ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. అయితే, విద్యార్థుల వార్షిక పరీక్షలు, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి కీలక అంశాల కారణంగా ఈ ఎన్నికలు వేసవి తర్వాతే ఉండవచ్చని స్పష్టమవుతోంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ట్రిపుల్ టెస్ట్ నిర్వహించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో స్వతంత్ర కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి 45 రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉండటంతో, మార్చి నెలాఖరు వరకు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది.
పరీక్షల షెడ్యూల్‌తో ముడిపడి ఉన్న ఎన్నికలు
సాధారణంగా ఫిబ్రవరి, మార్చి , ఏప్రిల్ నెలల్లో పాఠశాల, కళాశాల విద్యార్థులకు కీలకమైన బోర్డు పరీక్షలు జరుగుతాయి. ఈ సమయంలో పోలింగ్ కేంద్రాలుగా పాఠశాలలను ఉపయోగించడం, ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దీనికి తోడు రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాతే వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈ సాంకేతిక కారణాల దృష్ట్యా పరీక్షలు ముగిశాకే మే లేదా జూన్ నెలల్లో స్థానిక సమరానికి నోటిఫికేషన్ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.
కొత్త ఎస్ఈసీగా నీరభ్ కుమార్ ప్రసాద్?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం నియమించిన ప్రస్తుత ఎస్ఈసీ నీలం సహాని పదవీకాలం త్వరలో ముగియనుంది. కొత్త ఎస్ఈసీగా రాష్ట్ర మాజీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అనుభవజ్ఞుడైన అధికారిని ఈ కీలక పదవిలో నియమించడం ద్వారా ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఆయన నియామకం పూర్తయ్యాకే ఎన్నికల షెడ్యూల్ పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
పారదర్శకతే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు
గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అక్రమాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎక్కడా విమర్శలకు తావులేకుండా పారదర్శకంగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందుకే బీసీ రిజర్వేషన్ల శాస్త్రీయ లెక్కింపు కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ఇచ్చే గణాంకాల ఆధారంగానే బీసీలకు న్యాయబద్ధంగా సీట్లు కేటాయించనున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితాల సవరణకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, పూర్తిస్థాయి నోటిఫికేషన్ మాత్రం రాజకీయ , విద్యాపరమైన సమీకరణల తర్వాతే వెలువడనుంది.
