ఆత్రేయ శ‌త జ‌యంతి ప్ర‌త్యేకం: భగ్న ప్రేమికుడి గీతాలాప‌న‌

మ‌న‌సు – ప్రేమ – విరహం – వేద‌న‌
ఈ అనుభూతుల్ని, ఉద్దేగాల్ని, క‌న్నీళ్ల‌నూ… మాట‌ల్లో పేర్చి, వాటిని పాట‌లుగా మార్చి – తెలుగు పాట‌ల ప్ర‌పంచానికి స‌రికొత్త వ‌న్నెల‌ద్దిన వాడు… ఆచార్య ఆత్రేయ‌.

ఒక‌టా రెండా
ప‌దులా వంద‌లా..?

ఎన్ని పాట‌లు రాశాడు?
ఎన్నిసార్లు… అనుభూతుల సాగ‌రంలో మ‌న‌ల్ని ముంచెత్తాడు..?

చిన్న చిన్న పదాలు – అందులో కొండంత అర్థాలు. ఇక మ‌న‌సు గురించి, మ‌నిషి పాట క‌డితే – అందులో జీవితాల‌కు స‌రిప‌డేంత త‌త్వం ఉంటుంది. అందుకే ఆయ‌న మ‌న‌సు క‌వి అయ్యాడు. మ‌న – సుక‌విగా మారాడు.

నిజానికి ఆత్రేయ ఓ భగ్న ప్రేమికుడు. ప్రేమ‌లో విఫ‌ల‌మైన వాడు. లేకపోతే ప్రేమ పాట‌లు అంత గొప్ప‌గా ఎందుకు రాస్తాడు? ఎలా రాస్తాడు? ప్రేమ‌లో.. మునిగాడు. ప్రేమ‌లో మ‌న‌ల్ని ముంచాడు. మ‌న‌సున్న మ‌నిషికి సుఖ‌ము లేదంతే… అంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టేశాడంటే అత‌ని మ‌న‌సు ఎన్నిసార్లు ముక్క‌లై ఉంటుందో క‌దూ. ఆత్రేయ పాట‌లు వింటే.. ఆ మాధ్యుర్యాన్ని పూర్తిగా అనుభ‌వించ‌డానికైనా ఒక‌సారి ప్రేమ‌లో ప‌డి, ఓడిపోవాల‌నిపిస్తుంది.

`నేనొక ప్రేమ పిపాసిని..` పాట వినండి. ఆత్రేయ‌లో ఎంత గొప్ప ప్రేమికుడు ఉన్నాడో తెలుస్తుంది. ఆ ప్రేమికుడు ఓడిపోయాడ‌ని అర్థ‌మ‌వుతుంది.

నీ అడుగులకు మడుగులోత్తగా – ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే – నలిగిపోయాను… అనేది గొప్ప ఎక్స్‌ప్రెష‌న్‌.

ప్రేమ ఎంత మ‌ధురం
ప్రియురాలు అంత క‌ఠినం – అనేది త‌నొక్క‌డి వేదిన కాదు. త‌న‌లాంటి వంద‌లాది భ‌గ్న హృద‌యుల నివేద‌న‌.

మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం
గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవు
కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు
పిచ్చివాణ్ణీ కానీదు – అంటూ అమ‌ర ప్రేమికుల‌కు ఓ జాతీయ గీతాన్ని అందించాడు ఆత్రేయ‌.

ప్రేమ‌లో… ఆత్రేయ చూపించ‌న ప్రేమ‌ది మ‌రో కోణం.

నీ పెదవి పైనా వెలుగారనీకు .. నీ కనులలోన తడి చేరనీకు
నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు .. అది వెల్లువల్లే నను ముంచనీకు
ఏ కారుమబ్బు ఎటు కమ్ముకున్నా .. మహా సాగరాలే నిను మింగుతున్నా
ఈ జన్మలోనా ఎడబాటు లేదు..పది జన్మలైన ముడే వీడిపోదు
అమరం అఖిలం మన ప్రేమా… అంటూ ప్రేమకు అమ‌ర‌త్వం ఆపాదించాడు.

ప్రేమ దివ్యభావము
ప్రేమ దైవరూపము
ప్రేమ జీవరాగము
ప్రేమ జ్ఞానయోగము అంటూ ప్రేమ‌ని ఆకాశంలో కూర్చోబెట్టాడు.

లోకాన్ని ఆత్రేయ చూసిన కోణం వేరు. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా అభివ‌ర్ణించి కుండ బ‌ద్ద‌లు కొట్టేశాడు. తొలి కోడి కూసిందిలో… `అంద‌మైన లోక‌మ‌ని` పాట వింటే – అస‌లైన ఆత్రేయ అంటే ఏమిటో తెలుస్తుంది.

అందమైన లోకమని రంగురంగులుంటాయని,
అందరూ అంటుంటారు రామ రామ…!
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా

అంటూ మొద‌లెట్టి.. అస‌లైన లోకం తీరుని ఎండ క‌ట్టాడు.

ఆకలి, ఆశలు ఈ లోకానికి మూలమమ్మ |
ఆకలికి అందముందా రామ రామ…
ఆశలకు అంతముందా చెప్పమ్మా.. చెల్లెమ్మా.! అంటూ నిల‌దీస్తాడు.

గడ్డి మేసి ఆవు పాలిస్తుంది,
పాలు తాగి మనిషి, విషమవుతాడు!!
అది గడ్డి గొప్పతనమా….! ఇది పాలు దోష గుణమా…!
మనిషి చాలా దొడ్డోడమ్మ చెల్లెమ్మా, చెల్లెమ్మా..!
తెలివి మీరి చెడ్డాడమ్మ చిన్నమ్మ… అంటూ మనిషి త‌త్వాన్ని నిల‌దీస్తాడు.

డబ్బు పుట్టి మనిషి చచ్చాడమ్మ, పేదవాడు నాడే పుట్టాడమ్మ అనే లైన్ అయితే ఈ పాట‌కు మ‌కుటం.
ఈ పాట‌కే… ఆత్రేయ‌కు తొలి నంది అవార్డు ద‌క్కింది.

దేవుడే ఇచ్చాడు వీధి ఒక‌టి…. పాట‌లో అంతులేని వైరాగ్యం, తాత్విక ధోర‌ణీ క‌నిపిస్తుంది.

“న‌న్న‌డిగి త‌లిదండ్రి కన్నారా
నా పిల్ల‌లే న‌న్న‌డిగి పుట్టారా“ అని అడిగితే, స‌మాధానం చెప్పేవాళ్ల‌రెవ‌రు? ఆత్రేయ పాట‌ల్లో ప్ర‌శ్న‌లెప్పుడూ అలానే ఉంటాయి. వాటికి సమాధానాలుండ‌వు.

రొమాంటిక్ పాట‌లు రాయడంలో ఆత్రేయ క‌లం ఇంకా స్పీడుగా ప‌రుగెడుతుంది.

“చిట‌ప‌ట చినుకులు ప‌డుతూ ఉంటే“ కంటే రొమాంటిక్ సాంగ్ ఉందా? వాన పాట‌ల‌కు అంకురార్ప‌ణ చేసిందే.. ఆత్రేయ‌. ఇప్ప‌టికీ వాన పాటంటే.. మ‌న‌కు గుర్తొచ్చే పాట అదే. ఆ ర‌కంగా.. వాన పాట‌లు రాసే క‌వుల‌కు ఓ బెంచ్ మార్క్ సృష్టించేశాడాయ‌న‌.

అల‌తి అల‌తి ప‌దాల‌తో అద్భుతాలు సృష్టించ‌డం కూడా అత్రేయ‌కే చెల్లింది. త్రిశూలంలోని
`రాయిని ఆడ‌ది చేసిన రాముడివా` ఓ క్లాసిక్‌. ఇద్ద‌రు మాట్లాడుకుంటున్న‌ట్టే ఉంటుందా పాట‌. ఒక ప్ర‌శ్న‌… ఒక జ‌వాబులానే సాగుతుంది ఆ పాట‌. ఇంత సింపుల్ గా పాట రాయొచ్చా? అనిపించేలా ఉంటుందా పాట‌. మ‌ళ్లీ అలాంటి ప్ర‌య‌త్నాలు, ప్ర‌యోగాలు ఇంకెవ్వ‌రికీ సాధ్యం కాదు.

`జాన‌కి క‌ల‌గ‌న‌లేదు… రాముడి స‌తికాగ‌ల‌ద‌ని ఆనాడు` అయితే మ‌రో క్లాసిక్ ఎగ్జాంపుల్.

ఆత్రేయ ఎప్పుడూ గంభీర‌మైన ప‌దాలు వాడ‌లేదు. మ‌న‌కు తెలిసిన‌వే. మ‌న‌కు అర్థ‌మ‌య్యేవే పాట‌ల్లో పెట్టాడు. అద్భుతాలు సృష్టించాడు. ప్ర‌తీ ప‌దంలోనూ కొండంత అర్థం, అందం ఉండేలా చూసుకున్నాడు. అదే ఆత్రేయ‌ని గొప్ప ర‌చ‌యిత‌ల స్థానంలో కూర్చోబెట్టింది. ప్రేమ పాటంటే ఆత్రేయ గుర్తొస్తాడు. ప్రేమ‌లో విఫ‌ల‌మైన ప్రేమికుడి విర‌హ వేద‌న అంటే ఆత్రేయ పాటే పాడుకోవాలి. మ‌న‌సు ఆనందంగా ఉంటే ఆయ‌న పాటే. మ‌న‌సు విషాదంలో మునిగినా ఆయ‌న పాటే. అందుకే.. ఆత్రేయ మ‌న‌సున్న క‌విగా మారిపోయాడు.

పోయిన‌వాళ్లంతా మంచోళ్లు.
ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు.. అంటాడు ఆత్రేయ‌.
ఆత్రేయ గురుతులు మాత్రం.. ఆయ‌న పాట‌లే. అంత‌కంటే తీపి జ్ఞాప‌కాలు మ‌న‌కేముంటాయి..?
ఆ పాట ఉన్నంత కాలం ఆత్రేయ మ‌న‌మ‌ధ్యే, మ‌న‌తోనే ఉంటాడు.
మ‌న‌సున్నంత కాలం… ఆత్రేయ ఉంటాడు.. గుర్తుంటాడు.

(ఆత్రేయ శ‌త జ‌యంతి సంద‌ర్భంగా)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close