బండ్ల గణేష్ నటుడిగా కంటే కూడా నిర్మాతగా పాపులర్. తాను తీసిన సినిమాలకంటే ఇచ్చిన స్పీచులతో ఇంకా పాపులర్ అయ్యాడు. రాజకీయాలవైపు దృష్టి సారించాడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాడు. ‘సెవన్ ఓ క్లాక్ బ్లేడ్’ అంటూ అప్పట్లో చేసిన ఓ కామెంట్ బాగా ట్రోల్ అయ్యింది. ఆ తరవాత పార్టీకి, ప్రచారానికి దూరంగా ఉన్నాడు. రాజకీయాలు వద్దూ.. అంటూ దండం పెట్టేశాడు.
అయితే ఇప్పుడు పాద యాత్ర మొదలెట్టాడు. షాద్ నగర్ నుంచి…తిరుపతి వరకూ సాగే ఈ పాద యాత్ర టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు, ఆయన క్షేమంగా బయటకు వస్తే కొండకునడిచి వస్తా అని ఓ అభిమానిగా మొక్కుకొన్నాడు. ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకొంటున్నాడు.
అయితే ఈ యాత్ర వెనుక రాజకీయ ప్రవేశ ఉద్దేశ్యం ఏమైనా ఉందా? అనేది అందరి డౌటు. ‘కేవలం ఓ అభిమానిగా మాత్రమే ఈ యాత్ర చేస్తున్నా’ అని బండ్ల చెప్పుకొంటున్నా, బండ్లకు టీడీపీ లో చేరే ఆలోచనలు ఉన్నాయని, ఈ యాత్రను అందుకు ఓ వేదికగా మార్చుకొంటున్నారని చెప్పుకొంటున్నారు. అందులో నిజానిజాలేమిటన్నది బండ్లకే తెలియాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం. సినిమా వాళ్లు అనగానే టీడీపీ అక్కున చేర్చుకొంటుంది. బండ్ల వాగ్థాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్పీచులు వైరల్ అవుతాయి. టీడీపీ తరపునుంచి స్పోక్ పర్సన్స్ చాలామందే ఉన్నారు. అందరూ గట్టిగా మాట్లాడగలరు కూడా. ఒకవేళ టీడీపీ బండ్లని పార్టీలోకి చేర్చుకొంటే టీడీపీ తరపున కాస్త గట్టిగా మాట్లాడే బృందంలో బండ్ల ని ఓ సభ్యుడిగా చూడొచ్చు. ఇప్పటికిప్పుడు కాదు కానీ, వచ్చే ఎన్నికల సమయానికైనా బండ్ల టీడీపీ కండువా కప్పుకొన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ‘నాకసలు రాజకీయాలే వద్దు’ అని బండ్ల నిజంగానే, నిజాయితీగానే అనుకొంటే అది వేరే విషయం. అయినా.. బండ్ల దృష్టి ఇప్పుడు సినిమాలపై వుంది. తన బ్యానర్ ని మళ్లీ లైమ్ లైట్ లోకి తీసుకొచ్చి, వరుసగా సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. మరి రాజకీయాలకు టైమ్ ఉంటుందో, ఉండదో..?!
