”అఖండ ఇండస్ట్రీకి కొత్త ఊపు ఇచ్చింది. ఇండస్ట్రీని కాపాడింది. ఇక ముందు ఇండస్ట్రీని కాపాడుతాం” అని అన్నారు నందమూరి బాలకృష్ణ. అఖండ’ చిత్ర బృందం విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకుంది. బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను తదితరులు ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ‘అఖండ’ చిత్రం విజయవంతం కావడంతో చిత్ర పరిశ్రమకు ఒక ధైర్యమొచ్చిందన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ల రెట్లు తగ్గింపు అంశం కూడా ప్రస్తావనలోకి వచ్చింది. దీనిపై బాలయ్య స్పందిస్తూ.. ” ఏపీలో ఉన్న సినిమా టికెట్ ధరల విషయంపై ‘అఖండ’ విడుదలకు ముందు మేమంతా చర్చించాం. కానీ, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి ధైర్యంగా ముందుకొచ్చి ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఇప్పుడే విడుదల చేద్దామన్నారు. టికెట్ల విషయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తామంటోంది. ఏం జరుగుతుందో చూద్దాం. మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇండస్ట్రీని తప్పకుండ కాపాడుతాం” అని చెప్పుకొచ్చారు బాలయ్య.