అల్లం నారాయణ, జర్నలిస్ట్ యూనియన్ లు, మీడియా సంఘాలు ఇప్పుడు స్పందించరా?

(This article is part of Telugu360 Contributor Network and hasn't been edited by our team. If you have any questions or want to contribute, reach out to krishna@telugu360.com)

మోజో టీవీ కెమెరామెన్ ను నటుడు మరియు ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ బండ బూతులు తిడుతూ దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

మోజో టీవీ కెమెరామెన్ పై బాలకృష్ణ బూతులు , బెదిరింపులు:

ఎన్నికల ప్రచారంలో ఉన్న బాలకృష్ణ, అక్కడ ఉన్న మోజో టీవీ కెమెరామెన్ ఏదో రికార్డ్ చేశాడనే ఉద్దేశంతో ముందుకి పిలిచి “దాన్ని డిలీట్ చెయ్, దాన్ని డిలీట్ చెయ్” అంటూ అతని మీద మీద కు వెళుతూ దౌర్జన్యంగా మాట్లాడాడు. బాలకృష్ణ పక్కన ఉన్న అనుచరులు కూడా “డిలీట్ చెయ్ అమ్మా” అంటూ అతనిని అడగసాగారు. దానికతను, “నేనేమీ రికార్డు చేయలేదు సార్” అంటూ సమాధానం ఇచ్చాడు. అయితే బాలకృష్ణ మాత్రం అతని మీద బూతులు లంకించుకుంటూ, మీద మీద కు వెళుతూ ” రాస్కల్, మా బ్రతుకులు మీ చేతిలో ఉన్నాయా రా? నరికి పోగులు పెడతా, #@?###$#( బూతులు), ప్రాణాలు తీస్తాను, బాంబులు వేయడం కూడా తెలుసు నాకు, కత్తి తిప్పడం కూడా తెలుసు” అంటూ ఆ కెమెరామన్ ను బెదిరించాడు. అయితే ఇదంతా అక్కడే ఉన్న ఇంకొక కెమెరాలో రికార్డయింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

నటులు, మహిళలు, కులాలు – అందరిమీద గతంలో తీవ్ర వ్యాఖ్యలు :

బాలకృష్ణ సంగతి తెలిసిందే. గతంలో ” మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు” అంటూ రేసిస్ట్ వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ, ఇంకొక సందర్భంలో ” రాజకీయాల్లోకి వచ్చిన అమితాబచ్చన్ ఏం పీకాడు” అంటూ ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడిన సంగతి తెలిసిందే. అలాగే, ” రాజకీయాల్లో చిరంజీవి, మా తండ్రి ఎన్టీఆర్ కాలి గోటికి కూడా సరిపోడు” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇంకొక సందర్భంలో, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం ఊరూరా తిరిగి నిస్వార్థంగా పనిచేసిన పవన్ కళ్యాణ్ గురించి అడిగితే, ” పవన్ కళ్యాణా? అతను ఎవరో నాకు తెలియదు” అంటూ అహంకారపూరితంగా మాట్లాడిన సంగతి కూడా తెలిసిందే. జనసేన పార్టీ గురించి అన్యాపదేశంగా మాట్లాడుతూ, ” ఈ మధ్య అలగాజనం, సంకరజాతి జనాలు రాజకీయ పార్టీలు అంటూ తిరుగుతున్నారు” అంటూ వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఇంకొక సందర్భంలో, ” ఆడ పిల్లలు కనిపిస్తే ముద్దయినా పెట్టాలి కడుపైనా చేయాలి” అంటూ పిచ్చి మాటలు మాట్లాడి మహిళా లోకం చేత చీవాట్లు పెట్టించుకున్నాడు. అఫ్ కోర్స్, అప్పుడు కూడా రెగ్యులర్గా టీవీ లలో కనిపించే మహిళా సంఘాల నేతలు ఆయన మీద పల్లెత్తు మాట అనలేదు అనుకోండి అది వేరే విషయం. ఇంకొక సందర్భంలో, హీరోయిన్ లను ఉద్దేశించి, ” సినీ పరిశ్రమలో నేను ఎక్కని ఎత్తులు లేవు, నేను చూడని లోతులు లేవు” అంటూ అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసి, తాను పరిశ్రమలో ఆడవాళ్ళను ఎక్స్ప్లాయిట్ చేశానని పరోక్షంగా తానే ఒప్పుకున్నాడు.

కళ్లకు గంతలు కట్టుకున్న మీడియా:

చలపతిరావు లాంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నోరు జారితే ఆయన చేత క్షమాపణలు చెప్పించే వరకు నిద్రపోకుండా మెరుగైన సొసైటీ కోసం పాటుపడే ఛానళ్లు, ఇప్పుడు కళ్లకు గంతలు కట్టుకున్నట్టు గా కనిపిస్తోంది. జబర్దస్త్ అనే ఒక కామెడీ స్కిట్స్ లో లో భాగంగా ఒక చిన్న వ్యాఖ్య చేసిన ఒక చిన్న కమెడియన్ ను పట్టుకుని రప్ఫాడించే దమ్మున్న చానల్స్ ఇప్పుడు ముసుగు తన్ని నిద్రపోతున్నట్లుగా కనిపిస్తోంది. సినిమా పరిశ్రమలోని ఇతరుల మీద వ్యాఖ్యలు చేయడానికి ఎగేసుకుంటూ వచ్చే విమర్శకులు ఇప్పుడు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్టు అనిపిస్తోంది.

జర్నలిస్టు సంఘాలు, మీడియా సంఘాలు ఇప్పుడు ర్యాలీలు చేస్తాయా?

ఒక ఏడాది కిందట, శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ తల్లిని ఉద్దేశించి బూతు పదం తో దూషించినప్పుడు పవన్ కళ్యాణ్ తనని టార్గెట్ చేస్తున్న మీడియా సంస్థలను బహిష్కరించాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చారు. అయితే శ్రీరెడ్డి ఆ బూతు పదం తో తిట్టడానికి రెండు నెలల ముందు నుండే ఆ మీడియా చానళ్లు పవన్ కళ్యాణ్ ని కేంద్రంగా చేసుకుని ప్రతిరోజూ వ్యతిరేక కథనాలు, వ్యక్తిత్వ హననాలు చేస్తూ వచ్చాయి. అప్పటి దాకా ఓపికగా భరించిన పవన్ కళ్యాణ్ తన తల్లిని దూషించడంతో సహనాన్ని కోల్పోయి, ఆ చానళ్లను బహిష్కరించాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చారు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కానీ, అతని అభిమానులు కానీ, ఒక్క మీడియా ప్రతినిధి మీద కానీ ఒక్క మీడియా సంస్థ మీద కానీ దాడి చేయలేదు.

కానీ మీడియా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు అప్పుడు పెద్ద పెద్ద ర్యాలీలు చేశాయి. తాము పవన్ కళ్యాణ్ మీద దాడి చేసినా పవన్ కళ్యాణ్ గమ్ముగా భరించాలి తప్ప, తమ చానళ్లను చూడవద్దని ప్రజలకు పిలుపునివ్వడం అప్రజాస్వామికమని, అన్యాయమని గళమెత్తాయి. జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు అల్లం నారాయణ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలని, ఇప్పుడు కూడా సినిమా హీరో లాగా ప్రవర్తిస్తే కుదరదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ మీద ప్రెస్ కౌన్సిల్ కు లేఖలు రాశారు. కేసులు పెట్టారు.

తన రెజ్యూమె చదివి వినిపించిన బాలయ్య:

మరి ఇప్పుడు సినీ నటుడే కాకుండా ఎమ్మెల్యే కూడా ఆయన బాలకృష్ణ తమ మీడియాకే చెందిన ఒక కెమెరామన్ మీద బండ బూతులు ప్రయోగించారు, దాడి చేసినంత పని చేశారు, ప్రాణాలు తీస్తా అని బెదిరించారు. పైగా తనకు బాంబులు వేయడం వచ్చని, కత్తి తిప్పడం కూడా వచ్చని తన రెజ్యూమె చదివి వినిపించారు. మరి ఇప్పుడు అల్లం నారాయణ కానీ, మీడియా కానీ, జర్నలిస్టు సంఘాలు కానీ కనీసం బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తాయా? లేకపోతే బాలకృష్ణ స్వతహాగా మంచి వాడని, చిన్నపిల్లాడి మనస్తత్వం అని, బోలా శంకరుడు అని, ఆయన బండ బూతులు తిట్టినా అది ఆయన మంచి మనసే అని చెప్పి సరి పుచ్చుకుంటారా? లేక అది కూడా చేయకుండా నిద్ర పోయినట్టు నటిస్తారా? వేచి చూడాలి.

– జురాన్ (@CriticZuran)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com