అసెంబ్లీలో అనూహ్యంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు కూటమిలో కొత్త కుంపటి పెట్టినట్లయింది. ఇలాంటి వాటి కోసమే కాచుకుని కూర్చుని వైసీపీ నేలు, వారి మీడియా, సోషల్ మీడియా విశ్వరూపం చూపిస్తారు. అందుకే ఈ విషయంలో కూటమి నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా సైన్యం ఎంత మౌనం పాటిస్తే సమస్య అంత త్వరగా తెరమరుగు అవుతుంది. కాదనుకుంటే ఆ రాజకీయాలకు సంబంధం లేని ఆ అనవసర వివాదం అంతకంతకూ పెద్దదవుతుంది. ఊహించని నష్టం చేస్తుంది.
చిరంజీవి, బాలకృష్ణ – రాజకీయాలకు సంబంధం లేని అంశం
జగన్ను చిరంజీవి నిలదీశాడు అని కామినేని శ్రీనివాస్ అన్నారు. అందుకే భేటీ అయ్యారని చెప్పారు. ఇది బాలకృష్ణకు నచ్చలేదు. చిరంజీవికి అక్కడ జరగని అంశంలో గొప్పగా చెబుతున్నారని కానీ తనను మాత్రం ఎఫ్డీసీ సమావేశ గెస్టుల్లో తొమ్మిదో పేరుగా పెట్టి అవమానించారని ఆయన ఫీలయ్యారు. సినిమాటోగ్రఫీ శాఖ జనసేన వద్ద ఉంది. బాలకృష్ణను ఇలా అవమానించారన్న విషయం ఇప్పటి వరకూ బయటకు రాలేదు. కానీ తనను అలా అవమానించి ఇప్పుడు అసెంబ్లీలో చిరంజీవిని గొప్పగా ప్రజెంట్ చేస్తున్నారని ఆయనకు ఆగ్రహం వచ్చింది. బాలకృష్ణ తాను చెప్పాలనుకున్నది చెప్పారు. చిరంజీవి దానిపై స్పందించారు. అది రాజకీయానికి సంబంధం లేదు. అసెంబ్లీలో జరిగినా అది సినీ టాపిక్ .
అనవసర వివాదమే !
బాలకృష్ణ తనకు అవమానం జరిగిందని ఫీలవడం ద్వారానే ఈ సమస్య వచ్చింది. ఈ సమస్య రాకుండా చేసుకోవాల్సింది. వచ్చినా అప్పట్లో అంతర్గతంగా చర్చించుకున్నారు. బయటకు రాలేదు. కానీ ఇప్పుడు సందర్భంతో పాటు బాలకృష్ణ ఇలాంటి వాటిని దాచుకోరు కాబట్టి బయటకు వచ్చేసింది. ఇది రాజకీయంగా ఇతర పార్టీలకు మేలు జరిగేలా.. కూటమి పార్టీలు చేయకూడదు. చిరంజీవి స్పందించారు. దాంతో ఇక వివాదాన్ని ముగించుకుని మూవ్ ఆన్ అవడం ఉత్తమం. ఇలాంటి అవసరం లేని సమస్యలను పెంచుకుంటూ పోతే చివరికి జరిగేది నష్టమే.
ప్రజాసమస్యలపై ఇలా విబేధిస్తే ప్రజలకు మేలు
ప్రజా సమస్యలపై ఇలా రాజకీయ పార్టీలు, నేతలు ఒకరితో ఒకరు విబేధిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రతిపక్షం ఎలాగూ యాక్టివ్గా లేదు. ఇలాంటి సమయంలో ప్రతిపక్షంగా ఎమ్మెల్యేలే మారాల్సి ఉంది. రాజకీయంగా నొప్పి తగలకుండా ప్రతిపక్షంగా వ్యవహరించడం సవాలే కానీ.. తప్పని పరిస్థితి. చిరంజీవి, బాలకృష్ణ టాలీవుడ్ సినీ పరిశ్రమకు రెండు పిల్లర్లు లాంటి వాళ్లు. వాళ్ల మధ్య కెరీర్ పరంగా పోటీ ఉంటుంది. ఆ ఈగో సమస్యలూ ఉండవచ్చు. అలాంటివి రాజకీయాలకు వర్తింపచేసేలా చేసుకోకపోవడం ఉత్తమం. కూటమిలోని మిత్రపక్ష పార్టీలు, వారి కార్యకర్తలు దీన్ని తెలుసుకుంటే సమస్య పరిష్కారం అయిపోతుంది.