డిజిటల్ అరెస్ట్ మోసాల కేసులను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టు పేరుతో లక్షల మందిని మోసం చేశారు. ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు. మోసపోయిన వారిలో బాగా చదువుకున్న వారు ఉన్నారు. వ్యాపారస్తులు ఉన్నారు. ఎక్కువ మంది పెద్ద వాళ్లు ఉన్నారు. వేలకోట్లు వీరి వద్ద నుంచి గుంజుకున్నారు. ఈ మోసాలు అంతకంతకూ పెరిగిపోవడం.. కట్టడి చేయలేకపోవడంతో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. కానీ ఇలాంటి మోసాలను అరికట్టాలంటే..రెండే మార్గాలు ఒకటి డేటా దుర్వినియోగం కాకుండా చూడటం.. రెండు ప్రజలను చైతన్యపరచడం.
డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు – అయినా భయమే !
హఠాత్తుగా ఒకడు ఫోన్ చేస్తాడు. మీరు ఫలానా ఆర్డర్ పెట్టారు..అందులో డ్రగ్స్ వచ్చాయంటాడు. లేకపోతే మీ బిడ్డ కేసులో ఇరుక్కుందంటాడు. ఎలా చెబితే ఆ వ్యక్తి భయపడతాడో అలా చెబుతారు. డిజిటల్ అరెస్టు చేశామంటారు. ఎవరికీ చెప్పకుండా.. డబ్బులు బదిలీ చేయించుకుంటారు. ఎంత అంటే అతని వద్ద ఎంత ఉంది.. అతను అప్పటికప్పుడు ఎంత అప్పులు తీసుకురాగలడో కూడా అంచనా వేసుకుని అంతా పిండుకుంటారు. ఇలా రిటైరైనా వారి వద్ద నుంచి.. వ్యాపారవేత్తల కుటుంబాల నుంచి కోట్లకు కోట్లు వసూలు చేశారు.
అసలు ఆ డేటా ఎలాచేరుతుంది ?
ఓ వ్యక్తిని డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం చేయాలనుకుంటే వారి మొత్తం సమాచారం.. మోసగాళ్ల వద్ద ఉంటోంది. ఫోన్ నెంబర్ , పిల్లల వివరాలు, ఆన్ లైన్ లో పెట్టిన ఆర్డర్లు, ఆర్థిక లావాదేవీలు ఇలా సమగ్ర సమాచారం ఉంటోంది. ఇదంతా వారి వద్దకు ఎలా చేరుతోందన్నది ప్రధానమైన ప్రశ్న. సరైన డేటా పాలసీ లేకపోవడం.. తప్పుడు పద్దతుల్లో డేటా అమ్ముకునే కంపెనీలు ఉండటంతోనే ఇది సాధ్యమవుతుంది. డార్క్ వెబ్ లో ఇలాంటి డేటాను అమ్ముతామని బహిరంగంగా ప్రకటనలు ఉంటూ ఉంటాయి. మోసగాళ్లకు ఇదే పెద్ద ఆయుధంగా మారింది.
డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు – ప్రజా చైతన్యం ముఖ్యం
ఈ డిజిటల్ యుగంలో డేటాను సీక్రెట్స్ గా ఉంచుకోడం అంత తేలిక కాదు. మన చేతుల్లో లేదు. మన సీక్రెట్స్ అన్నీ మనం వాడే యాప్స్ చేతుల్లోఉంటాయి. వాళ్లు అమ్ముకుంటారు.దాన్ని అడ్డుకోలేం. అందుకే.. జరుగుతున్న మోసాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. తెలియని నెంబర్స్ నుంచి వీడియో కాల్స్ వస్తే అసలు లిఫ్ట్ చేయకూడదు. మామూలు కాల్స్ కూడా తెలియని నెంబర్స్ నుంచి వస్తే మాట్లాడకూడదు. పోలీసులు డిజిటల్ అరెస్టులు చేయరు. ఇలాంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెరిగితే.. సైబర్ మోసాలు తగ్గుతాయి.లేకపోతే సీబీఐ విచారణ చేసినా పెద్దగా మార్పు ఉండదు.
