కాంగ్రెస్ నేతలు ఉండవల్లి అరుణ్ కుమార్; ఎస్.జైపాల్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్ర విభజనపై రెండేళ్లు గడిచిపోయిన తర్వాత పరిణామాలపై వాదించుకోవడం హాస్యాస్పదంగా వుంది. చెప్పాలంటే ఇది పూర్తిగా దండగమారి వ్యవహారం. దీనిపై అరుణ్ కుమార్ వేసిన కేసు వల్ల కూడా కలిగే ఉపయోగం లేదు.తెలంగాణ ఏర్పాటు విషయంలో జైపాల్‌రెడ్డిది ఎప్పుడూ కొంత భిన్నమైన విధానమే. నాకు, టీవీ ప్రేక్షకులందరికీ తెలిసిన ఒక సీనియర్ పాత్రికేయుడున్నారు. జైపాల్‌రెడ్డి గురించి తనో మాట చెప్పాడు. 2009 ఎన్నికలలో పోటీ చేసినప్పుడు ఆయనన ఇంటర్వ్యూ చేశాడట. దీనికి ఏం శీర్షిక నిస్తున్నావు అని జైపాల్ అడిగితే తెలంగాణ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోలేదు అనే పాయింటుకు శీర్షిక పెడుతున్నాను అన్నాడా సీనియర్ జర్నలిస్టు. అదే సరైంది, నేనూ అది చెప్పాలనే అడిగాను అన్నారట జైపాల్. ఇక ఉండవల్లి అరుణ్‌కుమార్ వంటి వారు ఆఖరు దశకు వచ్చాక గాని బయిటపడి మాట్లాడలేదు. వారేం చెప్పినా కాంగ్రెస్ నాయకత్వం రాజకీయ కోణంలో నిర్ణయం తీసేసుకుంది.
అయితే అది ఎన్నికల ముందు ప్రకటిస్తేనే రాజకీయ లాభం అన్నది కాంగ్రెస్ ఆలోచన. 2009 డిసెంబర్9 ప్రకటన మరుసటిరోజునే ఎన్టివి చర్చలో నేను చెప్పాను ఇంకా చాలా తతంగం నడుస్తుంది అని. ఆ మరుసటి రోజు టివి9 చర్చకు వచ్చిన కాంగ్రెస్ (తెలంగాణ)ఎంఎల్ఎ అయితే మరో రెండు ఎన్నికలకైనా దీన్ని వాడుకుంటాం అన్నాడు. నిజంగానే అయిదేళ్ల తర్వాత గాని దానికి బిల్లు రూపం ఇవ్వలేదు. రెండు ప్రాంతాల్లో రెండు రకాలుగా మాట్లాడటానికి సిపిఎం తప్ప తక్కిన పార్టీల నాయకత్వాలు అనుమతించడంలోనే ఒక ద్వంద్వనీతి వుందనేది స్పష్టం. లోక్‌సభ వేదికపై అది పరాకాష్టకు చేరి గందరగోళ ప్రహసనం సృష్టించింది. బిజెపి కూడా బలపర్చింది. అయినా సరే ఆ ఓటింగు సమయంలో తగినంత మంది లేరని అరుణ్ కుమార్ అంటారు. లేకపోతే వాయిదావేసి మరోరోజున తీసుకోవడానికి కూడా పెద్ద నాయకులకు అభ్యంతరం వుండదు. ఇదే తతంగం పునరావృతం చేసే బదులు అక్కడిక్కడే అయిందనిపించారు. జైపాల్ సలహా ఇవ్వకపోతే స్పీకర్ మరో రకంగా చేసేవారన్నది వూహాగానం మాత్రమే. ఇందులో జైపాల్ రెడ్డికి లేనిపోని క్రెడిట్ ఇవ్వడం కూడా అనవసరం. ఏది ఏమైనా విభజన బిల్లు ఆమోదించాలనే పాలక ప్రదాన ప్రతిపక్షాలు నిర్ణయానికి వచ్చాయి. అంతే. ఖచ్చితంగా చెప్పాలంటే కెసిఆర్ ఈ పరిస్థితిని సృష్టించలేదు, పయోగించుకున్నారంతే.కొంతమంది తప్పు అన్నా మరికొంతమంది గొప్పఅన్నా ఈ నిర్ణయం కాంగ్రెస్ వ్యూహంలో భాగం. అయినపెళ్లికి మేళంలా దీనిపై మాజీలు వాదులాడుకోవడం మరింత శిరోభారం తప్ప దమ్మిడీ ప్రయోజనం లేదు. ఈ వాదనలు చేయడం ద్వారా తమతమ రాష్ట్రాల ప్రజల మెప్పు పొందాలనే ప్రయత్నానికి మాత్రమే ఇవి తోడ్పడతాయి. ఇరువైపులా ప్రజటు అస్సలు పట్టించుకోరు.