తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం చట్ట సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ను రాజ్‌భవన్‌కు పంపింది ప్రభుత్వం. ఆ ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం చేస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. ఇప్పటి వరకూ గవర్నర్ తెలంగాణ ప్రభుత్వంతో ఎలాంటి వివాదాలు పెట్టుకోలేదు. అంతా సామరస్యంగానే నడిచిపోతున్నాయి. అయితే ఆర్డినెన్స్ విషయంలో మాత్రం ఇలాంటి సామరస్యతను గవర్నర్ పాటించకపోయే అవకాశాలు ఉన్నాయని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఎందుకంటే రిజర్వేషన్లు అనే అంశంలో ఎన్నో విషయాలు ఉంటాయి. రాజ్యాంగపరమైన అంశాల్లో గవర్నర్ ఆదేశాలు జారీ చేయలేరు.
ప్రస్తుతం ఆర్డినెన్స్ ఇంకా రాజ్ భవన్ పరిశీలనలో ఉంది. గవర్నర్ ఆ ఆర్డినెన్స్ ను న్యాయ లేదా రాజ్యాంగ పరిశీలనకు పంపిస్తే కొంత సమయం ఆలస్యమవుతుంది. ఆ తర్వాత ఆ ఆర్డినెన్స్ విషయంలో నిర్ణయం తీసుకుంటారు. తిరస్కరించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి తదుపరి ప్లాన్ అమలులో ఉన్నారని అంటున్నారు. రాహుల్ గాంధీతో కలిసి నేరుగా మోదీ వద్దకు వెళ్తారని.. రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేయాలని కోరబోతున్నారని చెబుతున్నారు. అయితే .. మోదీ వద్దకు రాహుల్ అనే మాట కాస్త విచిత్రంగా ఉంది. రాహుల్ అలా వెళ్తారా లేదా అన్నది ఊహించడం కష్టం.
రేవంత్ రెడ్డి ఎలాగైనా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. తాత్కలికంగా అయినా ఆ వెసులుబాటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎంత వరకూ సక్సెస్ అవుతాయో తెలియదు కానీ.. స్థానిక ఎన్నికలు మాత్రం అప్పటి వరకూ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. కోర్టు ఆదేశాల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చినా న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకే రేవంత్ కు ఈ బీసీ రిజర్వేషన్లు పెను సవాల్ గా మారాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.