నిర్మాత బండ్ల గణేష్ ఎప్పుడు వేదికలపై మాట్లాడినా, ఆయన డైలాగుల్లో ప్రాసల ప్రవాహం ఉంటుంది. తాజాగా జరిగిన కే రాంప్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో కూడా ఆయన మాటలు ఆసక్తికరంగా నిలిచాయి. ముందుగా నిర్మాత రాజేష్ దండాకు చురకలాంటి సలహా ఇచ్చారు.
ఇటీవల నిర్మాత రాజేష్ రాయడానికి కూడా వీలులేని పరుష పదజాలం వాడి బహిరంగ బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని నిర్మాత బండ్ల గణేష్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. “సినిమా ఇండస్ట్రీలో వార్నింగులు పనికిరావు… ఇక్కడ రిక్వెస్టులే పనిచేస్తాయి. ఇంకెప్పుడూ అలాంటి వార్నింగులు ఇవ్వొద్దు” అని సూచించారు.
ఇదే సందర్భంలో హీరో కిరణ్ అబ్బవరంను ప్రశంసించారు. హీరో కావాలనే కలతో ఇండస్ట్రీకి వచ్చి, కష్టపడి తన కలను సాకారం చేసుకున్నాడని చెప్పారు. సినిమా ఇండస్ట్రీ ఒక సముద్రం లాంటిదని, ఇక్కడ ఎవరికైనా అవకాశాలు ఉంటాయని, నిజాయితీగా సినిమాను నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడని అన్నారు.
ఒక్క సినిమా హిట్ అవగానే చలువ కళ్లద్దాలు పెట్టుకుని యాటిట్యూడ్ చూపించే ఈ కాలంలో, ఇన్ని విజయాలు సాధించిన తర్వాత కూడా ఎంతో నమ్రతతో ఉండే కిరణ్ చాలామంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడని తెలిపారు. “కిరణ్‌ని చూస్తుంటే చిరంజీవి గారి బిగినింగ్ డేస్ గుర్తుకొస్తున్నాయి. 150 సినిమాలు చేసి, త్వరలోనే భారతరత్న తీసుకోబోతున్న చిరంజీవి గారు ఇప్పటికీ వినయంగా ఉంటారు. ఆ లక్షణాలు కిరణ్‌లో కూడా కనిపిస్తున్నాయి” అని తనదైన శైలిలో ఊగిపోతూ మాట్లాడారు బండ్ల గణేష్.
