పాకిస్థాన్ అంటేనే రెచ్చిపోయే టీమ్ ఇండియా… మరోసారి అదరగొట్టే ప్రదర్శన చేసింది. ఆసియా కప్ లో భాగంగా జరిగిన సూపర్ 4 మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థిని 6 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత టాస్ గెలిచిన భారత్.. పాకిస్థాన్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించింది. పాక్ బ్యాటర్లు సమర్థవంతంగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది పాక్. ఇది కాస్త కష్టతరమైన టార్గెట్టే. పాక్ జట్టులో ఫర్హాన్ (58), ఆయుబ్ (21) రాణించారు, భారత బౌలర్లలో శివబ్ దూబేకి 2 వికెట్లు దక్కాయి.
అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, గిల్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ తొలి వికెట్ కు 105 పరుగులు జోడించారు. ముఖ్యంగా అభిషేక్ రెచ్చిపోయాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ గా మలిచిన అభిషేక్.. 39 బంతుల్లో 74 పరుగులు చేసి భారత విజయానికి పునాదులు వేశాడు. గిల్ 47 పరుగులతో రాణించాడు. చివర్లో తిలక్ వర్మ 30 పరుగులతో విజృంభించడంతో భారత్కు 6 వికెట్ల విజయం లభించింది. శ్రీలంకతో జరిగిన తొలి సూపర్ 4 మ్యాచ్లో బంగ్లాదేశ్ విజయాన్ని అందుకొన్న సంగతి తెలసిందే. భారత్ తన తదుపరి పోరులో శ్రీలంక, బంగ్లాదేశ్లతో తలపడాల్సివుంది.