బాహుబలి కథ ఆధారంగా ఇప్పుడు యక్షగానం సిద్ధమవుతోంది. ఎస్.ఎస్ రాజమౌళి చిత్రం `బాహుబలి ద బిగినింగ్’ అద్భుతవిజయం సాధించినప్పటికీ, ఈ సినిమా చూసిన ప్రేక్షకునిలో ఏదో అసంతృప్తిమాత్రం అలాగే మిగిలిపోయింది. దీనికి ప్రధానకారణం, హఠాత్తుగా కథ ఆగిపోవడం. దీంతో కథ పూర్తిగా తెలుసుకోవాలన్న తపన ప్రేక్షకుల్లో అలజడిరేపింది. ఇదే ఒక యక్షకళాకారుని మెదడు పదునుపెట్టించింది. వెంటనే బాహుబలి యక్షగాన రూపంలో తయారైంది. ఈ యక్షగానాన్ని చూసినవారికి ఎలాంటి అసంతృప్తి ఉండదట. ఇదీ దీని ప్రత్యేకత.
బాహుబలి చిత్రం ఓ చందమామ కథలాగా సాగిపోతుంటుంది. చందమామక కథలు చదివేటప్పుడు పాఠకుడు సన్నివేశాలను తన ఆలోచనలకు తగ్గట్టుగా ఊహించుకునేవాడు. అలాంటి చందమామ కథకు దృశ్యరూపం ఇస్తే ఎలా ఉంటుందో అలా, రాజమౌళి ఈ చిత్రంద్వారా ప్రేక్షుకులకు అందించారు. ఇప్పుడు అదే చిత్రానికి యక్షగానకళారూపం అందించాలనుకుంటున్నాడు ఓ కళాకారుడు.
కర్ణాటకలోని మంగళూరుకు చెందిన యక్షగాన కళాకారుడు దేవదాసు అక్టోబర్ నెలలో బాహుబలి యక్షగానాన్ని ప్రదర్శించబోతున్నారు. బాహుబలి చిత్రానికి పాపులారిటీ వచ్చిందికాబట్టి దీన్ని యక్షగానం కళారూపంగా మార్చలేదనీ, చిత్రకథ తనకు బాగానచ్చిందికాబట్టి ఆపని చేశామని దేవదాసు చెబుతున్నారు. `గండుగలి బాహుబలి’ పేరిట ప్రదర్శించే బాహుబలి కథలో కొన్నిమార్పులుంటాయి. తన చేసే త్యాగం గురించి బాహుబలికి తెలిసినట్టు కథ నడిపిస్తారు. ఇందులో యాక్షన్ సన్నివేశాలతోపాటుగా కామెడీని కూడా చేర్చారు. బాహుబలి యక్షగాన స్క్రిప్ట్ బాగానచ్చినట్లు ఎంతోమంది వాట్సప్ సందేశాలు పంపుతున్నారని దేవదాసు చెప్పారు.
యక్షగాన కళారూపాలకోసం సినిమా కథలను తీసుకోవడం దేవదాసుకు కొత్తేమీకాదు. తెంకు, బడగు రూపాలను తయారుచేయడంలో ప్రసిద్ధిచెందిన దేవదాసు ఇంతకు ముందు ముంగరు మాలే, ఆప్తమిత్ర సినిమాకథలను యక్షగాన రూపాలుగా మార్చి ప్రదర్శనలిచ్చారు. వాటిని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆయన ఇచ్చే ప్రదర్శనల్లో స్టేజి సెట్టింగ్స్, లైటింగ్ ఎఫెక్ట్స్ అదరగొట్టేలా ఉంటాయి. పౌరాణిక కథలతోపాటుగా చారిత్రక, సాంఘిక, మతపరమైన అంశాలపై యక్షగాన కళారూపాలను ప్రదర్సిస్తుంటారు.
బాహుబలి చిత్రం వివిధభాషల్లో విడుదలచేసినట్టుగానే, ఈ యక్షగాన కళారూపాన్ని కూడా వివిధభాషల్లో తీసుకువస్తే బాగుంటుందేమో. మరి ఆపనికూడా దేవదాసు చేస్తారేమో చూద్దాం. మొత్తానికి బాహుబలిని మరో రూపంలో చూడబోతున్నందుకు ప్రేక్షకుడు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
– కణ్వస