కొత్త ముక్క లేని జైట్లీ జవాబు

తెలుగుదేశం ఎంపిల ఆందోళనకు కేంద్రం కొంతవరకూ దిగివచ్చిందని అనుకూల కథనాలు దర్శనమిస్తున్నాయి. ఎపి విభజన చట్టంలోని హామీలన్నిటికీ కట్టుబడి వున్నామని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో మాట్లాడ్డమే మహావరప్రసాదమైనట్టు మోత మోగుతున్నది. తమాషా ఏమంటే ఈ ప్రసంగంలో ఒక్క ముక్క కూడా కొత్తది లేదు. పైగా పాత వాటిని కూడా తిరగదోడే ధోరణి కనిపించింది. ఉదాహరణకు రెవెన్యూలోటు లెక్కకట్టే విధానమే లేదని జైట్లీ సెలవిచ్చారు, అయితే కేంద్ర రాష్ట్రాలు ఈ నాలుగేళ్లు నాటకాలాడినట్టు భావించాల్సి వుంటుంది. వాస్తవానికి 2016 సెప్టెంబరులో ప్యాకేేజీ ప్రహసనానికి సూత్రధారి జైట్లీయే కాగా ఇప్పటి వరకూ సరిగ్గా నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందీ ఆయనే. మళ్లీ ఆయనే పెద్ద మనిషిలాగా వివరణ ఇవ్వడం అదే విజయమన్నట్టు మీడియా చెప్పడం అర్థ రహితం. కనీసం రాజకీయ బాధ్యత తీసుకోకుండా కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎపి ఆర్థిక కార్యదర్శిని పిలిపించి మాట్లాడతారని ప్రకటించి చేతులు దులుపుకున్నారు జైట్లీ.ఈ సమాధానం తర్వాత తెలుగుదేశం ఎంపిలెవరూ లేచి మాట్లాడకపోవడం గమనించదగ్గది.ఇక లోక్‌సభలో ప్లకార్డులు ప్రదర్శించిన టిడిపి ఎంపిలు బిజెపిని వదిలేసి కాంగ్రెస్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గేకు అడ్డు తగలడం హాస్యాస్పదంగా నడిచింది. నిన్న పెద్దగా స్పందించని వైసీపీ ఎంపిలు కూడా ఈ రోజు నిరసనలు వెల్లడించారు. జైట్లీ మాటలతో టిడిపి చల్లబడిపోయేట్టయితే మాత్రం అంతా అవగాహన ప్రకారమే చేసినట్టు భావించాల్సి వుంటుంది. 8వ తేదీన వామపక్షాలు వైసీపీ కాంగ్రెస్‌ల మద్దతుతో చేస్తున్న బంద్‌పట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరు కూడా చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.