కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో పెద్ద చిక్కు సమస్య వచ్చి పడింది. హైకమాండ్ కూడా ఈ సమస్యపై మండిపడింది. బెంగళూరు శివారులోని కోగిలు అనే ప్రాంతంలో కూల్చివేతలు చేపట్టడమే ఈ సమస్య.
యలహంక సమీపంలోని కోగిలు గ్రామంలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని పదేళ్ల క్రితం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం కేటాయించారు. అయితే ఆ స్థలాన్ని కొంత మంది ముస్లింలు ఆక్రమించుకుని ఫకీర్ కాలనీ, వసీం లేఅవుట్ పేరుతో ఇళ్లు, షెడ్లు నిర్మించుకున్నారు. హఠాత్తుగా వారం రోజుల కిందట తెల్లవారుజామున 4 గంటలకు భారీ పోలీస్ బందోబస్తుతో అధికారులు. కూల్చివేతలు ప్రారంభించారు. సుమారు 150 నుండి 200 ఇళ్లను నేలమట్టం చేశారు.
బాధితులంతా ముస్లింలే కావడంతో వివాదం అయింది. వాళ్లు కేరళ వాసులు కాకపోయినా కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఉత్తరాదిలోని బుల్డోజర్ రాజ్ సంస్కృతిని తలపిస్తోందని విమర్శించారు. దీనికి కారణం కేరళలో ముస్లింలు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి మద్దతుగా ఉన్నారు. దీంతో కంగారు పడిన కాంగ్రెస్ హైకమాండ్ లో కీలక పాత్ర పోషిస్తున్న కేరళ నేత కేసీ వేణుగోపాల్ వెంటనే స్పందించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ విషయంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లతో ఫోన్లో మాట్లాడారు. అక్రమ కట్టడాల తొలగింపు విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా, సున్నితంగా వ్యవహరించాల్సి ఉందని ఆయన. మండిపడ్డారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని, ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు.
ఫకీర్ కాలనీ, వసీంలేఔట్ పేరుతో ముస్లింలు ఆక్రమించుకుంటే తొలగించే ప్రయత్నం చేయడం ఇంత దుమారం రేపుతుందని కాంగ్రెస్ నేతలు ఆలోచించలేదు. దీంతో వెంటనే ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు తగిన పునరావాసం కల్పించి, అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించారు. బాధితుల గోడు వినడానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని వేణుగోపాల్‌కు వివరించారు. దీంతో అసలు కర్ణాటక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరని ఆయనను సోషల్ మీడియాలో ప్రశ్నించేవారు ఎక్కువగా ఉన్నారు . కాంగ్రెస్ ఏదైనా సింపుల్ చేయాలనుకుంటే చినిగి చాటంత అవుతుందని ఇలాంటి వాటిని చూసే చెబుతూంటారు.