సెప్టెంబరు బాక్సాఫీసుకు బాగానే కలిసొచ్చింది. లిటిల్ హార్ట్స్ మంచి విజయాన్ని అందుకొంది. మిరాయ్ వంద కోట్ల సినిమాగా నిలిచింది. కిష్కింధకాండకు మిక్డ్స్ రివ్యూలు వచ్చినా, బాక్సాఫీసు దగ్గర నిలబడగలిగింది. వసూళ్ల పట్ల నిర్మాతలు హ్యాపీగానే ఉన్నారు. ఇదే జోష్ ఈవారం కూడా కొనసాగాలని టాలీవుడ్ భావిస్తోంది.
ఈవారం విడుదల అవుతున్న సినిమాల్లో ‘బ్యూటీ’ ఒకటి. అంకిత్ కొయ్య హీరోగా నటించాడు. నీలఖి కథానాయికగా పరిచయం అవుతోంది. ఈనెల 19న విడుదల కానుంది. అయితే 18 నుంచే ప్రీమియర్ల హడావుడి మొదలైపోతోంది. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, నెల్లూరు ప్రాంతాల్లో ప్రీమియర్లు పడబోతున్నాయి. ఈ పెయిడ్ ప్రీమియర్లకు మంచి స్పందనే వస్తోంది. గురువారం ఉదయమే మీడియా కోసం ఓ స్పెషల్ షో ఏర్పాటు చేసింది చిత్రబృందం. బ్యూటీలో స్టార్లు ఎవరూ లేరు. చిత్రబృందం కథనే బలంగా నమ్ముతోంది. కథకు మించిన స్టార్ లేడు అంటోంది. తండ్రీ కూరుర్ల అనుబంధం నేపథ్యంలో నడిచే ఓ మిడిల్ క్లాస్ డ్రామా ఈ సినిమా. ఈతరం కనెక్ట్ అయ్యేలా కథ, కథనాలు ఉండబోతున్నాయని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఆయన పాటలు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తాయని చిత్రబృందం నమ్ముతోంది. ప్రీమియర్లతో మంచి టాక్ సంపాదిస్తే.. రిలీజ్ రోజున బాక్సాఫీసు దగ్గర సందడి కనిపించే అవకాశం ఉంది.