కేంద్రం సహాయానికి ఎపి హైప్ అవరోధం?

రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి సాయం అందదన్న ఆలోచనతోనే నిధుల సమీకరణ మార్గాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్వేషిస్తున్నారని అర్ధమౌతోంది. కేంద్ర సహాయనిరాకరణతో విసుగెత్తిపోయిన చంద్రబాబు లండన్ వెళ్ళే ముందు న్యూఢల్లీలో ఆర్ధికశాఖ సీనియర్ అధికారితో “ఇపుడు నాకు రెండేదారులు వున్నాయి. ఒకటి సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటికి వెళ్ళడం, రెండు సర్వైవల్ కోసం సొంత దారులు వెతుక్కోవడం,” అని వ్యాఖ్యానించారని తెలిసింది.

రాజకీయపరమైన తెగతెంపులు ప్రజల్లో ఉద్వేగాలు పెంచుతాయి. అందుకు ఎన్నికల కాలమే సరైన సమయం. అందువల్ల ఇప్పట్లో సంకీర్ణ కూటమి నుంచి తెలుగుదేశం ఇప్పట్లో బయటకి రాదు. అయితే ఆర్ధిక అంశాలే ఆ పార్టీని వత్తిడి పెడుతున్నాయి. 2019 ఎన్నికల్లో గెలవాలంటే రాజధాని, పోలవరం ప్రాజెక్టు మొదలైన భారీ నిర్మాణాలను సగమైనా పూర్తి చేయాలి. అందుకే ముఖ్యనిర్మాణాల గడువునూ 2018 సంవత్సరంగా రాష్ట్రప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే నిధులు లేకపోవడమే అసలు సమస్య!

ప్రపంచ ఆర్ధిక ధోరణులకు లోబడే భారత ప్రభుత్వ విధానాలు వుంటాయని బిజెపి ముఖ్యమంత్రలకు కూడా అర్ధం కాకపోవచ్చునేమో! కానీ, ఈ విషయంలో నరేంద్రమోదీ, చంద్రబాబు నాయుడులమధ్య వున్నంత భావసమైక్యత మరే ఇద్దరు నాయకుల మధ్యా వుండదంటే అది అతిశయోక్తి కాదు.

రాజకీయ పార్టీల వారు, ఇతర ప్రజా సంఘాల వారు కేంద్రం మీద వత్తిడి తెచ్చి నిధులు సాధించుకోవాలని చంద్రబాబుకి సూచిస్తూ వుంటారు. అయితే, ఆయన నిధులు ఎలా సమీకరించాలా…అని ఆలోచిస్తూ వుంటారు.

ఇందుకు వీలుగానే, అంతర్జాతీయ ద్రవ్య సంస్ధల రుణాలూ-సహకారాలూ పొందగల విధంగానే రాష్ట్ర ప్రభుత్వ ఆస్ధులు, అప్పులు, ఆదాయ వనరులను ప్రొజెక్టు చేస్తున్నారు. బ్యాంకులోను పొందడం కోసం గొప్పలు చేర్చి బేలెన్సు షీట్ చూపించినట్టుగానే ఇందులో కొంత హైప్ వుంటుంది. ప్రపంచబ్యాంకు మొదలైన విదేశీ ద్రవ్య సంస్ధల లోన్ కోసం చూపించిన గణాంకాలే ఢిల్లీ సాయం చేయకుండా అడ్డు పడుతున్నాయి.

ఎఫ్.ఆర్.బి.ఎం. (ఫిస్కల్ రెస్పాన్స్ బిలిటీ అండ్ బడ్జెట్ మేనేజిమెంటు చట్టం) నిర్దేశించిన కొలమానాల పరిమితుల ప్రకారమే కేంద్రం నుంచి రాష్ట్రాలకు బడ్జెట్టు లోటుపై సహాయాలు అందుతాయి. ఈ మేరకు ఢిల్లీ నుంచి నుంచి ఆంధ్రప్రదేశ్ కు సహాయం అందే అవకాశాలు చాలా తక్కువ. ఈ విషయం తెలిసిన చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్ మెంటు బ్యాంకు, జపాన్ ఓవర్ సీస్ డెవలప్ మెంటు బ్యాంకు మొదలైన విదేశీ సంస్ధల రుణాల మీదే దృష్టి పెట్టారు. అయితే, ఇందుకు కూడా కేంద్రప్రభుత్వం అనుమతించవలసిందే!

ఎఫ్.ఆర్. బి.ఎం. నియమ నిబంధనల ప్రకారం రేపు తెలంగాణాకు మంజూరయ్యే పాటి సహాయం కూడా ఆంధ్రప్రదేశ్ కు రాకపోతే మీరూ నేనూ షాక్ అవుతామేమో కాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆశ్చర్యం కలగదు..ఇదంతా తెలిసి వుండటం వల్లే రాజధాని నిర్మాణానికి ఆయన దృష్టి విదేశీ రుణాల మీదే వుంది!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com