టెక్ దిగ్గజం యాపిల్ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తూ తాజాగా మరో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నగరంలోని ప్రముఖ ఐటీ కారిడార్ అయిన నానక్‌రామ్‌గూడలోని వేవ్‌రాక్ నఐటీ పార్క్‌లో అదనంగా 57,343 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను యాపిల్ లీజుకు తీసుకుంది. ఈ సరికొత్త ఒప్పందం ప్రకారం, కంపెనీ నెలకు సుమారు రూ. 71.67 లక్షల అద్దెను చెల్లించనుంది. ఐదేళ్ల కాలపరిమితితో కుదిరిన ఈ లీజు ఒప్పందం, ఇప్పటికే నగరంలో ఉన్న యాపిల్ కార్యకలాపాలకు అదనపు బలాన్ని చేకూర్చడమే కాకుండా, స్థానికంగా మరిన్ని ఉద్యోగావకాశాలకు బాటలు వేయనుంది.
వేవ్‌రాక్ క్యాంపస్‌లో యాపిల్ మొత్తం కార్యాలయ విస్తీర్ణం సుమారు 6.34 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో కూడా ఇదే క్యాంపస్‌లో 64,000 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్న యాపిల్, ఇప్పుడు వరుసగా రెండోసారి తన కార్యాలయాన్ని పెంచడం విశేషం. 2016లో కేవలం 2.32 లక్షల చదరపు అడుగులతో ప్రారంభమైన యాపిల్ ప్రస్థానం, నేడు మూడింతలు పెరగడం నగరంపై ఆ సంస్థకు ఉన్న దీర్ఘకాలిక నిబద్ధతను చాటిచెబుతోంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న యాపిల్ మ్యాప్స్ డెవలప్మెంట్ సెంటర్ గ్లోబల్ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తోంది.
యాపిల్ వంటి దిగ్గజ సంస్థలు తమ కార్యాలయాలను నిరంతరం విస్తరిస్తుండటం హైదరాబాద్ ఐటీ , కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగానికి గొప్ప ఊతాన్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లోని టాలెంట్ పూల్, మౌలిక వసతులపై గ్లోబల్ కంపెనీలకు ఉన్న నమ్మకాన్ని ఈ డీల్ సాక్ష్యంగా కనిపిస్తోంది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాల సరసన యాపిల్ తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తుండటంతో, హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ టెక్ హబ్‌గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటోంది.
