రివ్యూ: ‘సార్ప‌ట్ట‌’

స్పోర్ట్స్ డ్రామా అంటే మ‌న‌వాళ్ల‌కు క్రికెట్…. లేదంటే బాక్సింగ్ క‌థ‌లే ముందు గుర్తొస్తాయి. వాటి ఫార్మెట్లు కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. స్పోర్ట్స్ పై ఆస‌క్తి ఉన్న హీరో, ఆ ఆట‌ల్లో ఉన్న ఒడిదుడుకులు, రాజ‌కీయాలు.. అట్ట‌డుగు స్థాయి నుంచి హీరోగా ఎద‌గ‌డం, ప‌త‌నం.. మ‌ళ్లీ.. గెల‌వ‌డం – సుల్తాన్ నుంచి దంగ‌ల్ వ‌ర‌కూ అన్నీ ఈ త‌ర‌హా క‌థ‌లే. ఇప్పుడు మ‌రో స్పోర్ట్స్ డ్రామా వ‌చ్చింది. అదే.. `సార్ప‌ట్ట‌`. బాక్సింగ్ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఆర్య – పా.రంజిత్ కాంబినేష‌న్ కావ‌డంతో `సార్ప‌ట్ట‌`పై ఆస‌క్తి నెల‌కొంది. ఈ సినిమా ఇప్పుడు నేరుగా ఓటీటీ (అమేజాన్ ప్రైమ్‌)లోనే విడుద‌లైంది. మ‌రి `సార్ప‌ట్ట‌` ఎలా వుంది? స్పోర్ట్స్ డ్రామాలో కొత్త‌గా క‌నిపించే అంశాలేంటి?

ఎమ‌ర్జన్సీ రోజుల‌వి. చెన్నైలో.. బాక్సింగ్ కి మంచి ఆద‌ర‌ణ ఉంటుంది. అక్క‌డ స్థానికంగా.. సార్ప‌ట్ట‌, ఇడియ‌ప్ప గ్రూపులు నువ్వా? నేనా అంటూ పోటీ ప‌డుతుంటాయి. ఈపోటీలో తిరుగులేని సార్ప‌ట్ట‌… ప‌త‌నావ‌స్థ‌లో ప‌డిపోతుంది. సార్ప‌ట్ట ఓట‌మిని రంగ‌న్ (ప‌శుప‌తి) జీర్ణించుకోలేపోతాడు. ఈసారి పోటీలో ఓడిపోతే.. సార్ప‌ట్ట‌.. భ‌విష్య‌త్తులో ఎప్పుడూ పోటీ చేయ‌ద‌ని శ‌ప‌థం చేస్తాడు. సార్ప‌ట్ట త‌ర‌పున పోరాడి గెలిపించ‌డానికి స‌రైన బాక్స‌ర్ కోసం ఎదురు చూస్తుంటాడు. రంగ‌న్‌ని ఏక‌ల‌వ్య గురువుగా భావిస్తుంటాడు.. స‌మ‌ర (ఆర్య‌). త‌న‌కి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. కానీ.. అమ్మకి ఇష్టం లేక‌పోవ‌డంతో బాక్సింగ్ జోలికి వెళ్ల‌డు. కానీ మ‌న‌సంతా బాక్సింగ్ పైనే. తాను కూడా సార్ప‌ట్ట ఓట‌మిని త‌ట్టుకోలేడు. ఈసారి సార్ప‌ట్ట‌ని తాను గెలిపిస్తాన‌ని ఛాలెంజ్ చేస్తాడు. స‌మ‌ర‌లోని బాక్సింగ్ స్కిల్స్ చూసిన రంగ‌న్ కూడా.. స‌మ‌ర‌ని ప్రోత్స‌హిస్తాడు. మెళ‌కువ‌లు నేర్పిస్తాడు. మ‌రి అస‌లైన స‌మ‌రంలో స‌మ‌ర సార్ప‌ట్ట‌ని గెలిపించాడా? లేదా? అనేది మిగిలిన క‌థ‌.

అన్ని స్పోర్ట్స్ డ్రామాల్లానే ఇది కూడా. ఓ గేమ్. అందులో రాజ‌కీయాలు. గెలుపు ఓట‌ములు. ప‌తాక స్థాయి నుంచి ప‌త‌న స్థాయికి ప‌డిపోవ‌డాలూ ఇవ‌న్నీ ఇందులోనూ క‌నిపిస్తాయి. మ‌నం ఊహించ‌ని మ‌లుపులేం ఉండ‌వు. ద‌శాబ్దాలుగా చూస్తున్న క‌థే. అయితే పా.రంజిత్ చేసింది ఏమిటంటే.. ఈ క‌థ బ్యాక్ గ్రౌండ్ ని మార్చ‌డం. క‌థ‌ని త‌మిళ‌నాడు ప్రాంతానికి ప‌రిమితం చేయ‌డం, అది కూడా ఎమ‌ర్జెన్సీ కాలాన్ని ఎంచుకోవ‌డంతో ఈ క‌థ‌కు కొత్త ఫ్లేవ‌ర్ వ‌చ్చింది. అస‌లు ఆ రోజుల్లో బాక్సింగ్ పోటీలు ఎలా జ‌రిగేవి? వాటికి ప్ర‌జ‌లు ఎంత ప్రాధాన్య‌త ఇచ్చేవారు. పోటీ వెనుక ఎలాంటి రాజ‌కీయాలు ఉండేవి..? అనే విష‌యాల‌పై రంజిత్ బాగానే క‌స‌రత్తు చేశాడు. దాంతో.. పాత క‌థే కాస్త కొత్త క‌ల‌ర్ లో క‌నిపిస్తుంది.

రంజిత్ చేసిన మంచి ప‌ని.. కేవ‌లం బాక్సింగ్ పైనే దృష్టి పెట్ట‌డం. క‌థ ఒక్క సీన్‌లో కూడా.. ఒక్క నిమిషం కూడా సైడ్ ట్రాక్ లో సాగ‌దు. ఏ ఫ్రేమ్‌లో చూసినా బాక్సింగ్ క‌నిపిస్తుంది. లేదంటే బాక్సింగ్ కి సంబంధించిన మాట వినిపిస్తుంది. ఈ విష‌యంలో రంజిత్ అంకిత భావాన్ని మెచ్చుకోవాలి. తొలి ప‌ది నిమిషాల్లోనే క‌థ ఫ్లేవ‌ర్ అర్థ‌మైపోతుంది. బాక్సింగ్ ని ప్రాణంగా చూసే రెండు గ్రూపులు.. వాటి మ‌ధ్య హీరో రావ‌డం… ఇంట్ర‌వెల్ లో బాక్సింగ్ పోరు.. ఇలా సినిమా స్పీడు స్పీడుగానే సాగుతుంది. ద్వితీయార్థంలో మాత్రం క‌థ‌నం న‌డ‌క త‌ప్పింది. హీరో మ‌ద్యానికి బాసిన అవ్వ‌డం, దారి త‌ప్ప‌డం – ఇవ‌న్నీ చూపించాడు ద‌ర్శ‌కుడు. ఆయా సన్నివేశాలు క‌థ‌కు అవ‌స‌ర‌మే. కాక‌పోతే.. మ‌రీ అంత లెంగ్త్ లో చెప్ప‌డం అవ‌స‌రం లేదేమో. సినిమా నిడివి దాదాపుగా 160 నిమిషాలు. కొన్ని స‌న్నివేశాలు ట్రిమ్ చేసుకునే అవ‌కాశం ఉంది. పైగా.. ప్ర‌తీసారీ జ‌నం గుంపులు గుంపులుగా మార‌డం, ఒక‌రిని ఒక‌రు క‌వ్వించుకోవ‌డం – ఇదే వ‌ర‌స‌. దాంతో చూసిన సీనే రిపీట్ అవుతున్న భావ‌న క‌లుగుతుంది. బాక్సింగ్ అనుభ‌వం లేని హీరో – హేమా హేమీ బాక్స‌ర్ల‌ను ఓడించ‌డం కాస్త సినిమాటిక్ లిబ‌ర్టీ. ఒక్క పాట‌లో సిక్స్‌ప్యాక్‌లు పెంచేసుకుని.. రెడీ అయిపోవ‌డం – పా.రంజిత్ లాంటి ద‌ర్శ‌కుడు కూడా ఫార్ములాకు దూరంగా జ‌రిగిపోలేడు.. అనే విష‌యాన్ని గుర్తు చేస్తుంది.

రంజిత్ కి ఓ మార్క్ ఉంది. త‌న సినిమాల్లో ఎలాగైనా స‌రే.. త‌న సామాజిక వ‌ర్గం గురించి ప్ర‌స్తావిస్తాడు. కొన్ని కీల‌క‌మైన సంభాష‌ణ‌ల చెప్పేట‌ప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో అంబేడ్క‌ర్‌, గౌత‌మ బుద్ధుని ఫొటోలు చూపించ‌డం, బీఫ్ బిరియానీ లాంటి ప‌దాలు వాడ‌డం.. పా రంజిత్ మార్క్‌. ఎమ‌ర్జెన్సీ టైమ్ క‌థ ఇది. అప్ప‌టి లీడ‌ర్ల గురించి, వాళ్ల పాలన గురించి, సినిమా న‌టులు రాజ‌కీయాల్లోకి రావ‌డం గురించి నిర్మొహ‌మాటంగా మాట్లాడాడు. క‌థానాయిక పాత్ర‌ని డిజైన్ చేసిన ప‌ద్ధ‌తి చాలా స‌హ‌జంగా ఉంటుంది. ఆ పాత్ర‌తో చెప్పించిన డైలాగులు, స‌న్నివేశాలు బాగున్నాయి.

ఆర్య మంచి న‌టుడు. ఆ విష‌యం మ‌రోసారి నిరూపిత‌మైంది. ఈ పాత్ర కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. త‌న క‌ష్టం.. బాక్సింగ్ రింగ్ లో క‌నిపించింది. మిగిలిన‌వాళ్ల‌లో చాలామంది… తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా కొత్త‌. క‌థానాయిక న‌ట‌రాజ‌న్ ల‌క్ష్మి న‌ట‌న చాలా స‌హ‌జంగా ఉంది. ప‌శుప‌తి చాలా సెటిల్డ్ గా న‌టించాడు. సాంకేతికంగా `సార్ప‌ట్ట‌` ఉన్న‌తంగా ఉంది. ముఖ్యంగా కెమెరావ‌ర్క్‌, ఆర్ట్ ఆక‌ట్టుకుంటాయి. ఆ కాలాన్ని క‌ళ్ల‌కు క‌ట్టారు. బాక్సింగ్ నేప‌థ్యంలోని స‌న్నివేశాల్ని బాగా తెర‌కెక్కించారు. మొత్తంగా `సార్ప‌ట్ట‌` ఓ రొటీన్ స్పోర్ట్స్ డ్రామానే. కాక‌పోతే… బ్యాక్ గ్రౌండ్ మారింది.

ఫినిషింగ్ ట‌చ్‌: ఆట అదే.. గ్రౌండ్ మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎయిడెజ్ కాలేజీలపై ప్రభుత్వ విధానంతో మైనస్సే !

దశాబ్దాలుగా విద్యా సేవ అందిస్తున్న ఎయిడెడ్ కాలేజీలను అయితే ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి లేకపోతే ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఎయిడెడ్ కాలేజీలు ప్రభుత్వానివిగానే సాగుతున్నాయి....

తెలంగాణలో కూడా ప్రభుత్వ మటన్ !

ఏపీ ప్రభుత్వం మటన్ మార్టుల పేరుతో ఓ కాన్సెప్ట్‌ను ‌తమ అధికార మీడియా ద్వారా ప్రజలకు తెలియచెబితే జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి పశుసంవర్థక మంత్రి అలాంటి ఆలోచనలేదని. అలా...

కేశినేనివి బెదిరింపులా ? నిజంగానే విరక్తి చెందారా ?

కేశినేని నాని ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా టీడీపీని వ్యతిరేకించే.. వైసీపీకి దగ్గరగా ఉండే మీడియాలో ప్రచారం జరిగింది. ఆయనే ఈ విషయాన్ని చెప్పినట్లుగా ఆ మీడియా చెప్పుకొచ్చింది. తన ఆశక్తతను...

టీ కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి కూడా కామెడీ అయిపోతోందా !?

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లుగా చెలామణి అయ్యే కొంత మంది నాయకులను రేవంత్ రెడ్డి ప్రణాళిక ప్రకారం సైడ్ చేస్తున్నట్లుగా ఉన్నారు. కలసి వస్తే సరే లేకపోతే వారి అసంతృప్తిని కూడా లెక్కలోకి రాకుండా...

HOT NEWS

[X] Close
[X] Close