క్రికెట్ మ్యాచ్ కోసం కొలంబో పోవాల్సిందేముంది.. టీవీలోనే చూడొచ్చుగా అని జగన్ రెడ్డి చేసిన కామెంట్లను సమర్థించిన వారు బయట ఒక్కరూ కనిపించలేదు…కానీ ఆర్కే సమర్థించారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ వ్యక్తిగత సరదాలను పట్టించుకోలేదని ఆయనను చూసి లోకేష్ నేర్చుకోవాలని కూడా సలహా ఇచ్చారు. అయితే ఆర్కే ఇలా ఎందుకు సలహా ఇవ్వాల్సి వచ్చిందో కూడా వెంటనే బయటపడ్డారు. ఎందుకంటే లోకేష్ పక్కన సానా సతీష్ ఉన్నారట.
లోకేష్ క్రికెట్ మ్యాచ్ లకు వెళ్లడం తప్పు లేదు కానీ.. ఆయన పక్కన సానా సతీష్ ఉండటం వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయని ఆర్కే అంటున్నారు. అవేం సమస్యలో ఆర్కే చెప్పలేదు. సానా సతీష్ తెలుగుదేశం పార్టీ ఎంపీ. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. క్రికెట్ వ్యవహారాలు మొత్తం ఆయన చూస్తున్నారు. లోకేష్ మ్యాచ్ టూర్లు కూడా సహజంగానే ఆయన చూస్తారు. బీసీసీఐ, ఏసీసీ పెద్దలతోనే క్రికెట్ పరంగా సానా సతీష్ టచ్ లో ఉంటారు. తామే ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తిని లోకేష్ ఎందుకు దూరం పెట్టాలి?
సానా సతీష్ విషయంలో ఆంధ్రజ్యోతి ఆర్కే మొదటి నుంచి వ్యతిరేకత చూపిస్తున్నారు. వైసీపీ ఉన్నప్పుడు కూడా మైనింగ్ లో కింగ్ అని … ఆయనపై లెక్కలేనన్ని కథనాలు రాశారు. వాటిలో ఒక్కటీ నిజమని నిరూపించలేదు. ఆయన వైసీపీ పెద్దలకు సన్నిహితమని ఎప్పుడూ నిరూపణ కాలేదు. ఆ కథనాలతో సానా సతీష్ పై ఆంద్రజ్యోతి టీడీపీ క్యాడర్ లోనే ఓ వ్యతిరేకమైన ఇమేజ్ తీసుకు వచ్చింది.అదే ఇమేజ్ చూపిస్తూ.. లోకేష్ తో ఆయన ఉండకూడదని .. ఆర్కే సలహాలిస్తున్నారు. వీరి మధ్య ఏం జరిగిందో వాళ్లకే తెలియాలి కానీ.. లోకేష్ మ్యాచులు చూడవచ్చు కానీ.. సానా సతీష్ పక్కన ఉండకూడదన్నది మాత్రం వింతగా ఉంది. ఈ వారం తన కొత్తపలుకులో ఆర్కే.. బిల్ గేట్స్ పై వైసీపీ నేతలు నిందలేయడంపై మండిపడ్డారు. అది వైసీపీ నైజం. రజనీకాంత్ వచ్చి చంద్రబాబును పొగిడితేనే బూతులందుకున్న బ్యాచ్ అది. వారి నుంచి ఇంత కన్నా గొప్పగా ఎవరూ అనుకోరు.
చివరికి తనను బ్రోకర్ అని తిట్టిన బీఆర్ఎస్ ను లోఫర్ అని తిట్టారు ఆర్కే. మున్సిపల్ పర్సంటేజీలో ఓట్ల శాతాన్ని బీజేపీ కంటే తక్కువ చూపిస్తూ క్లరికల్ మిస్టేక్ జరిగింది. అలాంటివి సహజంగానే జరుగుతాయని చెబుతూ.. దాన్ని చూపించి బ్రోకర్ల చేతిలో పేపర్ అంటూ బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా రాయడంతో.. లోఫర్ల చేతిలో పార్టీ ఉంటే.. ఇలాగే అంటారని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. తప్పు జరిగింది ఆర్కే వైపు నుంచే.. కానీ బ్రోకర్ లాంటి పదాలు వాడి బీఆర్ఎస్ నాయకత్వం రివర్స్ లో తిట్టించుకున్నట్లయింది.
