తన కెరీర్‌లో విభిన్న పాత్రలు చేస్తూ వచ్చాడు నందమూరి బాలకృష్ణ. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక, సైన్స్ ఫిక్షన్… ఇలా ఏదీ వదల్లేదు. ఇప్పుడు బాలయ్య దృష్టి.. ‘చంఘీజ్ ఖాన్’ పై పడింది. ఎప్పటికైనా సరే.. ఛంఘీజ్ ఖాన్ సినిమా చేస్తానని… ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ప్రకటించాడు బాలయ్య. అయితే దానికి టైమ్ రావాలన్నాడు. చరిత్రలో… ‘ఛంఘీజ్ ఖాన్’కి ప్రత్యేక స్థానం ఉంది. అతను మంగోల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడు. చరిత్రలోనే అతి పెద్ద సామ్రాజ్యంగా మంగోల్ సామ్రాజ్యాన్ని పేర్కొంటారు చరిత్ర కారులు. ఆ సామ్రాజ్య స్థాపన కోసం చంఘీజ్ ఖాన్ ఏం చేశాడు? తన పోరాటం ఎలా కొనసాగించాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. చంఘీజ్ ఖాన్ పై రకరకాల పుస్తకాలు వచ్చాయి. తెలుగులో ఈ పేరుతో వచ్చిన పుస్తకానికి సాహిత్య వేదికపై గొప్ప స్థానం లభించింది. ఇప్పుడు బాలయ్య దృష్టి ఈ సినిమాపై పడింది. సరైన దర్శకుడు దొరికితే.. బాలయ్య కల నెరవేరినట్టే. అయితే… ఇంత పెద్ద కథని, ఇంత పెద్ద కాన్వాస్ ఉన్నచిత్రాన్ని నడపగలిగే.. ఆ దర్శకుడు ఎవరన్నది బాలయ్య అభీష్టం మేరకు ఉంటుంది. ప్రస్తుతం వీర సింహారెడ్డి పని ముగించారు బాలయ్య. అతి త్వరలోనే… అనిల్ రావిపూడి సినిమానీ మొదలెడతారు.