“బీబీసీలో చెప్పారు” అంటే అది కచ్చితమైన వార్త అని ఒకప్పుడు మనోళ్లకు గట్టి నమ్మకం. ఇప్పటికీ ఆ చానల్ కు మంచి పేరే ఉంది. అలాంటి బీబీసీ న్యూస్ ప్రసారాలు తెలుగులో మొదలు కాబోతున్నాయి. 1940 తర్వాత బీబీసీ అతిపెద్ద విస్తరణ కార్యక్రమాన్ని ప్రకటించింది. అది అమల్లోకి వస్తే 40 భాషల్లో ఈ ప్రసారాలు అందుబాటులోకి వస్తాయి. తెలుగులోనూ మనం బీబీసీ న్యూస్ చూడొచ్చు.
బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ భారత్ లోని తెలుగు, గుజరాతీ, మరాఠీ, పంజాబీ భాషల్లో ప్రసారాలను ప్రారంభిస్తుంది. బీబీసీ న్యూస్ ప్రస్తుతం వారానికి 249 మిలియన్ల మందికి సమాచారాన్ని చేరవేస్తోంది. 2022 నాటికి 50 కోట్ల మందికి ప్రసారాలను అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆసియాలో భారత్ తో పాటు కొరియాపై బీబీసీ దృష్టి పెట్టింది. ఇప్పటి వరకూ పట్టించుకోని ఆఫ్రికా దేశాల్లోనూ విస్తరించనుంది.
తాజాగా ప్రకటించిన భారీ విస్తరణ కోసం బీబీసీ 289 మిలియన్ పౌండ్ల బడ్జెట్ కేటాయించింది. 1922 జనవరి 1న బీబీసీ రేడియో స్టేషన్ ప్రారంభమైంది. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న బీబీసీ తర్వాత టీవీ ప్రసారాల ద్వారా మరింత మందికి చేరువైంది. ప్రస్తుతం ఈ సంస్థలో సుమారు 21 వేల మంది పనిచేస్తున్నారు. విస్తరణ అమల్లోకి వస్తే కొత్తగా మరో 1300 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.