టీ20 ప్రపంచకప్‌లో భారత్‌లో ఆడాల్సిన మ్యాచ్‌లను ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడం ఆ దేశ క్రికెట్‌కు గొడ్డలిపెట్టుగా మారింది. భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత లేదంటూ రాజకీయ కారణాలతో బంగ్లాదేశ్ ప్రభుత్వం పట్టుబట్టింది. దీంతో ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుంది. జనవరి 21తో ముగిసిన గడువులోగా బీసీబీ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో, బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్ ను చేర్చుకునేందుకు ఐసీసీ సిద్ధమైంది.
అకారణంగా భారత్‌పై చూపిస్తున్న రాజకీయ ద్వేషం వల్ల, ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న క్రికెట్ దేశం ప్రపంచ వేదికపై తన స్థానాన్ని కోల్పోయే దుస్థితికి చేరుకుంది. ఈ నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెట్‌పై కోలుకోలేని దెబ్బ తీయబోతోంది. ఒకసారి ఐసీసీ ఈవెంట్‌ను బహిష్కరిస్తే, భవిష్యత్తులో ఆ దేశానికి వచ్చే నిధులపై కోత పడటమే కాకుండా, ఇతర దేశాలు కూడా బంగ్లాదేశ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు వెనకడుగు వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్ వంటి శక్తివంతమైన దేశంతో క్రికెట్ సంబంధాలు తెగిపోతే, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా కుప్పకూలడం ఖాయం.
పాకిస్థాన్ వంటి దేశాలు మినహా, మిగతా ప్రపంచ దేశాలతో క్రికెట్ ఆడటం దాదాపు అసాధ్యం కావచ్చు. ఇది బంగ్లా క్రికెట్‌ను పతనానికి దిశగా తీసుకెళ్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక క్రీడల కన్నా రాజకీయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐసీసీ స్వయంగా భద్రతా తనిఖీలు చేసి భారత్ సురక్షితమని సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ, బీసీబీ తన పంతాన్ని వీడలేదు. ఫలితంగా, దశాబ్దాల కాలంగా నిర్మించుకున్న క్రికెట్ సామ్రాజ్యం ఇప్పుడు రాజకీయ స్వార్థం వల్ల కుప్పకూలిపోతోంది. బంగ్లాదేశ్ అభిమానులు తమ జట్టును ప్రపంచకప్‌లో చూసుకోలేకపోవడమే కాకుండా, రాబోయే రోజుల్లో ఆ దేశంలో అంతర్జాతీయ క్రికెట్ మనుగడ సాగించడమే ప్రశ్నార్థకంగా మారింది.