ఎట్ లాస్ట్! తెలంగాణకు బాహుబలి దొరికాడు!

Sravan Babu, Freelance Journalist

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి మూడేళ్ళ క్రితం ఓసారి విలేకరులతో మాట్లాడుతూ, కేసీఆర్‌తో తలపడటానికి బాహుబలి రావాలంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఆ బాహుబలి ఎవరు అనే ప్రశ్నకు – కేసీఆర్ గద్దెనెక్కిన ఆరున్నర ఏళ్ళకుగానూ, దుబ్బాక ఫలితంతో ఇప్పుడు ఒక సమాధానం దొరికింది. తెలంగాణ రాజకీయ యవనికపై బీజేపీ ఇప్పుడు ప్రధాన ప్రత్యామ్నాయంగా అవతరించింది. ఈ క్రమంలో అది మరో విపక్షమైన కాంగ్రెస్‌ను పక్కకు నెట్టటంకాదు…తొక్కుకుంటూ పైకొచ్చింది. రాష్ట్రంలో రాజకీయసమీకరణాలలో సమూలమైన మార్పులకు దుబ్బాక ఫలితం నాంది పలికిందనటం అత్యుత్సాహం ఏమీ కాదు.

వార్నింగ్ బెల్స్ ఇప్పటివి కావు!

టీఆర్ఎస్‌కు ఈ ప్రమాద సంకేతం ఇప్పుడుకాదు, 2019 మే నెలలోనే స్పష్టంగా మోగింది. నాలుగు పార్లమెంట్ స్థానాలలో బీజేపీ విజయఢంకా మోగించినప్పుడే కేసీఆర్ మేలుకుని ఉండాల్సింది. ఆయన అదేమీ పట్టించుకోకుండా తనదైన పోకడలతోనే పాలన కొనసాగించారు. దేశంలోనే ధనికరాష్టంగా అవతరించిన తెలంగాణ ఇప్పుడు అప్పులకుప్పగా తయారయింది. ఆరేళ్ళలో రాష్ట్ర అప్పులు 2.90 లక్షల కోట్లకు చేరింది. కరోనా సమయంలో ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు జీతాలు ఇవ్వలేక కోత పెట్టింది. సంక్షేమ పథకాలలో ఇచ్చే పెన్షన్లకోసం కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గత రెండేళ్ళలో రైతుబంధు డబ్బులు జమచేయకుండా రు.4,500 కోట్లు ఆపేసింది. ఈసారి మళ్ళీ ఆపితే తీవ్ర వ్యతిరేకత వస్తుందని జూన్ నెలలోనే జమచేసింది.

గడీ పాలన

సచివాలయానికి రాకుండా ప్రగతి భవన్ నుంచే పాలన సాగించిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. ఉత్సాహం వచ్చినప్పుడు ఎక్కడలేని శ్రధ్ధాసక్తులతో పనిచేస్తారు. లేకపోతే కొన్ని రోజులు, వారాలపాటు అదృశ్యమైపోతారు. ఇష్టమైన పెట్ ప్రాజెక్టుల విషయంలో చూపిన చురుకుతనం అన్ని విషయాలలో ఉండదు. ఆ వ్యవహారశైలి అంతా ఒక ఫ్యూడల్ నియంతను తలపిస్తుంటుంది. కొన్ని ముఖ్య విషయాలలోకూడా బాధ్యతారాహిత్యంగా, అహంకారపూరితంగా, ఒంటెత్తు పోకడలతో సాగుతుంటారు. మరోవైపు ఇటీవలి పరిణామాలే చూస్తే, కరోనా విషయంలో మొదట చక్కగా ఫాలో అప్ చేసినా, ఒక నెలరోజుల తర్వాత కాడి పారేశారు. పూర్తిగా అస్తవ్యస్తంగా తయారయింది. ఇది ఈటెల రాజేందర్‌ను బలిపశువును చేయటంకోసమో, మరేమిటో తెలియదు. తాజాగా, భారీవర్షాల సమయంలోకూడా ప్రభుత్వం చురుకుగా, సజావుగా స్పందించలేదన్నది అందరికీ తెలిసిందే. కనీసం బాధితుల కష్టాలను ఏరియల్ వ్యూలో చూడటానికికూడా దొరకు సమయం దొరకలేదు.

2018 విజయం చంద్రబాబు పుణ్యమే!

అసలు 2018 డిసెంబర్ ఎన్నికలలోనే టీఆర్ఎస్ విజయం సహజసిద్ధంగా సంక్రమించినదీ కాదు, ప్రభుత్వ పనితీరుకు మెచ్చి ప్రజలు ఇచ్చినదీ కాదు. నాడు ఆఖరి క్షణాలలో ఎన్నికల క్షేత్రంలో మారిన పరిణామాల నేపథ్యంలో దక్కిందన్న విషయం రాజకీయాలను నిశితంగా గమనించేవారికి తెలిసే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టిన చంద్రబాబునాయుడు, నాడు ఎన్నికల ప్రచార సభలలో… ఆధునిక తెలంగాణ సృష్టికర్తను తానేనని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తానేనని చెబుతూ అనుచితమైన, అసందర్భమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే పరిణామం కేసీఆర్‌కు కలిసొచ్చింది. ఆయన తన స్ట్రాటజీని అప్పటికప్పుడు మార్చుకుని “ఆంధ్రోళ్ళు మళ్ళీ వస్తున్నారు” అనే నినాదాన్ని అందుకున్నారు. సోషల్ మీడియాలోకూడా చంద్రబాబు ప్రసంగాల వీడియోలను టీఆర్ఎస్ వర్గాలు విపరీతంగా సర్క్యులేట్ చేశాయి. దీనితో ఒక్కవారంలోనే పరిస్థితి మొత్తం కేసీఆర్‌కు అనుకూలంగా స్వింగ్ అయిపోయి ఆయనే ఊహించనంత మెజారిటీని తెచ్చిపెట్టింది. అవును, అంత మెజారిటీని కేసీఆరే ఊహించలేదు. పోలింగ్ ముందు టీఆర్ఎస్ నిర్వహించిన కొంగర కలాన్ సభకు లభించిన పేలవమైన ఆదరణ చూసిన వారందరికీ ఇది గుర్తుండే ఉండొచ్చు. అయితే టీఆర్ఎస్‌ అసలేమీ గెలుచునేది కాదనటంకాదుగానీ, ప్రభుత్వ ఏర్పాటుకు తగిన స్థానాలు గెలుచుకోవటం మాత్రం కష్టమయ్యేది. దానికి కారణం అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై నిరుద్యోగ యువత, ప్రభుత్వోద్యోగులు, ఆర్టీసీ కార్మికులువంటి కొన్ని వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారి ఆగ్రహం ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుందేమోగానీ, తగ్గే అవకాశం లేదు. ప్రభుత్వోద్యోగులైతే నిప్పులు చెరుగుతున్నారు. కారణం – వారికి ఐఆర్ ఇవ్వకపోవటం, రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్ళకు పెంచుతామని చేసిన ఎన్నికల వాగ్దానాన్ని అమలుచేయకపోవటం. మరోవైపు కేసీఆర్ ప్రవేశపెట్టిన నియంత్రిత సాగుపై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉండటంకూడా ప్రభుత్వానికి మైనస్ పాయింట్‌గా మారింది.

అంతర్గత అసంతృప్తి

ఇక పార్టీ వ్యవహారం చూస్తే, అది నివురుగప్పిన నిప్పులాగా ఉంది. ఒకే పార్టీలో ప్రజా ప్రతినిధులు ఎక్కువైపోవటంతో అసమ్మతి లోలోపల తీవ్రంగా ఉంది. మరోవైపు హరీష్ రావును, ఈటెల రాజేందర్‌ను ఎలా తొక్కాలా అని ప్రయత్నాలు జరుగుతూఉంటాయి. తన వారసుడు కేటీఆర్‌కు ఎప్పటికైనా ముప్పు కాబట్టి హరీష్‌ ఎదగటం కేసీఆర్‌కు ఇష్టం ఉండదు. అందుకనే కొన్నాళ్ళు పక్కన పెట్టిన తర్వాత మంత్రి పదవిని ఇవ్వటంద్వారా, అతనిని కేవలం సొంత పోర్ట్ ఫోలియోకు పరిమితం చేశారు. కొన్నాళ్ళయితే అతని వార్తలను సొంత పత్రిక నమస్తే తెలంగాణలోనే రాకుండా చేశారు. దీనివెనక సంతోష్, కవిత ఉన్నారనే వాదన వినబడింది. ఇప్పుడుకూడా దుబ్బాకలో ఫలితం అనుకూలంగా రాకపోతే, హరీష్‌ను కట్ చేయొచ్చు అనే ఉద్దేశ్యంతో పార్టీలోని ఒకవర్గం వ్యూహాలు పన్నిందనే వాదన ప్రచారంలో ఉంది. కేటీఆర్ ఒక్కసారికూడా ప్రచారానికి వెళ్ళకపోవటాన్ని ఈ వాదనకు రుజువుగా చెబుతున్నారు.

ఇక ఈటెల రాజేందర్‌ విషయానికొస్తే – పార్టీలో తనపట్ల అనుసరిస్తున్న వైఖరికి విసిగి ఆయన ఒక బహిరంగసభలో మాట్లాడుతూ, తాను పార్టీలోకి మధ్యలో వచ్చినవాడిని కానని, తనకు పదవి న్యాయబద్ధంగా వచ్చిందని అన్నారు. అంటే, పార్టీలోకి మధ్యలోకి వచ్చినవాళ్ళ ధోరణిపట్ల అసంతృప్తితో ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. పార్టీలోకి మధ్యలో వచ్చినవాళ్ళు, ముందునుంచి ఉన్నవాళ్ళ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్లు ఈ ఉదంతం స్పష్టం చేసింది. సముచిత ప్రాధాన్యం లభించక అసంతృప్తితో రగిలిపోతున్న చాలామంది నాయకులు బలమైన ప్రత్యామ్నాయం కనబడితే పార్టీని వీడాలని చూస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు, చివరికి ఒకరిద్దరు తప్పితే మంత్రులకుకూడా ఈ పదవులు అలంకార ప్రాయంగా మాత్రమే ఉంటున్నాయి. నిర్ణయాధికారం అంతా ఒక్కరి చేతిలోనే ఉండటంతో ప్రజా ప్రతినిధులు – కక్కలేక, మింగలేక అన్న పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు ఈటెలను పదవీచ్యుతుడిని చేయటానికే కరోనా విషయంలో కేసీఆర్ మధ్యలో కాడి పారేశారన్న వాదనకూడా బలంగా ప్రచారంలో ఉంది. ఇది నిజమైతే మాత్రం – తమ రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటాన్ని చిల్లర రాజకీయాలు చేయటమనే చెప్పుకోవాలి.

ఎన్నికల స్పెషలిస్ట్‌కే ఝలక్ ఎలా!

“అతడు అనేక యుద్ధములయందు ఆరితేరిన ఘనుడు” అని భారతంలో భీష్ముడికి ఉన్నట్లుగా, కేసీఆర్‌కు కూడా ఉపఎన్నికల స్పెషలిస్ట్ అనే పేరున్న సంగతి తెలిసిందే. నిజానికి టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన దగ్గరనుంచి 2011లో నిరాహారదీక్షతో ఉద్యమం ఊపు అందుకునేవరకు, ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం కేసీఆర్ చేసింది ఏమైనా ఉందా అంటే ఉపఎన్నికలకు పిలుపునివ్వటమే. ఊ అంటే ఉపఎన్నిక, ఆ అంటే ఉపఎన్నిక అన్నట్లుగా ఉండేది అప్పట్లో. ఒకసారయితే, ఓ లిటిగెంట్ రిపోర్టర్ రెచ్చగొట్టడంతో రెచ్చిపోయిన ఎం.సత్యనారాయణరావు సవాల్ విసిరాడని కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేసి(2006లో) ఉపఎన్నికకు వెళ్ళిన ఘనత కేసీఆర్‌ది. ఆయన, హరీష్ రావు, కేటీఆర్, వారి బృందం మొత్తం ఈ ఉపఎన్నికల పోల్ మేనేజిమెంట్‌లో రాటుదేలిపోయారు. తెలంగాణలో అధికారం చేబట్టిన తర్వాతకూడా, ఇటీవలి హుజూర్ నగర్ వరకూ అనేక ఉపఎన్నికలలో తమదైన శైలిలో పోల్ మేనేజిమెంట్ చేసి కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ చుక్కలు చూపించటం అందరికీ తెలిసిందే. మరి దుబ్బాకలో 2018లో వచ్చిన 60వేల పై చిలుకు మెజారిటీ నుంచి ఇప్పుడు 1,089 ఓట్ల మైనస్‌లోకి జారిపోవటానికి కారణం ఏమిటి? దీనిగురించి పెద్ద చర్చ వద్దుగానీ, బుల్లెట్ పాయింట్స్ చూద్దాం.

1. అభ్యర్థి ఎంపిక – సోలిపేట రామలింగారెడ్డికే గొప్ప పేరు ఏమీ లేదు. ఇక కనీస రాజకీయ పరిజ్ఞానంకూడా లేని ఆయన భార్యను ఇప్పుడు అభ్యర్థిగా ఎంపిక చేయటం, దివంగత ముత్యంరెడ్డికున్న మంచి పేరును వాడుకోగలిగే ఆయన కుమారుడిని పక్కన పెట్టటం కేసీఆర్ మొదటి తప్పు.
2. చుట్టూ ఉన్న సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాలు అద్భుతంగా అభివృద్ధి చెందటం, ఆ నియోజకవర్గాలలో అభివృద్ధి పథకాలకు, తమకంటే అత్యధికంగా భారీ నిధులు మంజూరుకావటంపట్ల దుబ్బాక ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఉంది. అందుకే నియోజకవర్గంలో వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి 86 వేల పైచిలుకు లబ్దిదారులు ఉన్నప్పటికీ వారుకూడా పూర్తిగా అధికారపార్టీకి ఓటు వేయలేదు(వీరిపైనే టీఆర్ఎస్ ప్రధానంగా ఆశలు పెట్టుకుంది).
3. రాజకీయంగా అమాయకురాలైన సుజాత(రామలింగారెడ్డి భార్య) కంటే మంచి రాజకీయ పరిజ్ఞానం ఉన్న రఘునందన్ రావు నియోజకవర్గ సమస్యలను గొంతెత్తి చాటుతాడని అత్యధికులు నమ్మారు.
4. రఘునందన్ మూడుసార్లు ఓడిపోవటంకూడా అతనిపట్ల సానుభూతిని కలుగజేసింది.
5. రామలింగారెడ్డి చనిపోయిననాటినుంచి రఘునందన్ ఉపఎన్నిక రంగంలో దూకి పూర్తిస్థాయిలో పనిచేసుకుంటూ వస్తున్నారు. వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా పనిచేశారు.
6. ముత్యంరెడ్డి ఉన్నప్పుడు అభివృద్ధి బాగా జరిగిందని, రామలింగారెడ్డి పనిచేయలేదనే అభిప్రాయం జనంలో ఉంది.
7. ప్రచార పర్వం సందర్భంగా సిద్దిపేట పోలీసులు సోదాల పేరుతో చూపిన అత్యుత్సాహం రఘునందన్ నెత్తిన పాలుపోసినట్లయింది. తన విజయంలో సిద్దిపేట పోలీసులది కీలకపాత్ర అని రఘునందన్ స్వయంగా చెప్పాడు.
8. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని టీఆర్ఎస్ బ్యాచ్ కలలు కనింది. కానీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు బలమైన ప్రత్యామ్నాయంగా పరిగణించటంలేదని స్పష్టమయింది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు పలువురు గోడదూకి టీఆర్ఎస్‌లో చేరటం అయిఉండొచ్చనే వాదన వినిపిస్తోంది.
9. బీజేపీలో వివిధ స్థాయి నాయకులు ఫోకస్‌తో పనిచేశారు. ముఖ్యంగా బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, జితేందర్ రెడ్డి. పోలీసుల సోదాల సందర్భంగా సంజయ్ చేసిన హడావుడి బీజేపీకి బాగా కలిసొచ్చింది. అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలలో కేంద్రం ఇస్తున్న వాటా గురించి ఓటర్లకు అర్థమయ్యేలా చెప్పి వారిలో అవగాహన కల్పించటంలో అర్వింద్ సఫలీకృతులయ్యారు. క్షేత్రస్థాయిలో మందీ, మార్బలానికి అవసరమైన మౌలిక సౌకర్యాలు, నాయకులు – కార్యకర్తల సమన్వయం వంటి పనులను జితేందర్ రెడ్డి సమర్థవంతంగా నిర్వహించారు.
10. ఉద్యోగాల భర్తీ విషయంలో కేసీఆర్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న యువత బీజేపీ విజయంకోసం శాయశక్తులా పనిచేశారు.

బీజేపీ భవిష్యత్తు

వాస్తవానికి బీజేపీ 20 ఏళ్ళక్రితమే తెలంగాణలో ఒక బలమైన శక్తిగా ఉండేది. వెంకయ్యనాయుడు పుణ్యమా అని క్రమేణా నిర్వీర్యమవుతూ వచ్చింది… 2018 డిసెంబర్ ఎన్నికలదాకా(1999లో తెలుగుదేశంతో పొత్తువలన అప్పటివరకు క్రియాశీలంగా ఉన్న బీజేపీ నాటినుంచి ప్రేక్షకపాత్రకు పరిమితమవటంతో దిగజారిపోయింది). ఇప్పుడుకూడా జాతీయస్థాయిలో ప్రభుత్వంలో, పార్టీలో ఇటీవల కీలక పదవులలోకి వెళ్ళిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కేసీఆర్‌ పట్ల ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారనే వాదన వినబడటంతోనే బీజేపీ అధిష్ఠానం కరడుగట్టిన ఆరెస్సెస్ వాది అయిన బండి సంజయ్‌కు అధ్యక్ష పదవిని కట్టబెట్టింది, పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఇప్పుడు అతని వ్యవహారశైలిపైనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడిఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఎలాగూ పార్టీ మెరుగైన పనితీరును కనబరుస్తుంది… ఇటీవలి వరదల్లో ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఉంది కాబట్టి. బలమైన, ప్రధాన ప్రత్యామ్నాయంగా బీజేపీ స్పష్టంగా కనబడుతుండటంతో ఇతర పార్టీలనుంచి చేరికలకు పెద్దసంఖ్యలో నాయకులు ఆసక్తి చూపుతారు. వారిని ఎంచుకోవటం, సమన్వయం చేయటం, కేసీఆర్‌కు దీటైన ప్రత్యామ్నాయం ఉందని తెలంగాణ ప్రజలలో నమ్మకం కలగజేయటం వంటి పనులను సంజయ్ చేయగలిగితే అతనే బాహుబలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close