జేమ్స్ కామెరూన్ సృష్టించిన పండోరా గ్రహం ఓ అద్భుతం. తొలిసారి వెండితెరపై అవతార్ చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. అవతార్ కి కొనసాగింపుగా వచ్చిన రెండో భాగం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ మిశ్రమ స్పందన అందుకుంది. ఇప్పుడు మూడో భాగంగా ‘అవతార్ ఫైర్ అండ్ యాష్’ ని ప్రేక్షకులు ముందుకు తెచ్చారు. మరీ మూడో భాగం అంచనాలని అందుకుందా? ఇందులో కామెరూన్ చూపించిన అద్భుతాలేమి?
అవతార్ యుద్ధంలో అనాథగా మారిన తర్వాత నావీ తెగతో పండోరలో పెరుగుతున్న స్పైడర్ (జాక్ ఛాంపియన్) ని మళ్ళీ తన చోటుకే పంపించేయాలని నిర్ణయించుకుంటారు జేక్ సల్లీ (శ్యామ్ వర్తింగ్టన్) నేతిరి (జో సల్డానా). తన కుటుంబంతో కలసి ఒక విహారయాత్రలో బయలుదేరుతారు. మార్గమధ్యలో అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్ (ఊనా చాప్లిన్) వాళ్ళపై దాడి చేస్తుంది. ఇదే సమయంలో కల్నల్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్) జేక్ పై రివెంజ్ కి దిగుతాడు. మరోవైపు పండోరాని నాశనం చేయాలనే లక్ష్యంతో ఉన్న ఆర్డీఏ బృందం కూడా వార్ కి రెడీ అవుతుంది. అప్పుడు ఎలాంటి యుద్ధం జరిగిందనేది మిగతా కథ.
సముద్రాన్ని తొలిసారి చూసినప్పుడు మనలో కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేం. కానీ అదే సముద్రాన్ని రెండోసారి చూసినప్పుడు అనుభూతిలో తేడా వచ్చేస్తుంది. ఇక్కడ సముద్రం అందం, ఆశ్చర్యం తగ్గిపొయిందని కాదు. కంటికి అలవాటైపోయింది. అవాతర్ ఫ్రాంచైజ్ లో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలని చూసినప్పుడు అదే భావన మనసులో కదలాడుతుంది.
అవాతర్ అంటే వెండితెర దృశ్య కావ్యం. కామెరూన్ క్రియేట్ చేసిన మనుషులు, ఏలియన్స్, పండోర గ్రహం, అక్కడ పక్షులు, జంతువులు, మొక్కలు.. ఒక్కటి కాదు.. అప్పటివరకూ ఎన్నడూ కనని విజువల్స్ తో ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. అదంతా ఒక మ్యాజిక్. అయితే అంత మ్యాజిక్ రెండో భాగంలో కనిపించలేదు. పైగా సినిమాకు సరిపడా డ్రామా కూడా పట్టుకోలేకపోయరనే విమర్శ కూడా వినిపించింది. ఇప్పుడు మూడో భాగానికి వచ్చేసరికి డ్రామా, విజువల్స్ కుదిరాయి కానీ చూపించిన కథనే తిప్పితిప్పి చూపించారనే భావన కలుగుతుంది.
అవతార్ కళ్ళు అప్పగించి చూసే సినిమా. కానీ ఈ మూడో భాగానికి వచ్చేసరికి కామెరూన్ డ్రామా, ఎమోషన్ మీద దృష్టి పెట్టారు. ఐరావతాలు లాంటి హంస నావలు గాల్లోకి ఎగిరే దృశ్యంతో విజువల్ వండర్ ని ఎక్స్ పీరియన్స్ చేయడానికి ఆడియన్స్ సీట్లో సర్దుకుంటారు. ఆ తర్వాత ఎలాంటి ఘట్టాలు వస్తాయో, ఎలా అబ్బురపరుస్తాయో అనే అంచనాలు అమాంతం పెరుగుతాయి. కానీ వరంగ్ తెగని ప్రవేశపెట్టి ఈ కథకు తానే స్పీడ్ బ్రేకర్ వేసుకున్నాడు జేమ్స్. అక్కడి నుంచి డ్రామా అక్కడక్కడే తిరుగుతుంది. ఒకదశలో విరామం ఎప్పుడు వస్తుందా? కాస్త బయటికి వెళ్లి రిలాక్స్ అయి రావచ్చనే ఫీలింగ్ కూడా కలుగుతుంది.
విరామం తర్వాత కథలో ఎమోషన్ కాస్త ముందుకి కదులుతుంది. స్పైడర్, జేక్ మధ్య వచ్చే సంఘర్షణ ఈ సినిమాలో బెస్ట్ ఎమోషన్. జేమ్స్ ఈసారి వరంగ్ తెగ పై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాడు. కాకపోతే ఆ ట్రాక్ నుంచి ఈ సినిమాకి ఎమోషన్ కలిసిరాకపొగా విసుగు పుట్టించింది. కాకపోతే చివరి ముఫ్ఫై నిముషాలు అవతార్ వార్ విజువల్ వండర్. అగ్నీ, జలం నడుమ జరిగే సంగ్రామం గురించి చెప్పడానికి లేదు.. చూడాలంతే.
జేక్ పాత్రలో సామ్ వర్తింగ్టన్ మరోసారి కట్టిపడేశాడు. స్పైడర్ పాత్రకు మంచి మార్కులు పడతాయి. నేతిరి (జో సల్డానా) కిరి (సిగౌర్నీ వీవర్), లోక్ (బ్రిటన్ డాల్టన్), టూక్ (ట్రినిటీ జో-లి బ్లిస్) కల్నల్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్) అందరూ కూడా ఆకట్టుకునేలా చేశారు. అగ్ని తెగకు చెందిన నాయకురాలుగా కనిపించిన వరంగ్ (ఊనా చాప్లిన్) పాత్ర ఎందుకో డ్రామాలో సరిగ్గా ఇమడలేదు.
టెక్నికల్ గా సినిమా అద్భుతం. కొన్ని అబ్బురపరిచే సనివేశాలు వున్నాయి. త్రీడీలో మంచి అనుభూతి వుంటుంది. కాకపోతే దాదాపు మూడున్నర గంటల నిడివి వున్న సినిమా ఇది. విజువల్ పరంగా అద్భుతం అనిపించినప్పటికీ కథ, కథనాలు, డ్రామా సాగిన విధానం చురుగ్గా ఉంటే ఇంకా మెరుగ్గా వుండేది. కనీసం మరో అరగంట సినిమా కోత విధించవచ్చు. కానీ ప్రతీ సన్నివేశాన్నీ విడమరచి చెప్పాలన్న ఆలోచన, ఓవర్ డీటైలింగ్ వల్ల లాగ్ పెరిగింది. అవతార్ తో పోలిస్తే పార్ట్ 2 కాస్త అసంతృప్తి కలిగిస్తుంది. పార్ట్ 2 తో పోలిస్తే పార్ట్ 3 ఇంకాస్త డల్ గా ఉంది.