ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 750 కోట్ల రూపాయలతో ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. గతంలోనే భూమిపూజ నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో తుళ్లూరు గ్రామానికి సమీపంలో సుమారు 21 ఎకరాల విస్తీర్ణంలో ఆస్పత్రి నిర్మిస్తున్నారు.
అత్యాధునిక చికిత్సా పరికరాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలతో ఈ సెంటర్ రూపుదిద్దుకోనుంది. రాజధాని ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున నిర్మిస్తున్న ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే, కేవలం ఆంధ్రప్రదేశ్ వారే కాకుండా పొరుగు రాష్ట్రాల ప్రజలకు కూడా మెరుగైన క్యాన్సర్ చికిత్స లభిస్తుంది. ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి వర్గాలకు రాయితీ ధరలపై నాణ్యమైన వైద్యం అందిస్తుంది.
నిర్ణీత కాలపరిమితిలోగా అంతర్జాతీయ ప్రమాణాలతో భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థ కాంట్రాక్ట్ పొందిన సంస్థ సన్నాహాలు చేసింది. మొదటి దశలో భాగంగా ఆసుపత్రి సేవలు ప్రారంభించి, క్రమంగా రీసెర్చ్ సెంటర్ , అకాడమిక్ విభాగాలను విస్తరించనున్నారు. అమరావతి రాజధాని నగరంలో హెల్త్ సిటీ నిర్మాణానికి ఈ ప్రాజెక్ట్ ఒక ప్రేరణగా నిలవనుంది. బాలకృష్ణ స్వయంగా పనులను పర్యవేక్షిస్తుండటంతో త్వరలోనే రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.