ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు. పక్కా సమాచారం మేరకు మైసూర్ వెళ్ళిన సిట్ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి గోవిందప్పను విజయవాడకు తరలిస్తున్నారు. ఈ గోవిందప్ప ఎవరో కాదు..భారతి సిమెంట్స్ డైరెక్టర్.. జగన్ కు అత్యంత సన్నిహితుడు కూడా. తాజాగా గోవిందప్ప అరెస్ట్ కావడంతో ఈ కేసులో రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని స్పష్టం అవుతోంది.
మూడు రోజుల కిందట సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్పను లిక్కర్ కేసులో విచారణకు రావాలని కోరుతూ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆదివారం ఉదయం పదిగంటలకు విజయవాడ సిట్ ఆఫీసుకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. కానీ, ఈ ముగ్గురూ విచారణకు డుమ్మా కొట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు ముందస్తు బెయిల్ పై హైకోర్టులో వీరికి నిరాశ ఎదురవ్వగా , సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పును సమర్ధించింది.
ఈ క్రమంలోనే నిందితుల ఆచూకీపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సిట్ అధికారులు పక్కా సమాచారంతో మైసూర్ లో గోవిందప్ప ఉన్నాడని తెలుసుకొని వెళ్లి అరెస్ట్ చేశారు. వైసీపీ హయాంలో లిక్కర్ పాలసీ, డిస్టలరీల నుంచి ముడుపులు తీసుకొని వాటిని షెల్ కంపెనీలకు మళ్ళించడంలో గోవిందప్ప పాత్ర కూడా ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి సిట్ సమాచారం కూడా సేకరించింది.
ఇప్పుడు ఈ కేసులో జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన గోవిందప్ప అరెస్ట్ కావడంతో, ఈ కేసు బిగ్ బాస్ వరకు వెళ్లేందుకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఆ దిశగా బిగ్ బాస్ కూడా సమాయత్తం అవ్వాల్సిందేనని వైసీపీ కంపౌండ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.