పాకిస్తాన్‌పై భారత్ ఆర్థిక యుద్ధం చేస్తోంది. ప్రస్తుత ప్రపంచంలో ఏ పనికైనా డబ్బు ఉండాలి. అది మనిషికి అయినా..దేశానికి అయినా. యుద్ధానికి ముందు శత్రువును బలహీనపరచడం అనేది అసలైన వ్యూహం. అందుకే శత్రువైన పాకిస్తాన్ ను ఆర్థికంగా బలహీనం చేసేందుకు భారత్ పహల్గాం ఎటాక్ జరిగిన రెండో రోజు నుంచే వ్యూహాలు అమలు చేస్తోంది. ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.
పాకిస్తాన్‌తో అన్ని రకాల వ్యాపార బంధాలను భారత్ తెంచుకుంది. ఒక్క రూపాయి కూడా భారత్ నుంచి పాకిస్తాన్ కు చేరదు. వస్తువులు కూడా వెళ్లవు. భారత్ నుంచి వచ్చే దిగుమతల కోసం ఇప్పుడు పాకిస్తాన్ ఇతర దేశాలపై ఆధారపడాలి. దాని వల్ల ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. తాజాగా పోర్టుల్లో నౌకలు కూడా పాకిస్తాన్ నుంచి రావడానికి వీల్లేదని స్పష్టం చేసింది. చివరికి మెయిల్స్ కూడా పాకిస్తాన్ నుంచి రాకూడదని ఆంక్షలు విధించింది. ఇప్పటికే ఎయిర్ స్పేస్ మూసివేయడం వల్ల కనీసం వెయ్యి కోట్ల రూపాయల నష్టం పాకిస్తాన్ కు జరుగుతోంది.
మరో వైపు పాకిస్తాన్ రుణఊబిలో ఉంది. ఆ దేశం వల్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు చాలా స్వల్పంగా ఉన్నాయి. మహా అయితే సాధారణ పరిస్థితుల్లో రెండు నెలల దిగుమతులకే పనికి వస్తాయి. యుద్ధం వస్తే పది రోజులు కూడా సరిపోవు. మరో వైపు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు, ఇతర నిధులు ఇవ్వడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించి .. ఆర్థిక సాయాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోతోంది.
మరో వైపు ఈ ఉద్రిక్త , టెన్షన్ పరిస్థితుల్ని భారత్ అలా కొనసాగిస్తోంది. దీని వల్ల పాకిస్తాన్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఆ దేశానికి వచ్చే వారు తగ్గిపోయారు.. కనీసం పాకిస్తాన్ ఎయిర్ స్పెస్ నుంచి ప్రయాణించేందుకూ భయపడుతున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే వారం పది రోజుల్లో పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావడం ఖాయమని అనుకోవచ్చు.