రివ్యూ: బంగారు బుల్లోడు

ఎవ‌రి కెరీర్‌కి వాళ్లే బాధ్యులు. ఎలాంటి క‌థ‌ల్ని ఎంచుకుంటున్నాం? ఎవ‌రితో ప‌నిచేస్తున్నాం? ఏ కాలంలో ఎలాంటి సినిమాల్ని చేస్తున్నాం.. అన్న‌దే కెరీర్‌ని డిసైడ్ చేస్తుంటుంది. అల్ల‌రి న‌రేష్ అలా.. త‌న కెరీర్‌ని పూల బాట చేసుకున్న‌వాడే. త‌న‌కు స‌రిప‌డ క‌థ‌ల‌తో.. చక్క‌టి వినోదంతో ప్రేక్ష‌కుల్ని న‌వ్వించాడు. విజ‌యాల్ని సాధించాడు. మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు. మ‌ళ్లీ త‌నే క‌థ‌ల ఎంపిక‌లో త‌ప్పులు చేస్తూ.. చేస్తూ.. ప‌రాజ‌యాల్ని కొనుక్కొని తెచ్చుకున్నాడు. న‌రేష్ కెరీర్ కొంత‌కాలంగా స‌వ్యంగా లేదంటే కార‌ణం.. త‌న స్వీయ త‌ప్పిదాలే. ఇప్పుడు కొంత బ్రేక్ తీసుకుని `బంగారు బుల్లోడు` సినిమా చేశాడు. మ‌రి ఈ బుల్లోడైనా న‌రేష్ ని గ‌ట్టున ప‌డేశాడా? న‌రేష్ త‌న త‌ప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నాడా..? సినిమా ఎలా వుంది?

ప్ర‌సాద్ (న‌రేష్‌) తాత‌య్య (త‌నికెళ్ల భ‌ర‌ణి) కంపాలి. ఆ ఊర్లో న‌మ్మ‌కానికి మారుపేరు. ప్ర‌సాద్ ది కూడా తాత‌య్య దారే. బ్యాంకులో ప‌ని చేస్తుంటాడు. ఇద్ద‌రు అన్న‌య్య‌లు (స‌త్యం రాజేష్‌, ప్ర‌భాస్ శీను)‌లు మాత్రం.. పైసాకి ప‌నికి రాని ఆవారాగాళ్లు. ఇంట్లో డ‌బ్బుంటే.. పేకాట ఆడేస్తుంటారు. అందుకే వాళ్ల‌కు పెళ్లిళ్లు కావు. ప్ర‌సాద్ కూడా పెళ్లి చేసుకోలేడు. అస‌లు వాళ్లింట్లో.. ఆడ‌కూతురు అడుగుపెట్ట‌లేక‌పోవ‌డానికి కార‌ణం.. ఆ ఊరి దేవ‌త‌ అమ్మ‌వారి అనుగ్ర‌హం లేక‌పోవ‌డ‌మే అని… తాత‌య్య న‌మ్మ‌కం. దానికీ ఓ కార‌ణం ఉంది. పాతికేళ్ల క్రితం అమ్మ‌వారికి న‌గ‌లు చేయించే బాధ్య‌త త‌న‌కు అప్ప‌గిస్తే.. వంద‌స‌వ‌ర్ల బంగారాన్ని త‌న స్వ అవ‌స‌రాల కోసం వాడుకుని, ఆ స్థానంలో అమ్మ‌వారికి గిల్టు న‌గ‌లు చేయిస్తాడు. ఆ పాప‌భారం త‌న‌ని వెంటాడుతూ ఉంటుంది. అమ్మ‌వారికి ఎప్ప‌టికైనా స‌రే. న‌గ‌లు చేయించి, అమ్మ‌వారి మెడ‌లో వేయాల‌ని… ప్ర‌సాద్ ద‌గ్గ‌ర మాట తీసుకుంటాడు. జ‌రిగిన త‌ప్పు తెలుసుకున్న ప్ర‌సాద్… అమ్మ వారి న‌గ‌ల కోసం.. బ్యాంకులోని న‌గ‌ల్ని తీసుకొచ్చి, వాటిని క‌రిగించేస్తాడు. తీరా చూస్తే.. గుళ్లోని అమ్మ‌వారి న‌గ‌లు మాయం అయిపోతాయి. బ్యాంకులోంచి తీసుకొచ్చిన న‌గ‌ల గురించి ఆరా మొద‌ల‌వుతుంది. ఈ గంద‌ర‌గోళంలో ప్ర‌సాద్ ఎలాంటి త‌ప్పులు చేశాడు? ఒక త‌ప్పు క‌వ‌ర్ చేసుకోవ‌డానికి మ‌రో త‌ప్పు వైపు ఎలా
న‌డిచాడు? అన్న‌దే క‌థ‌..

వాస్త‌వానికి… న‌రేష్ ఈసారి క‌థ‌పై కాస్త దృష్టి పెట్టాడ‌నిపిస్తుంది. ఎందుకంటే.. న‌రేష్ గ‌త చిత్రాల్లో ఈమాత్రం క‌థ కూడా లేదు. క‌థ‌లో కొన్ని మెలిక‌లు కూడా ఉన్నాయి. వాటిని స‌వ్యంగా వాడుకుంటే… మంచి సినిమానే అయ్యేది. ఇది వ‌ర‌కు… న‌రేష్ క‌థ ని ప‌క్క‌న పెట్టి, గార‌డీలు ఎక్కువ చేసేవాడు. స్నూఫ్‌ల‌పై ఆధార‌ప‌డేవాడు. ఈసారి వాటి జోలికి వెళ్ల‌లేదు. అది ఒకింత ప్ల‌స్‌. ఇంకాస్త మైన‌స్‌. ఎందుకంటే.. న‌రేష్ నుంచి ఆశించే కామెడీ ఈసారి.. ఈ బుల్లోడు ఇవ్వ‌లేకపోయాడు. అమ్మ‌వారి గిల్టు న‌గ‌లు – మాయం అవ్వ‌డం- ఇన్వెస్టిగేష‌న్ – మ‌రోవైపు బ్యాంకులోంచి తీసుకొచ్చిన న‌గ‌ల కోసం ఆరా మొద‌ల‌వ్వ‌డం – ఇలా.. క‌థ‌లో కావ‌ల్సినంత మేట‌రు ఉండ‌డంతో.. క‌థ చెప్ప‌డానికే ఎక్కువ స‌మ‌యం తీసుకున్నాడు. విశ్రాంతికి ముందు న‌గ‌లు మాయం అవ్వ‌డం, కాస్త టెన్ష‌న్ లాంటి వాతావ‌ర‌ణం క్రియేట్ చేయ‌డం వ‌ర‌కూ ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు. సెకండాఫ్ లో ఇది ఇన్వెస్టిగేష‌న్ మూడ్ లోకి వెళ్తుందేమో అనిపించింది. అలా జ‌రిగినా బాగుండేది. న‌రేష్ ని కొత్త రకం క‌థ‌లో చూసే వీలు ద‌క్కేది. కానీ.. ద‌ర్శ‌కుడు అలాంటి అవ‌కాశాన్ని చేజేతులా జార‌విడుచుకున్నాడు.

న‌రేష్ గ‌త చిత్రాల‌న్ని ఈసారి ద‌ర్శ‌కుడికి వ‌రుస పెట్టి గుర్తొచ్చేసి ఉంటాయి. దాంతో.. సినిమాలో కామెడీ లేక‌పోతే బాగోదు.. అనేసుకుని జ‌బ‌ర్‌ద‌స్త్ టైపు ఎపిసోడ్లు కొన్ని రాసేసుకున్నాడు. గెటప్ శ్రీ‌నుకి ఆడ‌వేషం వేయ‌డం, త‌న చుట్టూ స‌త్యం రాజేష్‌, ప్ర‌భాస్ శీను చొంగ కార్చుకుంటూ తిర‌గ‌డం.. ఇదంతా జ‌బ‌ర్‌ద‌స్త్ ప్ర‌భావ‌మే. అయితే టీవీలో చూస్తే.. ఇలాంటివి న‌వ్వుకోవొచ్చేమో. థియేట‌ర్ స‌రుకు కాదు. పాముల్ని కొద‌వ పెట్టి, వ‌డ్డీలు ఇచ్చే వ్యాపారి పాత్ర‌లో పోసాని, అమాయ‌కపు ఎన్ఆర్.ఐ బ‌క‌రా.. వెన్నెల కిషోర్‌.. ఇలాంటి సెట‌ప్పులు కొన్ని చేసుకున్నా స‌రిపోలేదు. న‌రేష్ ఎప్పుడూ ఓ సీరియ‌స్ సిట్యువేష‌న్‌లోనే ఉంటాడు. కాబ‌ట్టి.. తాను కామెడీ చేసేందుకు అంత స్కోప్ లేదు. చుట్టు ప‌క్క‌ల పాత్ర‌లూ.. బేల మొహాల‌తో చూసేస‌రికి, ఆ పాత్ర‌ల‌పై ద‌ర్శ‌కుడు శ్ర‌ద్ధ పెట్ట‌క‌పోయే స‌రికి… న‌వ్వుల్లేక‌.. విల‌విల‌లాడిపోయిందీ క‌థ‌. పోనీ.. థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేష‌న్ అయినా సాగిందా? అంటే.. ఇంట్ర‌వెల్ ముందు హ‌డావుడి చేసిన పోలీస్ ఆఫీస‌ర్ అజ‌య్ ఘోష్‌.. ఆ త‌ర‌వాత‌.. చ‌ప్పున చ‌ల్లారిపోతాడు. దాంతో.. అటు న‌రేష్ శైలి కామెడీకీ, ఇటు త‌రం థ్రిల్ల‌ర్ సినిమాకీ కాకుండా పోయింది.

న‌రేష్ య‌థావిధిగా త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేశాడు. న‌వ్వించ‌డానికి స్కోప్ లేక‌పోయినా.. ఎక్క‌డ వీలు ద‌క్కినా.. ఏదో ఒక‌టి ట్రై చేసి, న‌వ్వించ‌డానికి శ‌త‌విధాలా త‌ప‌న ప‌డ్డాడు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. హీరోయిన్‌ పూజా జావేరీ ది విష‌యం లేని పాత్ర‌. త‌న స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాలేదు. హీరో – హీరోయిన్ ట్రాక్ బోర్ కొట్టించింది. వెన్నెల కిషోర్ కాస్త బెట‌ర్‌. త‌న ఎపిసోడ్ కొంత వ‌ర‌కూ గ‌ట్టెక్కించింది. పోసాని, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శీను.. వీళ్లంతా ఉన్నా – వాళ్ల‌కు స‌రిప‌డా కామెడీ లేదు.

బంగారు బుల్లోడు అనే పేరు పెట్టుకున్నందుకు అవ‌స‌రం లేక‌పోయినా స‌రే, స్వాతిలో ముత్య‌మంత‌… పాట‌ని ఈ సినిమా కోసం రీమిక్స్ చేసుకున్నారు. పాట‌లో న‌రేష్ స్టెప్పులు ట్రెండీగా ఉన్నా, ఎందుకో… పాత పాటే.. వంద రెట్ల న‌యం అన్న ఫీలింగ్ వ‌స్తుంది. పాట‌లు త‌క్కువే. కానీ రిజిస్ట‌ర్ కావు. ప‌ల్లెటూరు నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. త‌క్కువ బ‌డ్జెట్‌లో ముగించార‌నిపిస్తుంది. ద‌ర్శ‌కుడు రాసుకున్న క‌థ‌లో కాస్తో కూస్తో మేట‌ర్ వుంది. అయితే… ఆ క‌థ ని అటు న‌రేష్ శైలికి, ఇటు ఈత‌రం ప్రేక్ష‌కుల అభిరుచికీ త‌గినట్టుగా మ‌ల‌చ‌లేక‌పోయాడు.

ఫినిషింగ్ టచ్‌: రోల్ గోల్డ్ న‌వ్వులు

రేటింగ్: 1.5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోడీ ఆలోచిస్తారు..కేటీఆర్ పాటిస్తారు..! మరీ ఇంత ఫాస్టా..?

తెలంగాణలో " ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" పేరిట వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల పన్నెండు నుంచే... ప్రారంభించాలని ఆదేశించారు. ఆగస్టు పదిహేను వరకు సాగుతాయి. ఉత్సవాలకు రూ.25...

వైసీపీపై రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్‌కు కోపం ఎందుకు..!?

రిపబ్లిక్ టీవీ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆర్నాబ్ గోస్వామి తన అరుపులతోనే ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆయన నేతృత్వంలో నడుస్తున్న చానల్‌పై ఉన్న వివాదాలు అన్నీ...

అంతా రాజకీయమే..! స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేదెలా..?

స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం తేల్చేసింది. రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలను.. అధికార ప్రతిపక్ష లేఖను కేంద్రం పట్టించుకోలేదు. చెత్తబుట్టలో వేసింది. ఎవరేం అనుకున్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం అమ్మి తీరుతామని స్పష్టం...

సీబీఐ చేతికి నయీం కేసు..! రాజకీయ ప్రకంపనలు తప్పవా..!?

తెలంగాణలోకి సీబీఐకి ఎంట్రీ నయీం కేసు ద్వారా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నయీం కేసును సీబీఐకి ఇస్తారా అంటూ.. కేంద్ర హోంశాఖ నుంతి తెలంగాణ సర్కార్‌కు లేఖ వచ్చింది. సాధారణం రాష్ట్ర ప్రభుత్వం...

HOT NEWS

[X] Close
[X] Close