బంగ్లాదేశ్ క్రికెట్లో ప్రస్తుతం నెలకొన్న అస్థిరత, భారత్‌తో క్రీడా సంబంధాల తెగిపోవడం వంటి పరిణామాలు ఆ దేశ క్రికెట్ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేస్తున్నాయి. ఒకప్పుడు జింబాబ్వే క్రికెట్ ఏ విధంగానైతే రాజకీయ జోక్యం వల్ల పతనమైందో, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే ప్రమాదకరమైన బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది.
రాజకీయ క్రీడలో చిక్కుకున్న క్రికెట్
బంగ్లాదేశ్‌లో తలెత్తిన తాజా రాజకీయ మార్పులు ఆ దేశ క్రికెట్ బోర్డును తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. కేవలం రాజకీయ కారణాలతో భారత్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడబోమంటూ బంగ్లాదేశ్ మొండికేయడం క్రీడా ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. క్రీడలను దౌత్యపరమైన ఆయుధంగా వాడుతూ భారత్‌పై వ్యతిరేకతను ప్రదర్శించడం వల్ల నష్టపోయేది బంగ్లాదేశ్ క్రికెటే. ఆర్థికంగా కూడా భారత్ నుంచి వచ్చే సపోర్టుతోనే బంగ్లా క్రికెట్ అభివృద్ధి చెందుతోంది.
జింబాబ్వే చేదు జ్ఞాపకాలు పునరావృతం?
బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితి 2003 నాటి జింబాబ్వేను తలపిస్తోంది. నాడు రాబర్ట్ ముగాబే ప్రభుత్వ జోక్యం వల్ల జింబాబ్వే క్రికెట్ బోర్డు కుప్పకూలింది. ఆండీ ఫ్లవర్, హెన్రీ ఒలోంగా వంటి దిగ్గజ ఆటగాళ్లు నిరసన వ్యక్తం చేస్తూ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ దేశ క్రికెట్ దశాబ్దాల పాటు వెనకబడిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో కూడా ఆటగాళ్ల సమ్మె బెదిరింపులు, బోర్డు అధికారుల తొలగింపు, ఐసీసీ ఆదేశాలను ధిక్కరించే ధోరణి కనిపిస్తోంది. ప్రతిభావంతమైన టీమ్ ఉన్నప్పటికీ, బోర్డులో నెలకొన్న అరాచకత్వం వల్ల బంగ్లాదేశ్ కూడా జింబాబ్వేలాగే అంతర్జాతీయ క్రికెట్ చిత్రపటంలో నామమాత్రపు జట్టుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
భారత్‌తో వైరం ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ
క్రికెట్ ప్రపంచంలో భారత్ ఒక ఆర్థిక శక్తి. భారత్‌తో మ్యాచ్‌లు ఆడటం లేదా ఐపీఎల్ వంటి వేదికలపై మెరవడం వల్ల బంగ్లాదేశ్ బోర్డుకు, ఆటగాళ్లకు భారీ ఆదాయం సమకూరుతుంది. కానీ ఇప్పుడు భారత్‌పై వ్యతిరేకతతో మ్యాచ్‌లను బహిష్కరించడం, ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించడం వంటి నిర్ణయాలు బంగ్లాదేశ్ క్రికెట్ ఆర్థిక మూలాలనే దెబ్బతీస్తాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం టోర్నమెంట్లను బహిష్కరిస్తే ఆ జట్టు పాయింట్లు కోల్పోవడమే కాకుండా, భారీ జరిమానాలు , సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది.
రాజకీయాలను క్రీడల్లోకి తీసుకురావడం వల్ల మంచి భవిష్యత్ ఉన్న జట్టు తన ఉనికిని కోల్పోయే దశకు చేరుకుంది. అది క్రికెట్ కు మంచిది కాదు.
