రెండు బెయిళ్ల కథ..! అశోక్‌కు హ్యాపీ.. రవిప్రకాష్‌కు బీపీ..!

టీవీ9 అమ్మకం వివాదంలో… ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం, లోగోల అక్రమ అమ్మకం కేసులు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాష్‌ కు ముందస్తు బెయిల్‌పై టెన్షన్ రేపటి వరకూ కొనసాగనుంది. ముందస్తు బెయిల్‌ కోసం.. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు.. విచారణ జరిపింది. పోలీసులకు దర్యాప్తు విషయంలో రవిప్రకాష్ పూర్తిగా సహకరిస్తున్నారని.. ఆయన తరపున లాయర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే నలభై గంటల పాటు ప్రశ్నించారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఎదుట.. రవిప్రకాష్‌ విచారణకు హాజరయ్యారని తెలిపారు. ఎన్‌సీఎల్టీలో టీవీ9 వివాదం నడుస్తుండగానే.. పోలీసులు కేసు నమోదు చేయడం చట్ట విరుద్ధమని వాదించారు. పోలీసులు పెట్టినవి అక్రమ కేసులన్నారు.. రవిప్రకాష్.. నేరానికి పాల్పడినట్లుగా.. స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని.. ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. పోలీసుల విచారణకు రవిప్రకాష్ సహకరించలేదని… తెలిపారు. ఫోర్జరీ కి సంబంధించి సాంకేతిక ఆధారాలు ఉన్నాయని.. అలాగే.. నిధుల దుర్వినియోగం, లోగో అమ్మకం వ్యవహారంలోనూ.. ఆధారాలు ఉన్నాయన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి… తీర్పును .. మంగళవారానికి వాయిదా వేశారు..

రవిప్రకాష్ మొదటగా.. తనపై పెట్టిన కేసులు రాజ్యాంగ వ్యతిరేకమని.. హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే.. ఆ పిటిషన్‌ ను అంత అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని చెప్పిన హైకోర్టు.. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకోవాలని సూచించింది. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్‌ తిరస్కరణకు గురయింది. దాంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. రవిప్రకాష్ ముందస్తు బెయిల్‌పై హైకోర్టే నిర్ణయం తీసుకోవాలని.. సుప్రీంకోర్టు సూచించింది. అదే సమయంలో.. విచారణకు హాజరవ్వాలని రవిప్రకాష్‌ను ఆదేశించింది. ఈ మేరకు.. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై.. హైకోర్టులో విచారణ జరిగింది. మంగళవారం తీర్పు రానుంది.

మరో వైపు… ఎన్నికలకు ముందు…తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో.. ఐటీ గ్రిడ్ సంస్థ యజమాని అశోక్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వైసీపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ఫిర్యాదులు చేయడంతో… పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓ వ్యక్తి..తన పేరు ఓటర్ జాబితాలో లేదని.. దానికి ఐటీ గ్రిడ్ కారణమని ఫిర్యాదు చేశారు. లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి… ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ చేశారని ఫిర్యాదు చేశారు. అయితే.. ఆధార్ డేటా లీక్ కాలేదని.. ఉడాయ్ ప్రకటించింది. ఓటర్ల జాబితా ప్రైవేటు వ్యక్తులు సవరించలేరని.. ఈసీ తెలిపింది. అయితే.. కేసు నమోదయినప్పటి నుంచి… అశోక్ పోలీసుల నోటీసులకు స్పందించలేదు. అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు సానుకూలంగా స్పందించడంతో.. ఆయన ఆజ్ఞాతం నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com