ఉద్యోగుల పనిసంస్కృతిపై బాబు `కన్ను’

`పని రాక్షసుడు’ అన్న పేరుబడ్డ చంద్రబాబు ఇప్పుడు అమరావతి భారీప్రాజెక్ట్ పనుల్లో ఉద్యోగస్థులతో ఎలా వ్యవహరించబోతున్నారు? గతంలో అధికారంలో ఉన్నప్పుడు బాబు ఉద్యోగులపట్ల ప్రవర్తించిన తీరు చివరకు ఆయనకే తలబొప్పికట్టించింది. నిజానికి రాష్ట్ర ఉద్యోగులు పనికి ఏనాడూ వ్యతిరేకంకారు. కాకపోతే తీవ్రఒత్తిడిని తట్టుకోలేకపోయారప్పుడు. మరి ఇప్పుడు బాబు ఎలా ప్రవర్తిస్తారన్నది ఉద్యోగుల ముందున్న ప్రశ్న. రాష్టంలో రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరగాల్సిందే. అదే సమయంలో ఉద్యోగులు తీవ్రమనస్తాపం చెందకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుదే. మరి ఈ రెంటినీ బాబు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ సాగుతారో చూడాలి. అయితే ఈ సమస్య పరిష్కారదిశగా బాబు ఓ వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.

వలస అనివార్యం

తుళ్లూరులో తాత్కాలిక అసెంబ్లీని ఏర్పాటు చేసి వచ్చే శీతాకాల, బడ్జెట్ సమావేశాలను అక్కడే నిర్వహించడానికి స్పీకర్ కోడెల శివప్రసాదరావు వేగిరపడుతున్నారు. మరో పక్క ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఉన్న వివిధ శాఖలను ఒక్కొక్కటి కదలించాలని ముఖ్యమంత్రి పావులుకదుపుతున్నారు. ఇప్పటికే ప్రధాన శాఖలను తరలించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వసతి సౌకర్యాలు కూడా చూస్తున్నారు. మరో ఏడాదిలో సగానికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్ ని విడిచి ఆంధ్రాకు వలసపోవాల్సి ఉంటుందన్నది విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఉద్యోగులు నూతన రాజధానికి చేరువలో వసతులు ఎలా ఉన్నాయో బేరీజు వేసుకుంటున్నారు. నిజానికి విభజన చట్టం ప్రకారం పదేళ్లు గడువు ఉన్నప్పటికీ అవసరమైన పనుల నిమిత్తం కొన్ని శాఖల ఉద్యోగులు అక్కడకు వెళ్లక తప్పడంలేదు.

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగస్థులు ఈ వలస పట్ల ఆందోళనలో ఉన్నమాట నిజమే. దీనికి తోడు అమరావతి శంకుస్తాపన అయినవెంటనే చంద్రబాబు దూకుడు పెంచుతారనీ, ఇక తాము పెట్టాబేడా సర్దుకుని వెళ్ళక తప్పదన్న టెన్షన్ ఎక్కువవుతోంది. ఉద్యోగస్తులు ఈ టెన్షన్స్ లో ఉంటే మరో పక్క ముఖ్యమంత్రి రాజధాని పనులు శరవేగంగా జరగడంకోసం ప్రభుత్వ ఉద్యోగస్థులపై మరింత ఒత్తిడి తీసుకురాబోతున్నారు. అయితే ఇందుకోసం ఆయన గతంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పైకి సున్నితంగా కనిపించే విధానాన్ని అనుసరించబోతున్నారు. అదే పని సంస్కృతి పట్ల అవగాహన పెంచడం. అదనపు సౌకర్యాలు కల్పిస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ ఎవ్వరినీ నొప్పించకుండా నాణ్యమైన పనిని రాబట్టే ప్రయత్నం చేయబోతున్నారు.

ఇదీ వ్యూహం…

మనదేశంలో ప్రభుత్వకార్యాలయాల్లో ఉద్యోగుల పనితీరు ఇంచిమించు ఒకేలా ఉంటుంది. పని పట్ల శ్రద్ధ పెంచేలా ఇటు అధికారులు, అటు ప్రభుత్వాలు ప్రయత్నించిన దాఖలాలు పెద్దగా లేవు. ఒకవేళ అలా ప్రవర్తిస్తే తీవ్ర అసంతృప్తి రావడం ప్రభుత్వాలు కూలడం వంటి సంఘటనలు ఉన్నాయి. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కున్నారు. పైగా ప్రభుత్వ ఉద్యోగుల వర్గమన్నది గెలుపుని నిర్దేశించే ఒకానొక ఓటుబ్యాంక్ గా మారిపోయింది. మరి అలాంటప్పుడు చంద్రబాబు ఈసారి ఏం చేయబోతున్నారన్నది ఉద్యోగులను సైతం కలవరపరుస్తున్న అంశం. 2019లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ విషయంలో ఆచితూచి అడుగులువేస్తారన్నది నిర్వివాదాంశం. ఎవ్వరినీ నొప్పించకుండా చైతన్యం ద్వారా మెరుగైన పనిని రాబట్టుకునే ఫార్ములాను ఆయన అనుసరించబోతున్నారు.

పనితీరులో మార్పు

మెగా ప్రాజెక్ట్ కనుక కచ్చితంగా వివిధ శాఖల్లోని ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుంది. అనేక ఫైళ్లు చకచకా కదలాల్సిఉంటుంది. అవినీతి, లంచగొండితనం వంటివి ఆమడదూరంలో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లంచావతారులకు ఇది కష్టంగా తోచవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పనిలో కొత్త సంస్కృతిని ఉద్యోగులు అలవాటుచేసుకోవాల్సిఉంటుంది. ఇప్పటికే దేశంలో బాగా పాతుకుపోయిన కార్పొరేట్ సంస్థల్లోని వర్క్ కల్చర్ కీ, ప్రభుత్వ శాఖల్లోని వర్క్ కల్చర్ కీ చాలా తేడాఉన్నదన్నది అందరికీ తెలిసిన విషయమే. దీనికితోడు ఇప్పుడు రాజధాని అమరావతి నిర్మాణం పనులు మొదలుకాగానే సింగపూర్, జపాన్, చైనా దేశాలకు చెందిన సంస్థల జోక్యంఅనివార్యం. సంస్థ అంటే మానవ సమూహాలే. కనుక రాజధాని నిర్మాణం కొనసాగేటంతకాలం ఈ దేశస్థులతో మనవాళ్లు కలిసిపనిచేయాల్సిఉంటుంది. వారిని పనిభాగస్వాములుగానే భావించాల్సిఉంటుంది. ఈ వాతావరణానికి తగ్గట్టుగా మన ఉద్యోగులను, నిపుణులను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇది పైకి చెప్పినంత తేలికైన వ్యవహారం కాదు. ఏమాత్రం తేడా వచ్చినా, అసంతృప్తి తలెత్తినా సమ్మెలు గట్రా చోటుచేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ పనితీరుకు తీవ్ర అడ్డంకి కలిగించవచ్చు. మహాలక్ష్యం దెబ్బతినవచ్చు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే పని సంస్కృతిలో సమ్మేళనం కనిపించాలి. ఇందుకోసం ప్రత్యేక శిక్షణా శిబిరాలు, ప్రోత్సహకాలు ఉంటాయని వేరుగా చెప్పనక్కర్లేదు.

చంద్రబాబు ఈ దృష్టితో కూడా ఆలోచిస్తున్నారు. ఉద్యోగుల ఒత్తిడిని గుర్తిస్తూనే వారి అవసరాలు తీరుస్తూనే పనిపట్ల ఆసక్తి కలిగించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. అందుకే ఆయన వీలుచిక్కినప్పుడల్లా సింగపూర్ ని ప్రస్తావిస్తున్నారు. సింగపూర్ లో అవినితీకి తావులేదని ఘంటాపథంగా చెబుతున్నారాయన. అంతేకాదు, అవినీతికి పాల్పడ్డవారిని అక్కడ కఠినంగా శిక్షిస్తారట. అక్కడి ప్రజలు (ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగం) చాలా నిబద్ధతతో, క్రమశిక్షణతో పనిచేస్తారట. అందుకే చిన్నచిన్న పల్లెలు సైతం వేగంగా అభివృద్ధి చెందుతున్నాయట.

బాబు చెప్పే మాటల్లోని అంతరార్థం ఈపాటికి అర్థమయ్యేఉంటుంది. రాజధాని నిర్మాణంలో ఎక్కడా ఎలాంటి కుంభకోణాలు, అవినీతి చెద సోకకూడదన్నది ఆయన ఆలోచన. అంటే ఇది పరోక్షంగా ఉద్యోగులను హెచ్చరించడమే. కాకపోతే చాలా సౌమ్యంగానే ఆయన పరిష్కారమార్గాన్ని ఎంచుకోబోతున్నారు. విదేశీ సంస్థలు, అందులో పనిచేసేవారితో మనవాళ్లు కలిసిమెలగడం వల్ల పని సంస్కృతి, పారదర్శకత వంటి అంశాల్లో నూతన అనుబంధం ఏర్పడుతుందనీ, పనిలో సులువు తెలుస్తుందనీ, దీనికి తోడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మనవాళ్లు అందిపుచ్చుకోవడానికి వీలవుతుందన్నది ఫలితంగా సమస్య తొలిగిపోతుందన్నది ఆయన ఆలోచన.

అప్పట్లో బ్రిటీష్ వాళ్లు వచ్చి వారి పనిసంస్కృతిని మనకు రుచిచూపించారు. మధ్యలో మల్టీ నేషనల్ కంపెనీలు వచ్చేసి వారి పని సంస్కృతి ఎలాఉంటుందో చాటిచెప్పాయి. ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణంతో సింగపూర్, జపాన్,చైనా వాళ్ల పనితీరుని ప్రత్యక్షంగా తెలుసుకోబోతున్నాం. `మీరంతా పారదర్శకంగా పనిచేయాలని, అవినీతికి దూరంగా ఉండాలని’ సూటిగా చెప్పడంకంటే మెరుగైన పనితీరు ఉన్నదని భావిస్తున్నవారితో `సంగమం’ చేస్తే మార్పు వస్తుందనీ, అప్పుడు అభ్యుదయ స్ఫూర్తితో అమరావతి ప్రాజెక్ట్ విజయవంతమవుతున్నది బాబు కల. ప్లాన్ బాగానేఉంది, కానీ ఇది ఏమేరకు ఫలిస్తుందో, ఈ పని సంస్కృతుల సంగమాన్ని ఎవరు ఎలా అర్థం చేసుకుంటారో, మరెవరు అపార్థం చేసుకుంటారో చూడాల్సిందే.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల్లో.. `యునైటెడ్ తెలుగు కిచెన్స్‌` ప్రారంభం

తెలుగు వారి ప‌సందైన రుచుల‌కు పెట్టింది పేరు గోదావ‌రి జిల్లాలు. వెజ్ ఐటంల నుంచి నాన్‌వెజ్ డిషెస్ వ‌ర‌కు.. గోదావ‌రి రుచులు ప్ర‌పంచ వ్యాప్తంగా ఘుమ‌ఘుమ‌లాడుతూనే ఉన్నాయి. దీంతో తెలుగు వారు ఎక్క‌డ...

కోన వెంక‌ట్ రూ.50 కోట్ల ఆశ‌

ఈ రోజుల్లో ఏ సినిమాలో ఎంత స‌త్తా ఉందో ముందే ఊహించ‌డం క‌ష్టం. టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలు వంద కోట్లు దాటేసి బాక్సాఫీసుని ఆశ్చర్య‌ప‌రుస్తున్నాయి. అందుకే త‌మ సినిమాల‌కు వంద కోట్లు,...

పులివెందుల బాధ్యతలు భారతికి ఇచ్చిన జగన్ !

పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను భారతికి అప్పగించారు సీఎం జగన్. మరో వారం రోజుల్లో నామినేషన్లు ప్రారంభం కానున్న సమయంలో భారతి పులివెందులలోనే మకాం వేయనున్నారు. ఈ నెల ఇరవై ఐదో తేదీన సీఎం...

జక్క‌న్న‌కు అంత టైమ్ ఉందా?

రాజ‌మౌళి ఈమ‌ధ్య బ‌య‌ట ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఫంక్ష‌న్ల‌లో మెర‌వ‌డం చాలా త‌క్కువ‌. సినిమా వేడుక‌ల్లో చూడ‌డం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. త‌న టైమ్ అంతా మ‌హేష్ బాబు సినిమా కోస‌మే....

HOT NEWS

css.php
[X] Close
[X] Close