రివ్యూ: బ‌ల‌గం

Balagam Movie Telugu Review

హాస్య న‌టులు మెగాఫోన్ ప‌ట్ట‌డంలో వింతేం లేదు కానీ, వాళ్లు ఎంచుకొనే క‌థ‌లే ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంటాయి. చ‌లం, ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌హ్మ‌ణ్యం, ఏవీఎస్‌, ఎమ్మెస్ నారాయ‌ణ‌.. వీళ్లంతా కెప్టెన్ కుర్చీలో కుర్చున్న‌ప్పుడు కామెడీ క‌థ‌ల జోలికి వెళ్లలేదు. దాదాపుగా అంద‌రూ సీరియ‌స్ స‌బ్జెక్ట్సే డీల్ చేశారు. ఇప్పుడు జ‌బ‌ర్‌ద‌స్త్ ఫేమ్ వేణు కూడా అదే చేశాడు. చావు చుట్టూ ఓ క‌థ అల్లుకొన్నాడు. అదే.. బ‌ల‌గం. చాలా సైలెంట్ గా ఈ సినిమా పూర్త‌య్యింది. ఎప్పుడైతే దిల్ రాజు చేతుల్లోకి వెళ్లిందో.. అప్పుడు ప్ర‌చారం దొరికింది. ఆఘ‌మేఘాల మీద సినిమాని విడుద‌ల‌కు సిద్ధం చేశారు. ఇప్పుడు ప్రేక్ష‌కుల ముందుకూ వ‌చ్చింది. అస‌లింత‌కీ బ‌ల‌గం క‌థేమిటి? ఇందులోని బ‌లాలేమిటి? చూస్తే…

తెలంగాణ‌లోని మారుమూల ప‌ల్లెటూరు నేప‌థ్యంలో ఈ క‌థ మొద‌ల‌వుతుంది. సాయిలు (ప్రియ‌ద‌ర్శి) అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటాడు. ఈ గండం నుంచి గ‌ట్టెక్కాలంటే పెళ్లొక్క‌టే మార్గం. సాయిలుకు పెళ్లి కూడా కుదురుతుంది. ఆ క‌ట్నం డ‌బ్బుల‌తో బాకీలు తీర్చుకోవాల‌ని చూస్తాడు. అయితే.. రెండ్రోజుల్లో నిశ్చితార్థం అన‌గా.. తాత‌య్య కొమ‌ర‌య్య‌ చ‌నిపోతాడు. కొమ‌ర‌య్య అంతిమ సంస్కారాల కోసం బంధుగ‌ణ‌మంతా వ‌స్తుంది. ఎప్పుడో పాతికేళ్ల క్రితం చిన్న గొడ‌వ వ‌ల్ల దూర‌మైపోయిన కూతురు, అల్లుడు కూడా వ‌స్తారు. అయితే.. ఆ అల్లుడికీ, కొమ‌ర‌య్య కొడుక్కీ అస్స‌లు ప‌డ‌దు. వాళ్లిద్ద‌రి గొడ‌వ‌లూ మ‌ళ్లీ మొద‌ల‌వుతాయి. దానికి తోడు.. కొమ‌ర‌య్య‌ చిన క‌ర్మ నాడు పిండం పెడితే… కాకి వాల‌దు. ఐద‌వ రోజూ.. పిట్ట ముట్ట‌దు. ప‌ద‌కొండో రోజు కూడా ఇదే జ‌రిగితే ఊరికి అరిష్టం ప‌ట్టుకొంటుంద‌ని, దానికి కొమ‌ర‌య్య కుటుంబ స‌భ్యులే బాధ్య‌త వ‌హించాల‌ని పంచాయితీ తీర్మాణిస్తుంది. ఈ నేప‌థ్యంలో… ఈ కుటుంబ క‌ల‌హాలు మ‌రింత పెరుగుతాయి. కొమ‌ర‌య్య చావుతో మొద‌లైన ఈ క‌థ‌.. ఏ తీరానికి చేరింది..? కుటుంబం అంతా క‌లిసిందా, లేదా? సాయిలు అప్పుల బాధ ఎలా తీరింది? ఇదంతా తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

ఆరేళ్ల క్రితం క‌న్న‌డ‌లో `తిథి` అనే ఓ సినిమా వ‌చ్చింది. అక్క‌డ ఎన్నో అవార్డుల్ని గెలుచుకొన్న సినిమా అది. బ‌ల‌గంలో ఈ క‌థ తాలుకూ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఇది యాధృచ్చికంగా జ‌రిగిందా? లేదంటే `తిథి`లోని కోర్ పాయింట్ ని తీసుకొని ఈ సినిమా మ‌లిచారా? అనేది ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కే తెలియాలి. చావు చుట్టూ న‌డిచే క‌థ ఇది. `స్వ‌తంత్య్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్ర‌ద‌రూ` అని ఓ సినీ క‌వి పాడుకొన్నాడు. నిజంగానే కొన్ని చోట్ల చావుని ఓ పండ‌గ‌లా చేస్తారు. తెలంగాణ‌లో ఇలాంటి సంస్కృతి క‌నిపిస్తుంది. చావింట్లో మందు – విందుతో దావ‌త్ ఇస్తారు. పాట‌లు పాడుకొంటారు. శ‌వాన్ని.. ఊరేగింపు మ‌ధ్య స్మ‌శానానికి తీసుకెళ్తారు. అయితే.. అదే చావింట్లో రాజ‌కీయాలు, ఇగో స‌మ‌స్య‌లు మొద‌లైతే ఎలా ఉంటుందో చెప్పే క‌థ‌… `బ‌ల‌గం`.

ఏ క‌థ‌కైనా స‌న్నివేశాలు, పాత్ర‌లు బ‌లం అవుతాయి. కొన్ని సినిమాల‌కు మాత్రం నేప‌థ్యం బ‌లంగా మారుతుంది. ప్రాంతం, భాష‌, అక్క‌డి సంస్కృతి క‌థ‌లో మిళితం అయితే.. ఆయా చిత్రాలు మ‌రింత స‌హ‌జంగా ఉంటాయి. మ‌ట్టి వాస‌న‌తో మ‌రింత గుభాళిస్తాయి. బ‌లగంలో ఇవ‌న్నీ క‌నిపిస్తాయి. ఓ చావు చుట్టూ క‌థ న‌డ‌పాల‌న్న ఆలోచ‌న రావ‌డ‌మే సాహ‌సం. ఎందుకంటే. తెర‌పై అలాంటి స‌న్నివేశాల్నిచూడ్డానికి ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. కానీ ఈ సినిమా అంతా అదే క‌థ‌. ఓ శ‌వం చుట్టూ చుట్టాలు, స్నేహితులు చేరి.. ఏడుపులు పెడ‌బొబ్బ‌లు పెట్ట‌డం.. ఆ సీన్‌కి దాదాపు 10 నిమిషాల పాటు చూపించ‌డం.. మామూలు విష‌యం కాదు. క‌థ‌లోని కోర్ పాయింటే అదైన‌ప్పుప‌డు.. ఇవ‌న్నీ త‌ప్ప‌ని వ్య‌వ‌హారాలు.

బ‌త‌క‌డంలోనే కాదు, మ‌నిషి చావులోనూ లోతైన ఫిలాస‌ఫీ ఉంటుంది. మ‌నుషుల మ‌న‌స్త‌త్వాలు వేరే కోణంలో అర్థ‌మ‌వుతుంటాయి. `ఈ మ‌నిషి ఎప్పుడు పోతాడో` అని ఎదురు చూసిన‌వాళ్లు కూడా ఆ మ‌నిషి చ‌నిపోతే. `ఇంకొన్నాళ్లు ఉండాల్సిన మ‌నిషి` అంటూ శ‌వం ముందు క‌న్నీరు రాలుస్తారు. బ‌తికున్న‌ప్పుడు టీ చుక్క ఇవ్వ‌ని వాళ్లు సైతం.. చ‌చ్చాక `నా చేతి చేప‌ల కూర తిందువు కానీ రా..` అంటూ శోకాలు పెడ‌తారు. చావింట్లో విస్త‌ట్లో క‌క్కా ముక్కా ప‌డ‌లేద‌ని అలిగేవాళ్లు, విషాదం నుంచి కోలుకోక‌ముందే వాటాలు అడిగే పుత్ర ర‌త్నాలు.. క‌నిపిస్తూనే ఉంటారు. ఇవ‌న్నీ క‌ళ్ల ముందు క‌నిపించే వాస్త‌వాలే. తెర‌పై ఇలాంటి దృశ్యాలే క‌నిపిస్తుంటాయి. మ‌నిషిలో దాగున్న మ‌రో మ‌నిషిని ప్ర‌శ్నిస్తుంటాయి. ఓ మ‌నిషి పోయాక జ‌రిగే అంతిమ సంస్కారాలు, వాటి వెనుక ఉన్న అంత‌రార్థాలూ అక్క‌డ‌క్క‌డ చెప్పే ప్ర‌య‌త్నం జ‌రిగింది. తెలంగాణ సంస్కృతిలో భాగ‌మైన ఒగ్గు క‌థ‌లు, జాన‌ప‌ద గీతాలూ ఈ క‌థ‌లో మిళిత‌మైపోయాయి. క్లైమాక్స్ లో.. కుటుంబం అంటే ఏమిటో, బంధాల గొప్ప‌ద‌నం ఎలాంటిదో, ఇంటి పెద్ద బాధ్య‌త ఏమిటో.. ఒక్క పాట‌లో చెప్పి క‌థంతా సుఖాంతం చేశారు. భారీ డైలాగులు ప‌డాల్సిన చోట‌… పాట రూపంలో ఆ భావాన్ని చెప్పి, అంద‌రినీ ఏకం చేయ‌డం బాగుంది.

ఈ సినిమాలో లోపాలు లేక‌పోలేదు. క‌థంతా చాలా స్లో పేజ్‌లో సాగుతుంటుంది. చావు స‌న్నివేశాల్ని, అక్క‌డి త‌తంగాల్ని మ‌రీ సుదీర్ఘంగా చూపిస్తూ వెళ్లారు. క‌థానాయ‌కుడి పాత్ర‌లో నిజాయ‌తీ లేదు. కేవ‌లం డ‌బ్బు కోసం, త‌న అప్పుల్ని మాఫీ చేయించుకోవ‌డం కోసం పాపులాడుతూ ఉంటాడు. త‌న ప్రేమ క‌థ‌లూ పేల‌వంగానే ఉన్నాయి. ప్ర‌ధ‌మార్థంతో పోలిస్తే.. ద్వితీయార్థం బెట‌ర్‌గా ఉంది. ఎమోష‌న్లు పండాయి. సినిమాని ఓ నికార్స‌యిన తెలంగాణ ప‌ల్లెటూర్లో తీయ‌డం వ‌ల్ల‌… మ‌రింత స‌హ‌జ‌త్వం అబ్బింది. ఎక్క‌డా సెట్ కనిపించ‌లేదు. సినిమాటిక్ ప్రోప‌ర్టీ చూపించ‌లేదు. పాత్ర‌లు, ఆ పాత్ర‌ని పోషించిన న‌టీన‌టులు, వాళ్ల మాట తీరు అన్నీ స‌హ‌జంగా సాగాయి.

ఇలాంటి సినిమాల‌కు పాత్ర‌ధారుల్ని ఎంచుకోవ‌డం క‌త్తిమీద సామే. ఈ విష‌యంలో చిత్ర‌బృందం ప‌రిణితి చూపించింది. ప్ర‌తీ పాత్ర‌, అందుకోసంఎంచుకొన్న న‌టీన‌టులు ప‌ర్‌ఫెక్ట్ ఛాయిస్ అనిపించాయి. అందరూ సింక్‌లోనే ఉన్నారు. తాత‌య్య‌ని గుర్తు చేసుకొంటూ బాధ‌ప‌డే సన్నివేశంలో ప్రియ‌ద‌ర్శి న‌ట‌న న‌చ్చుతుంది. సినిమాటోగ్ర‌ఫీ నీట్ గా ఉంది. ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణాన్ని త‌న కెమెరాలో బాగా చూపించాడు. పాట‌లు ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం. భీమ్స్ అందించిన బాణీలు బాగున్నాయి. మంగ్లీ పాడిన పాట ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. పొట్టి పిల్ల‌.. పాట మ‌ళ్లీ మ‌ళ్లీ పాడుకొనేలా ఉంది. న‌టుడిగా ఎప్పుడో పాస్ మార్కులు తెచ్చుకొన్న వేణు.. త‌న‌లో ద‌ర్శ‌కుడూ ఉన్నాడ‌ని నిరూపించుకొన్నాడు. ఓ భిన్న‌మైన అంశాన్ని, తెలంగాణ సంస్కృతి జోడించి చెప్ప‌డంలో స‌క్సెస్ అయ్యాడు. థియేట‌ర్లో చూడ్డానికి కాస్త ఓపిక కావాలి. మ‌న‌దైన క‌థ‌ల్ని, మ‌న‌దైన మ‌న‌స్త‌త్వాల్ని ఆవిష్క‌రించే సినిమాలు ఇష్ట‌ప‌డేవారికి బ‌ల‌గం నచ్చుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎమ్మెల్సీ ఓడిపోతే మళ్లీ మండలిని రద్దు చేస్తారా !?

జగన్మోహన్ రెడ్డి మనస్థత్వం.. ఆయన వ్యవహారశైలిపై విచిత్రమైన చర్చలు జరుగుతున్నాయి. మరోసారి మండలి రద్దు తీర్మానం చేసినా చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీల్లో ఓడిపోయి... భవిష్యత్...

విశాఖలో రాష్ట్రంలోని పేదలందరికీ స్థలాలివ్వొచ్చుగా !?

అమరావతి రాజధాని కాదంటున్నారు. కానీ రైతులు ఇచ్చిన భూముల్ని మాత్రం అప్పనంగా పేదల పేరుతో పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టడానికి ఆర్ 5 జోన్లు లాంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఇది చట్ట...

రివ్యూ : దాస్ కా ధమ్కీ

Das Ka Dhamki Movie Telugu Review రేటింగ్‌: 2.25/5 ఒకే పోలికలతో వున్న రెండు పాత్రల నేపధ్యంలో అనేక కథలు వచ్చాయి. డబుల్ యాక్షన్ తెలుగు సినిమాకి ఎవర్ గ్రీన్ ఫార్మూలానే. దాస్ కా...

లిక్కర్ కేసు కన్నా పేపర్ లీకేజీతోనే అసలు గండం !

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ పరీక్షల లీకేజీల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. ఎన్నో ఏళ్ల తర్వాత ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్లన్నింటిపై అనుమానాలు వచ్చేలా ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close