ప్రత్యేక హోదా ప్రశ్నకి కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ జవాబు

ఏపికి ప్రత్యేక హోదా అనే అంశం ప్రతిపక్ష పార్టీలకి ఒక రాజకీయ ఆయుధంగా మారింది. జమ్మిచెట్టు మీద పాండవుల అస్త్రాలు దాచిపెట్టినట్లు అటక మీద దాచి ఉంచిన ఆ ప్రత్యేకాస్త్రాన్ని అవసరమయినప్పుడు క్రిందకు దించి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై ప్రయోగిస్తుంటాయి. ఆ తరువాత మళ్ళీ భద్రంగా అటక మీద పెట్టేస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ ఆ ప్రత్యేకాస్త్రాన్ని ఈరోజు క్రిందకు అటక మీద నుంచి క్రిందకు దించి పార్లమెంటులో మోడీ ప్రభుత్వంపై ప్రయోగించింది. దానిని అడ్డుకొనే బ్రహ్మాస్త్రం ఏదీ మోడీ ప్రభుత్వం దగ్గర లేదు కనుక కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ సభ్యులకు యధాప్రకారం సంజాయిషీలు ఇచ్చుకోక తప్పలేదు.

దీనిపై ఆయన జవాబిస్తూ “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాల కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోంది. గత ఏడాదిన్నర వ్యవధిలోనే రాష్ట్రంలో అనేక ఉన్నత విద్యా, వైద్య సంస్థలు, భారీ పరిశ్రమల ఏర్పాటుకి శంఖుస్థాపనలు చేసాము. వాటిలో కొన్ని ఇప్పటికే పనిచేయడం ప్రారంభించాయి. రాజధాని, పోలవరం నిర్మాణం కోసం కూడా నిధులు ఇచ్చేము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధికంగా నిలద్రొక్కుకోవడానికి14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు వీలయినంత ఎక్కువ నిధులు కేటాయిస్తున్నాము. పోలవరం ప్రాజెక్టు గురించి బడ్జెట్ పై చర్చ జరిగినప్పుడు స్పష్టత ఇస్తాము,” అని చెప్పారు.

అయితే “పతి ప్రాణంబులు దక్క వేరేదయినా వరం కోరుకో సావిత్రీ…”అని ఆనాడు యమధర్మ రాజు చెప్పినట్లుగా, ప్రత్యేక హోదా అనే ఆ ఒక్క అంశం గురించి తప్ప వేరే అన్నిటి గురించి నేడు అరుణ్ జైట్లీ మాట్లాడారు. అదిచ్చే అవకాశం లేదని, అందుకు గల కారణాలను ఇదివరకే మోడీ ప్రభుత్వం చాలాసార్లు చెప్పింది. అయినా ప్రతిపక్ష పార్టీలు తమకు అవసరమనిపించినపుడు అటక మీద నుండి ఈ ప్రత్యేకాస్త్రాన్ని దించి మోడీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలపై ప్రయోగిస్తూనే ఉంటాయి. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఇదే స్టోరీ రిపీట్ చేస్తుంటే వింటూనే ఉంటాము.

“సాధ్యం కాదని తెలిసి ఉన్నా ఎన్నికలలో గెలిచేందుకే ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చినందుకు లెంపలు వేసుకొంటున్నాము. ప్రత్యేక హోదా ఇవ్వడం ఇంకా సాధ్యం కాదు,” అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దైర్యంగా చెప్పుకోగలిగినప్పుడే దీనికి ముగింపు వస్తుంది. కానీ తెదేపా,బీజేపీలు ఎన్నటికీ ఆపని చేయలేవు కనుక ఇది మరో మూడేళ్ళయినా రావణ కాష్టంలాగ రగులుతూనే ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com