హిందీ పేపర్ లీక్ చేశానని తనపై అడ్డగోలు కేసులు పెట్టి అరెస్టు చేయించిన కేసీఆర్, కేటీఆర్లపై బండి సంజయ్కు పీకల మీద దాకా కోపం ఉంది. అందుకే ఆయన తరచూ రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూంటారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి కాళేశ్వరం వరకూ ప్రతి విషయంలోనూ ఎందుకు అరెస్టులు చేయడం లేదని ప్రశ్నిస్తూ ఉంటారు. సోమవారం కూడా అదే ప్రశ్న వేశారు. తప్పుడు కేసులు పెట్టి రేవంత్ రెడ్డినీ అరెస్టు చేసిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు అరెస్టు చేయడం లేదంటున్నారు.
కేసీఆర్ హయాంలో రేవంత్ రెడ్డి తర్వాత ఎక్కువగా పోలీసు కేసులు, వేధింపులు, అరెస్టులకు గురయింది బండి సంజయ్ నే. అందుకే కేసీఆర్, కేటీఆర్ లు జైలుకెళ్తే చూడాలని ఆయన గట్టిగా ఆశపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎప్పుడు అరెస్టులు అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో మాత్రమే రేవంత్ రెడ్డిని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఇతర విషయాల్లో అంత తీవ్రత చూపించడం లేదు. కానీ కేసీఆర్, కేటీఆర్లపై విమర్శలు మాత్రం తీవ్ర స్థాయిలో చేస్తున్నారు.
కేటీఆర్ స్థాయి ఇంకా రాజకీయాల్లోకి రాని తన కుమారుడి స్థాయిలో సరిపోతుదంని తేల్చేశారు. ఎందుకంటే తన కుమారుడు మంచి షర్ట్ వేసుకుంటే దాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియాతో ట్రోల్ చేయిస్తారన్నారు. అందుకే తన కుమారుడి స్థాయి మాత్రమే కేటీఆర్దన్నారు. బీజేపీతో పొత్తులు లేదా విలీనానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తే.. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారిలో బండి సంజయ్ ముందు ఉంటారు. వ్యక్తిగత రాజకీయాలు చేయడం ద్వారా.. కేసీఆర్, కేటీఆర్ ఆయనను అలా శత్రువుగా మార్చుకున్నాని అనుకోవచ్చు.