవుతున్నారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నిస్సంక సెంచరీ బాదుతున్నా ఆపే నాథుడే లేకుండా పోయాడు. ఆస్ట్రేలియా మీడియా ఈ బౌలింగ్ ప్రదర్శనను టూత్‌లెస్ గా అభివర్ణించింది.
ఉపఖండ పరిస్థితుల్లో తడబాటు
ఆస్ట్రేలియా ఆటతీరు గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్లో ఆశించిన స్థాయిలో లేదు. ముఖ్యంగా స్పిన్‌కు అనుకూలించే ఆసియా పిచ్‌లపై ఆసీస్ బ్యాటర్లు ఘోరంగా విఫలమవుతున్నారు. జింబాబ్వేతో మ్యాచ్‌లో స్లో పిచ్‌పై ఆడలేక 146 పరుగులకే ఆలౌట్ అవ్వడం, శ్రీలంక స్పిన్నర్ల ధాటికి ఇన్నింగ్స్ చివర్లో కుప్పకూలడం చూస్తుంటే.. వేగవంతమైన పిచ్‌లపై ఆడే ఆసీస్ బ్యాటర్లు స్లో కండిషన్స్‌లో పూర్తిగా తేలిపోతున్నారని స్పష్టమవుతోంది.
టీ 20లను ఆసీస్ లైట్ తీసుకుంటోందా?
టెస్టులు, వన్డేలపై చూపే శ్రద్ధను ఆస్ట్రేలియా టీ20లపై చూపడం లేదనే విమర్శ కూడా ఉంది. స్టార్ ఆటగాళ్లు గాయాల సాకుతో దూరం కావడం, యువ ఆటగాళ్లపై అతిగా ఆధారపడటం వారి కొంపముంచింది. ప్రపంచ ఛాంపియన్లుగా ఉన్న గర్వం జింబాబ్వే వంటి జట్లను తక్కువ అంచనా వేసేలా చేసిందని, అదే నేడు ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితికి దారితీసిందని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.
