ఓటీటీలు వచ్చేశాక… విమర్శ ఇంకొంచెం ఘాటుగా తయారైందేమో అనిపిస్తోంది. థియేటర్లో సినిమా చూశాక.. నచ్చకపోతే, ఓమాట అనేసి ఊరుకొంటున్నారు. కానీ.. ఓటీటీలో విడుదలయ్యాక ఆ సినిమాని మరింతగా చీల్చి చెండాడుతున్నారు. థియేటర్లో కనిపించని తప్పులు సైతం ఓటీటీలో కనిపిస్తాయి. ఫ్రేమ్ టూ ఫ్రేమ్.. షాట్ టూ షార్ట్ విశ్లేషణలు మొదలైపోతాయి. అప్పుడు ఇచ్చే రివ్యూలు మరింత ఘోరంగా తయారవుతున్నాయి.
‘రాజాసాబ్’ విషయంలో ఇదే జరుగుతోంది. జనవరి 9న థియేటర్లలోకి వచ్చిన సినిమా, ఇప్పుడు ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఓటీటీలో ఈ సినిమా చూశాక.. కాస్తో కూస్తో పాజిటివ్ నెస్ పెరుగుతుంది అనుకొంటే, మరింతగా కుళ్లబొడుస్తున్నారు. ఇంచు మించుగా ప్రతీఫ్రేమ్ పైనా డీటైల్డ్ రివ్యూలు వచ్చేస్తున్నాయి. ప్రభాస్ కాస్ట్యూమ్స్, లుక్, బ్యాక్ గ్రౌండ్, సీజీ వర్క్.. ఇలా ఒక్కటేమిటి.. అన్నింటినీ భూతద్దంలో పెట్టుకొని మరీ చూస్తున్నారు. ‘ఈdsq షాట్ ఎవరు ఓకే చేశారు, ఎందుకు చేశారు’ అంటూ ఫ్రేమ్ టూ ఫ్రేమ్ ప్రభాస్ అభిమానులే నిలదీస్తున్నారు.
`రాజాసాబ్` రిలీజ్ అయిన తరవాత దర్శకుడు మారుతిపై సోషల్ మీడియాలో కాస్త గట్టిగానే అటాక్ జరిగింది. ఆయన ఇంటి అడ్రస్స్కి పార్శిల్లు పంపించి, తమ నిరసన తెలియజేశారు ఫ్యాన్స్. కొన్ని రోజులు ఆ హీట్ నడిచాక, పరిస్థితి ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోంది. ఇప్పుడు ఓటీటీలో రాజాసాబ్ వచ్చాక పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. థియేటర్లో సినిమా చూడని వాళ్లు ఇప్పుడు మేల్కొంటున్నారు. వాళ్లంతా తమ స్పందనల్ని ఘాటుగానే తెలియజేస్తున్నారు. థియేటర్లో బాగా ఆడిన సినిమాల్నే `ఈ సినిమా ఎలా చూశార్రా` అంటూ నిర్మొహమాటంగా విరుచుకుపడిపోయే విశ్లేషకులు.. ఫ్లాప్ సినిమాని ఎందుకు వదులుతారు? కాకపోతే ఆ డోసు ఇంకాస్త ఎక్కువ ఉంది ఈసారి.
