తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఐదు గ్రామాల విలీన అంశం మళ్ళీ రాజకీయంగా సెంటర్ స్టేజ్‌లోకి వచ్చింది. భద్రాచలం పుణ్యక్షేత్రం చుట్టూ ఉన్న ఈ గ్రామాలు ప్రస్తుతం ఏపీలో ఉండటం, భౌగోళికంగా అవి భద్రాద్రితో విడదీయలేని భాగం కావడం ఈ వివాదానికి మూలం. పాలనా పరంగా, వరదల సమయంలోనూ వారు ఇబ్బంది పడుతున్నారు. అందుకే తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఎన్నికల హామీగా మార్చాయి.
ముంపు భయం.. భద్రాద్రి రక్షణ
తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని కేంద్రానికి లేఖ రాశారు. అంతకుముందు ఎంపీ రేణుకా చౌదరి అమరావతికి మద్దతు తెలుపుతూనే ఈ గ్రామాల ప్రస్తావన తీసుకువచ్చారు ఈ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరడానికి ప్రధాన కారణం భద్రాచలం రక్షణ. గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఈ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఇవి ఏపీలో ఉండటం వల్ల తెలంగాణ ప్రభుత్వం అక్కడ శాశ్వత రక్షణ చర్యలు చేపట్టలేకపోతోంది. అటు ఏపీ ప్రభుత్వం కూడా వీటిపై పెద్దగా దృష్టి సారించడం లేదు. అందుకే, ఈ గ్రామాలు తెలంగాణలో కలిస్తేనే భద్రాద్రికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించడం సాధ్యమవుతుందని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది.
ఆ గ్రామాలపై ఏపీ వైఖరేంటి?
ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ గ్రామాల ప్రజలు కూడా తెలంగాణలో కలవాలని కోరుకుంటూ ఉద్యమాలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముంపు ప్రాంతాలు కాని పక్షంలో, ఆ భూములను తెలంగాణకు అప్పగించడానికి ఏపీకి పెద్దగా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.
విలీన ప్రక్రియ – అంత సులభం కాదు!
రాజకీయంగా హామీలు ఇవ్వడం సులభమే కానీ, ప్రాసెస్ పరంగా ఇది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దుల మార్పు అనేది కేవలం రాష్ట్రాల మధ్య ఒప్పందంతో ముగిసేది కాదు. ముందుగా రెండు రాష్ట్రాల అసెంబ్లీలు ఈ విలీనానికి ఆమోదం తెలుపుతూ తీర్మానాలు చేయాలి. రాష్ట్రాల తీర్మానాల ఆధారంగా కేంద్ర హోం శాఖ ఒక ముసాయిదాను సిద్ధం చేయాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం, పార్లమెంట్లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతే అధికారికంగా విలీనం జరుగుతుంది. ప్రస్తుతం బంతి కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచి, ఏపీని ఒప్పించగలిగితేనే ఈ ఐదు గ్రామాల విలీనం సాధ్యమవుతుంది.
