బాల‌య్య‌ పారితోషికం తిరిగి ఇస్తున్నాడా?

కొంత‌మంది క‌థానాయ‌కులు తెర‌మీదే కాదు, బ‌య‌ట కూడా పెద్ద మ‌న‌సు చూపిస్తుంటారు. సినిమా న‌ష్టాల పాలైతే, త‌మ వంతు బాధ్య‌త‌గా ఎంతో కొంత తిరిగి చెల్లిస్తున్నారు. ఇప్పుడు బాల‌య్య కూడా అదే ప‌ని చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. సి,క‌ల్యాణ్ నిర్మాత‌గా తెర‌కెక్కిన `రూల‌ర్‌` ఈనెల 20న విడుద‌లై, డిజాస్ట‌ర్‌గా మిగిలిపోయింది. రూ.40 కోట్ల‌తో ఈసినిమా తీస్తే, ప‌ట్టుమ‌ని ప‌ది కోట్లు కూడా రాలేదు. డిజిట‌ల్‌, శాటిలైట్ లేక‌పోతే క‌ల్యాణ్ నిండా మునిగేవాడు. అవి కాస్త ఆదుకున్నాయి. అయినా స‌రే, భారీ న‌ష్టాల్ని భ‌రించాల్సివ‌స్తుంది. బాల‌య్య‌తో తీసిన ప‌ర‌మ వీర‌చ‌క్ర కూడా క‌ల్యాణ్‌ని దారుణంగా ముంచేసింది. ఆ సినిమా అయితే… క‌నీసం 20 శాతం కూడా వెన‌క్కి రాబ‌ట్టుకోలేక‌పోయింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ సినిమాకి శాటిలైట్ కూడా అవ్వ‌లేదంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు.

అందుకే బాల‌య్య త‌న వంతు సాయం అందించ‌డానికి రెడీ అయ్యాడు. త‌న పారితోషికంలో కొంత మొత్తం వెన‌క్కి ఇస్తాన‌ని బాల‌య్య మాట ఇచ్చాడ‌ట‌. అంతేకాదు… మ‌రో సినిమా కూడా చేసిస్తా అంటున్నాడ‌ట‌. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బాల‌య్య‌తో మ‌రో సినిమా చేసేందుకు క‌ల్యాణ్ ధైర్యం చేయ‌డం లేదు. వినాయ‌క్‌తో అనుకున్న సినిమా ఎప్పుడో కాన్సిల్ అయ్యింది. వినాయ‌క్ మంచి క‌థ ప‌ట్టుకొచ్చినా – ఇప్పుడు బాల‌య్య‌తో సినిమా చేసే ఉద్దేశంలో మాత్రం క‌ల్యాణ్ లేడ‌నే చెప్పాలి. పారితోషికంలో కొంత భాగం వెన‌క్కి ఇస్తే చాల‌ని క‌ల్యాణ్ కూడా ఎదురుచూస్తున్నాడు. సో… క‌ల్యాణ్ కి కొంత‌మేర ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com