‘అఖండ 2’ సస్పెన్స్ వీడింది. రిలీజ్ డేట్ ఖాయం అయ్యింది. అంతా అనుకొన్నట్టుగానే డిసెంబరు 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 11న ప్రీమియర్లు ప్రదర్శించబోతున్నారు. ‘అఖండ 2’ విడుదలకు లైన్ క్లియర్ చేస్తూ చెన్నై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనాన్షియర్లు కూడా రాజీకి రావడంతో పరిస్థితి నిర్మాతల చేతుల్లోకి వచ్చింది. దాంతో రిలీజ్ గ్రహణం దాటగలిగింది. ఈరోస్ సంస్థకు దాదాపు రూ.27 కోట్ల వరకూ 14 రీల్స్ చెల్లించాల్సివుంది. చివరికి 15 కోట్లకు రాజీ కుదిరిందని సమాచారం అందుతోంది. లోకల్ ఫైనార్షియర్లు కూడా కాస్త వెనక్కి తగ్గడంతో గండాలన్నీ దాటగలిగింది అఖండ 2.
ఏపీ, తెలంగాణలలో 11 రాత్రి 9 గంటల నుంచి ప్రీమియర్లు ప్రదర్శించే ఛాన్స్ వుంది. ఇందుకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా మరో జీవో ఇవ్వాల్సివుంది. రేపటి నుంచే బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవ్వొచ్చు. ఓవర్సీస్ విషయం ఓ కొలిక్కి రావాల్సివుంది. అక్కడ ప్రీమియర్లు కాస్త ఆలస్యంగా మొదలవుతాయని టాక్. అఖండ 2 రిలీజ్ డేట్ ఫిక్సవ్వడంతో 12న రిలీజ్కు సిద్ధమైన మోగ్లీ, సైక్ సిద్దార్థ్, ఈషా చిత్రాలు వెనక్కి తగ్గాయి. ఈమూడు చిత్రాలు ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్లు వెదుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. 19న అవతార్ 3 రాబోతోంది. 25 న కూడా సినిమాల తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది.
