బాబు మైండ్ సెట్ ఏమీ మారలేదా?

పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఇటీవల విజయవాడలో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ, “రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత సామాజిక, ప్రాంతీయ అసమానతలు బాగా పెరిగిపోతున్నాయి. తెదేపా ప్రభుత్వం తీసుకొంటున్న వివాదాస్పద నిర్ణయాల వలన రాష్ట్రంలో వివిధ వర్గాలు, ప్రాంతాల మధ్య సమతుల్యత దెబ్బ తింటోంది. అభివృద్ధిని అంతా రెండు జిల్లాలోనే కేంద్రీకరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను చూస్తుంటే ఇదివరకు హైదరాబాద్ విషయంలో జరిగిన పొరపాటు మళ్ళీ పునరావృతం అయ్యేట్లుంది. దాని వలన మళ్ళీ సమస్యలు వస్తాయని చెపుతున్నా చంద్రబాబు నాయుడు వినే పరిస్థితిలో లేరు,” అని అన్నారు.

రాష్ట్రంలో రెండు జిల్లాలలోనే అభివృద్ధిని కేంద్రీకృతం చేయడం గురించి, వాటి దుష్ఫలితాల గురించి రఘువీరా రెడ్డి చెప్పిన విషయాలు నూటికి నూరు శాతం నిజమని అంగీకరించక తప్పదు. నెల్లూరు, చిత్తూరు, కర్నూలు,అనంతపురం విశాఖ జిల్లాలలో ప్రభుత్వం కొన్ని పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలు, ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినప్పటికీ, రాష్ట్రంలో మిగిలిన జిల్లాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు దృష్టి ఎంతసేపు రాజధాని నిర్మాణంపైన, తప్పితే ఆ పరిసర ప్రాంతాలలో ఇంకా కొత్తగా ఏమేమి సంస్థలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలనే దానిపైనే ఉంది తప్ప ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, జిల్లాల అభివృద్ధికి ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అలాగని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు,అనంతపురం సీమ జిల్లాలలో గొప్పగా అభివృద్ధి జరిగిపోతోందని చెప్పడానికీ లేదు. ఏదో కంటి తుడుపు చర్యగా కొన్ని మొదలుపెట్టారు అంతే.

చంద్రబాబు నాయుడు అధికార వికేంద్రీకరణకు కూడా అసలు ఇష్టపడటం లేదు. విశాఖలో హైకోర్టు, రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని విశాఖవాసులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాతో బాటు రైల్వే జోన్ ప్రతిపాదనను కూడా పక్కన పెట్టేసినట్లు వార్తలు వచ్చేయి. విశాఖలో హైకోర్టును ఏర్పాటు చేయాలనే విశాఖవాసుల డిమాండ్ ని రాష్ర్ట ప్రభుత్వం అసలు పట్టించుకొనే లేదు. పైగా ప్రజాభీష్టానికి విరుద్దంగా విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకి ప్రభుత్వం అనుమతించింది. ఇటువంటి కారణాల చేత రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలలో చాలా ఆసంతృప్తి నెలకొని ఉంది.

కానీ అసంతృప్తి వ్యక్తం చేస్తే తెదేపా నేతలు, మంత్రులు మూకుమ్మడిగా దాడి చేసి వాళ్ళ నోళ్ళు మూయించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే మాట్లాడేవాళ్ళ నోళ్ళు మూయించవచ్చని కానీ వారి అభిప్రాయాలను మార్పించలేరనే విషయం గ్రహించడం లేదు. చంద్రబాబు నాయుడు పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన ‘మైండ్ సెట్’ చాలా మార్చుకొన్నానని, ప్రజాభీష్టానికి విరుద్దంగా వ్యవహరించనని నిత్యం చెప్పుకొనేవారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత మళ్ళీ అదే ధోరణిలో కొనసాగిపోతున్నట్లుంది. ఏ విషయంలో కూడా ఆయన ప్రతిపక్షాలను సంప్రదించడం లేదు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అదే మాట రఘువీరా రెడ్డి చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com